న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు. ఎన్‌జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్‌కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారాయన. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకించిన ఆయన.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు, సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. నిబంధనను రద్దు చేయవచ్చని ఎక్కడా చెప్పలేదు అంటూ పేర్కొన్నారాయన. ఆ సమయంలో రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు.
ఎన్‌జేఏసీ చట్టం.. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వోటింగ్ ద్వారా ఆమోదం పొందిందని ధన్‌కర్ గుర్తు చేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టంతో వ్యవహరించింది. రికార్డు విషయంగా మొత్తం లోక్‌సభ ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మేధావులను, న్యాయవేత్తలను కోరేది ఒక్కటే. దయచేసి.. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో.. ఒక సమాంతరాన్ని కనుగొనండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఉప రాష్ట్రపతి ధన్‌కర్ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment