‘సుప్రీం’లో ఆప్‌ సర్కార్‌కు ఊరట | Supreme Court Pauses Delhi High Court Ayushman Bharat Order | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్ భారత్.. ఆప్‌ సర్కార్‌కు ఊరట

Published Fri, Jan 17 2025 1:00 PM | Last Updated on Fri, Jan 17 2025 1:49 PM

Supreme Court Pauses Delhi High Court Ayushman Bharat Order

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్‌ సర్కార్‌ ఓ పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్‌, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

ఆయుష్మాన్‌ భారత్‌(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.

దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్‌ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్‌ ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

ఏమిటీ పథకం.. 
పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్‌ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. 

సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్‌ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement