మార్పు కోసం మార్పా? | Sakshi Guest Column On New laws by Central Govt | Sakshi
Sakshi News home page

మార్పు కోసం మార్పా?

Published Tue, Aug 22 2023 2:25 AM | Last Updated on Tue, Aug 22 2023 2:26 AM

Sakshi Guest Column On

భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్‌ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్‌ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు.

ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్‌ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

భారతీయ శిక్షా స్మృతి, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్‌ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్‌) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు.

ఇక భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్ఎస్‌ఎస్‌)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్‌ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను.

అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్‌ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్‌ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్‌ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి.

ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. 

రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. 

మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్  చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్  చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం.

ఈ ఏడాది జూన్‌లో న్యాయ కమిషన్  దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది.

దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది.

నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్‌ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్‌ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు.

ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్‌ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్‌ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్  వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్‌ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా?

ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్‌ఎస్‌లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్‌ డిఫమేషన్ ను చేర్చడం.

గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్‌ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. 

ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. 

దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్‌ చెప్పిన మాట నిజం!

అభిషేక్‌ సింఘ్వీ  
వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్‌ జనరల్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement