న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేష న్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్ గుర్తింపు లేదన్న కారణంతో ప్రజలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతారంటూ పిటిషనర్ వ్యక్తం చేసిన సందేహం ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై జడ్జీలు జస్టిస్ ఎ.ఎం.ఖన్‌విల్కర్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
‘కేవలం మీ సందేహాలపైనే ఉత్తర్వులు జారీ చేయలేం. పథకాల ప్రయోజనాలు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే కోర్టు ముందుకు తీసుకురండి. సమస్య ఏంటో చెప్పండి’ అని పిటిషనర్లకు సూచించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఆధార్ లేకున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తదితర గుర్తింపు కార్డులతో పథకాల లబ్ధి పొందవచ్చని విన్నవించారు. ఆధార్ లేకుండా పథకాల లబ్ధి పొందేందుకు గడువును సెప్టెంబర్ 30కి పొడిగించినట్లు వివరించారు.