న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 21లోగా అందించాలని ఎస్‌బీఐకు సుప్రీం డెడ్‌లైన్ విధించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నేడు సర్వోన్నత న్యాయస్థానంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిలో సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర, సీజేఐ మధ్య జరిగిన సంభాషణ ఒకటి.
ఎలక్టోరల్ బాండ్ల కేసు అసలు న్యాయబద్దమైన సమస్య కాదని, ఇది విధానపరమైన అంశమని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర పేర్కొన్నారు. దీనిలో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైనది కాదని తెలిపారు. కావున ఈ కేసులో తీర్పుపై పునఃసమీక్ష చేయాలని కోరారు. నెడుంపర మాట్లాడుతుండగానే సీజేఐ మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడారు.. ‘మిస్టర్ నెడుంపర నేను ఈ దేశ పౌరుడిని.’ నాపై అరవొద్దు అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. దీనిపై నెడుంపర స్పందిస్తూ.. ‘లేదు, లేదు, నేను చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాను’ అంటూ బదులిచ్చారు.
సీజేఐ చంద్రచూడ్ కల్పించుకొని.. ఇది హైడ్ పార్క్ కార్నర్ మీటింగ్ కాదని అన్నారు. ‘మీరు కోర్టులో ఉన్నాను. మీరు ఒకవేళ పిటిషన్ వేయాలనుకుంటే ఫైల్ చేయండి. నేను చీఫ్ జస్టిస్‌గా నా నిర్ణయం తెలియజేశాను. మీ మాటలు వినాలనుకోవడం లేదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పిటిషన్ దాఖలు చేయండి. ఇది కోర్టు నియమం. దాని ప్రకారం నడుచుకోండి’ అంటూ చీవాట్లు పెట్టారు.
న్యాయవాది నెడుంపర మళ్లీ వాదిస్తుండగా జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకుని..మీరు న్యాయ నిర్వహణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ న్యాయవాది వెనక్కి తగ్గలేదు. ఆయన మాట్లాడుతుండగా.. ‘ఇక మీరు ఆపండి.. కోర్టు నియమాలు అనుసరించే వరకు మీ మాటలను మేము వినదల్చుకోలేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నెడుంపర స్పందిస్తూ.. తాము పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.
చదవండి: కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం
కాగా నెడుంపర గతంలో ఎదుర్కొన్న కోర్టు ధిక్కార చర్యను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. 2019లో నెడుంపరా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో అతను ఇకపై సుప్రీంకోర్టు లేదా బాంబే హైకోర్టుకు చెందిన ఏ జడ్జిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయనని హామీ ఇచ్చాడు. దీంతో న్యాయస్థానం అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే ఏడాది పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించింది. అయితే భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మాత్రం సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.
అదే విధంగా కేసు విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యకక్షుడు అదిశ్ అగర్వాల్ వాదనలు వినేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఎన్నికల బాండ్ల పథకం రద్దుకు సంబంధించిన తీర్పుపై సుమోటోగా సమీక్ష చేయాలని అదీశ్ అగర్వాల్ కోరడంతో చీఫ్ జస్టిస్ తీవ్రంగా స్పందించారు. ‘మీరు సీనియర్ న్యాయవాది మాత్రమే కాదు ఎస్సీబీఏ అధ్యక్షుడు. నా సుమోటో అధికారాలను ప్రశిస్తూ లేఖ రాశారు. ఇవన్నీ ప్రచారానికి సంబంధించిన అంశాలు.. మేము దీనిలో భాగం కాలేం.. నన్ను ఇంకేమీ మాట్లాడనివ్వద్దు.. ఇది అసహ్యంగా ఉంటుంది’ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment