అరుణ్ జైట్లీపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు దేశద్రోహం అభియోగాలు మోపింది. జైట్లీ విమర్శలను సుమోటోగా స్వీకరించిన ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్ కోర్టు న్యాయమూర్తి అంకిత్ జియోల్ ఆయనకు సమన్లు జారీచేశారు. నవంబర్ 19న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. గ్యాంగ్‌రేప్ విషయంలో చాలాసందర్భాల్లో అసలు కన్నా కల్పితమైన ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌కు కూడా న్యాయమూర్తి జియోల్ సమన్లు జారీచేశారు.
ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తుల నియంతృత్వాన్ని భారత ప్రజస్వామ్యం అంగీకరించబోదని అరుణ్ జైట్లీ తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, భారత శిక్షాస్మృతి ప్రకారం 124ఏ సెక్షన్ దేశద్రోహం, సెక్షన్ 505 బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు మోపారు. ఆయన వ్యాఖ్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో సెక్షన్ 190 ప్రకారం సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.