రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో 160 సంవత్స రాలకు పైగా చర్చ జరుగుతున్న ఈ చట్టం అమలు తీరు, దాని పర్యవసానాలపై పౌర సమాజం ఆసక్తితో ఉంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం వెలుగులో జీవిస్తున్న సమాజం మనది. మానవ సమాజ పరిణామ క్రమంలో మనుషులకు అవసరం లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ విధంగానే నల్ల చట్టాలు కూడా మిగలొద్దని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో దేశాలు వాటిని రద్దు చేసుకున్నాయి. మరి మనది 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం. రాజుల కాలం పోయింది. సంస్థానాలు కూలిపోయి నాయి. కానీ రాజులేని కాలంలో రాజద్రోహ చట్టాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య దేశంలో ఒక అవమానకరమైన పరిస్థితిని సూచిస్తుంది. అందుకేనేమో తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే రాజద్రోహానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.
భారత స్వతంత్ర ఆకాంక్షను అణచివేయడానికి బ్రిటిష్ వారు 1860లో ఇండియన్ పీనల్ కోడ్‌లో రాజద్రోహాన్ని పొందుపరిచారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి స్వతంత్ర సమరయోధులు రాజద్రోహం కింద ఆనాడు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఉద్యమిస్తున్న వారిని ఈనాడు అదే చట్టం కింద నిర్బంధించడం సిగ్గుచేటు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ ఈ చట్టం ఎత్తివేతకు అన్ని పార్టీలతో కార్యాచరణను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందులో కలిసి రావాలని రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించడం జరిగింది. మావోయిస్టులే చర్చలకు సిద్ధమ వుతున్నప్పుడు ఈ చట్టం మరింత కాలం చెల్లినది అని చెప్పక తప్పదు. (చదవండి: కార్మిక హక్కులకు అసలు ప్రమాదం)
చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ఈనాటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కె.ఎం. మున్షీ లాంటివారు దీన్ని అత్యంత క్రూరమైన చట్టంగా అభివర్ణించారు. వ్యక్తి హక్కులను నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ఈ చట్టం ప్రజా స్వామ్య మనుగడకు ప్రమాదకరమని రాజ్యాంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ ఉండదు. ప్రశ్న ప్రజాస్వామ్య ఉనికికి జీవగర్ర లాంటిది. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల అణచివేతకు కారణమవుతున్న రాజద్రోహాన్ని భారత శిక్షా స్మృతి నుండి తొలగించాలని ఇప్పటికే అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రయత్నంలో న్యాయవ్యవస్థ సఫలీకృతం అయితే భారత ప్రజలకు ఒక భరోసా లభించినట్లే. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతు విప్పవలసిన సమయం ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొనే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ సత్యం గ్రహించాలి. ప్రజాస్వామ్యం అంతిమసారం అదే. రాజ్యంగ స్ఫూర్తి కూడా అదే. (చదవండి: అసమ్మతి గళాలపై అసహనం)
- డాక్టర్ చెరుకు సుధాకర్
తెలంగాణా ఇంటి పార్టీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment