ఎస్‌బీఐపై సుప్రీం మండిపాటు
నంబర్లతో పాటు ఎన్నికల బాండ్ల వివరాలన్నీ వెల్లడించాల్సిందే
ఎల్లుండి సాయంత్రానికల్లా ఈసీకి అందించాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న పారీ్టల వివరాలను బయట పెట్టే యునిక్ బాండ్ నంబర్లను ఎందుకు వెల్లడించలేదని బ్యాంకును నిలదీసింది. బాండ్ల వివరాలను ఒక్కటొక్కటిగా కాకుండా ఈ నెల 21 సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో ఈసీకి అందజేయాలని ఆదేశించింది.
‘‘యునిక్ బాండ్ నంబర్లతో పాటు బ్యాంకు దగ్గరున్న మొత్తం సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు’’ అని కుండబద్దలు కొట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌బీఐ అందజేసిన వివరాలన్నిటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
చైర్మన్, ఎండీ అఫిడవిట్ దాఖలు చేయాలి
ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధమని, దాతలు, గ్రహీతల వివరాలను మార్చి 13వ తేదీ కల్లా వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్‌బీఐ వేసిన పిటిషన్‌ను ఈ నెల 11న న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల అరకొర వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎస్‌బీఐని సోమవారం సంజాయిషీ కోరింది.
‘‘21వ తేదీ సాయంత్రానికల్లా పూర్తి వివరాలు ఈసీకివ్వండి. ఎన్నికల బాండ్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారమతటినీ ఈసీకి అందించామని, ఇంతకుమించి ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొంటూ ఎస్‌బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని స్పష్టం చేసింది. బాండ్ల వివరాలను వెల్లడించరాదన్న తమ పిటిషన్లపై సత్వరం విచారణ జరపాలన్న పరిశ్రమల సంఘాల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచి్చంది.
ఎన్నికల బాండ్ల పథకం మొదలైన 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ దాకా విక్రయించిన బాండ్ల వివరాలను బయట పెట్టాలన్న పిటిషన్‌నూ కొట్టేసింది. బాండ్ల వివరాలను వెల్లడించాలన్న తీర్పుపై సుమోటోగా సమీక్ష జరపాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిశ్ సి.అగర్వాలా రాసిన లేఖను కూడా బుట్టదాఖలు చేసింది. ఇవన్నీ ప్రచార స్టంట్లంటూ సీజేఐ మండిపడ్డారు.
కామెంట్లకు మేమూ అతీతం కాదు!
ఎన్నికల బాండ్ల తీర్పును సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని, కేంద్రంపై అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్నవారే దీనిపై ఇంటర్వ్యూలిస్తూ కావాలనే సుప్రీంకోర్టుకు కూడా ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు.
‘‘మా తీర్పులను ఎవరెలా వ్యాఖ్యానిస్తున్నారన్న దానితో మాకు సంబంధం లేదు. మా ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే మాకు ముఖ్యం. న్యాయమూర్తులుగా మేం రాజ్యాంగబద్ధంగా తీర్పులు వెల్లడిస్తాం. చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం. మీడియా, సోషల్ మీడియా కామెంట్లకు మేం కూడా అతీతమేమీ కాదు. కానీ వాటిని తట్టుకునే శక్తి మాకు, న్యాయవ్యవస్థకు ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment