
జవాబుదారీతనం ఎలా?
ఎన్‌జేఏసీపై సుప్రీం కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) పనితీరుకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పలు ప్రశ్నలు సంధించింది. ‘న్యాయ వ్యవస్థ పనితీరును ఆ కమిషన్ ఏ విధంగా అర్థవంతంగా, జవాబుదారీగా మారుస్తుంది?’ అని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రభుత్వాన్ని అడిగేముందు, మేం అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం’ అని ఎన్‌జేఏసీకి వ్యతిరేకంగా వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు వివరించింది.
ఆ కమిషన్ ప్రభుత్వానికే జవాబుదారీ కనుక ఈ ప్రశ్నలను ప్రభుత్వాన్నే అడగడం మంచిదని ధావన్ బదులిచ్చారు. ఎన్‌జేఏసీ చట్టంలోని ‘లక్ష్యాలు- కారణాలు’లో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం పై సందేహాలను వ్యక్తం చేస్తూ.. వారు చెబుతున్న అర్థవంతమైన పాత్ర అంటే ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్‌లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సభ్యులుగా ఉండటంపై.. ‘ఇద్దరు రాజకీయ నేతలు, వారిమధ్య ఇరుక్కుపోయిన చీఫ్ జస్టిస్.. వీరు ముగ్గురు న్యాయ నియామకాల్లో జోక్యం చేసుకోగల ఇద్దరు వ్యక్తులను ఎలా నిర్ణయిస్తారు?’ అని ప్రశ్నించింది. ‘న్యాయవ్యవస్థలో ప్రాథమిక, దిగువ స్థాయి నియామకాలకు వారి(ప్రముఖులైన ఇద్దరు సభ్యులు) స్థాయి సరిపోతుంది కావచ్చు కానీ ఉన్నతస్థాయి నియామకాల్లో న్యాయమూర్తిగా, లేదా న్యాయవాదిగా అభ్యర్థి సామర్ధ్యాన్ని గుర్తించగలగడం ముఖ్యం.
అది వారు చేయగలరా’ అని జస్టిస్ గోయెల్ వ్యాఖ్యానించారు. ఆ సభ్యులకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని, ఆ మూడేళ్లూ వారిని భరించాల్సిందేనని ధావన్ పేర్కొన్నారు. ఎన్‌జేఏసీ చట్టం 2014, సంబంధిత రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పై ప్రశ్నలను ధర్మాసనం సంధించింది.
న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసు
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో నిరాధారమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇది రాజకీయ వేదిక కాదని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆయనను మందలించింది. ఈ తరహాలో పిల్ దాఖలు చేసినందుకు ఇక ముందు మరెప్పుడూ పిల్ దాఖలు చేయకుండా ఎందుకు అనర్హుడిగా చేయకూడదో చెప్పాలని, దీనికి వారంలోగా సమాధానం ఇవ్వాలని శుక్రవారం కోర్టు ఆదేశించింది.
శర్మ దాఖలు చేసిన పిల్‌లోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. శర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సుప్రీంకోర్టులో అనవసరంగా పిల్‌లు దాఖలు చేస్తున్న విషయాన్ని తాము గుర్తించామని, చెత్త ఆరోపణలతో ఇలా ఎవరంటే వారిపై పిల్‌లు దాఖలు చేయడానికి కోర్టు రాజకీయ వేదిక కాదని ధర్మాసనం పేర్కొంది.