సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది
అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు.
ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు.
ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు.
అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment