ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావుకు అదనపు జడ్జిగా మూడు నెలల పొడిగింపు లభించింది.
ఎన్‌జేఏసీపై తీర్పు వాయిదా నేపథ్యంలో పొడిగింపు
దేశంలోని అదనపు న్యాయమూర్తులందరికీ ఇదే వర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావుకు అదనపు జడ్జిగా మూడు నెలల పొడిగింపు లభించింది. ఈ నెల 21 నుంచి మూడు నెలల పాటు ఆయన హైకోర్టు అదనపు జడ్జిగా కొనసాగుతారు. వాస్తవానికి అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న వెంటనే ప్రతీ న్యాయమూర్తి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ లేకపోవడం, దాని స్థానంలో ఏర్పాటైన జాతీయ న్యాయమూర్తులు నియామకపు కమిషన్ (ఎన్‌జేఏసీ)పై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తి నియామకపు ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేయలేదు.
అలాగే ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై బదిలీపై కేరళ హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ దామా శేషాద్రి నాయుడుకు సైతం అదనపు న్యాయమూర్తిగా పొడిగింపు లభించింది. జాతీయ న్యాయమూర్తుల నియామకపు కమిషన్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దేశవ్యాప్తంగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారందరికీ మూడు నెలల పాటు పొడిగింపు లభించింది.