కుట్రల్లో నెవర్‌ బిఫోర్‌! | Chandrababu Drama Also In Supreme Court | Sakshi
Sakshi News home page

కుట్రల్లో నెవర్‌ బిఫోర్‌!

Published Thu, Aug 20 2020 2:27 AM | Last Updated on Thu, Aug 20 2020 9:42 AM

Chandrababu Drama Also In Supreme Court - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అండ్‌ కో తమకే సొంతమైన ’నాట్‌ బిఫోర్‌’ కుట్రను మరోసారి తెరపైకి తెచ్చింది. ఉమ్మడి హైకోర్టులో నాట్‌ బిఫోర్‌ నాటకం ఆడి అప్రతిష్ట పాలైన టీడీపీ అత్యున్నత న్యాయస్థానంలోనూ అదే కుట్రకు తెగబడింది. నాట్‌ బిఫోర్‌ అనే నాటకంతో గతంలో బెంచ్‌లను మార్చుకుంటూ వచ్చి విచారణను కావాల్సిన బెంచ్‌కు మార్చేందుకు ప్రయత్నించి అప్రతిష్ట పాలైన టీడీపీ తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారించే బెంచ్‌ నుంచి మరో ధర్మాసనానికి మార్చడం ద్వారా కుట్రలకు పాల్పడింది. విచారణ ఏ బెంచ్‌ వద్దకు వస్తుందో ముందే పసిగడుతూ సంబంధిత అడ్వొకేట్లకు కేసును ‘బ్రీఫింగ్‌’ చేయడం.. తరువాత అదే అంశాన్ని బెంచ్‌ వద్ద ప్రస్తావించి అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. చివరకు మరో బెంచ్‌కు నివేదించేలా చేయడం అనే వ్యూహాలను అమలు చేస్తోంది. 

న్యాయవర్గాల్లో ఆందోళన...
► చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ దర్యాప్తును తప్పించుకునేందుకు ‘నాట్‌ బిఫోర్‌’ కుట్రను విజయవంతంగా అమలు చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు అదే కుట్రను సుప్రీంకోర్టులో అమలు చేస్తుండటంపై న్యాయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ’నాట్‌ బిఫోర్‌’ ద్వారా తమకు కావాల్సిన ’బెంచ్‌’ వద్దకు కేసు వచ్చేలా చేయడం, ఇష్టంలేని ’బెంచ్‌’ నుంచి కేసును తప్పించడం చేస్తూ ’బెంచ్‌ హాంటింగ్‌’ పాల్పడుతున్నారు.
► ముందస్తు వ్యూహంతో మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెను.. ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తండ్రిని కారణాలుగా చూపించి నాట్‌బిఫోర్‌ కుట్రలను అమలు చేశారు.  
► గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ నాట్‌ బిఫోర్, బెంచ్‌ హాంటింగ్‌ కుట్రలపై హేమాహేమీలైన సుప్రీంకోర్టు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉక్కు పిడికిలితో ఆదిలోనే అణిచివేయాలని, లేదంటే అత్యున్నత న్యాయస్థానం పరువు ప్రతిష్టలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని  హెచ్చరిస్తున్నారు.

అప్పుడు అలా...
► పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే అప్పుడు జస్టిస్‌ బాబ్డే కుమార్తె రుక్మిణీ బాబ్డే పేరును తెరపైకి తీసుకొచ్చారు. 
► హైకోర్టులో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున హాజరయ్యారని రాజధాని పరిరక్షణ సమితి తరఫు సీనియర్‌ న్యాయవాది ఒకరు జస్టిస్‌ బాబ్డే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జస్టిస్‌ బాబ్డే ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి పంపింది. 
► వాస్తవానికి రుక్మిణి బాబ్డే రైతుల తరఫున హాజరైనట్లు హైకోర్టు ఎక్కడా రికార్డుల్లో నమోదు చేయలేదు. హైకోర్టులో ఈ నెల 14న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో ఆమె పాల్గొన్నారు. అంతకుమించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను ఫలానా వారి తరఫున హాజరవుతున్నట్లు కోర్టుకు సైతం చెప్పలేదు.  ఆ రోజు సీనియర్‌ న్యాయవాదులే సాంకేతిక అంశాలపై మాట్లాడారు. 
► అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా రుక్మిణి బాబ్డే హాజరును నమోదు చేయలేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ముందు రుక్మిణి బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్లు చెప్పారు. దీంతో తన కుమార్తె హాజరైన కేసును తాను విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని భావించిన జస్టిస్‌ బాబ్డే, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ నారీమన్‌ ధర్మాసనానికి పంపారు. 

ఇప్పుడు ఇలా...
► జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌కు అత్యంత సమర్థుడిగా, నిజాయితీపరుడిగా, ముక్కుసూటి మనిషిగా, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని న్యాయవర్గాల్లోమంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్‌ ఈ ధర్మాసనం ముందు విచారణకు వస్తే, పరిస్థితులు తమ అదుపులో ఉండవని పసిగట్టిన బాబు అండ్‌ కో పక్కా వ్యూహాన్ని రచించింది. 
► హైకోర్టులో రుక్మిణి బాబ్డేని ఏ విధంగా తెరపైకి తెచ్చారో, ఇక్కడ కూడా జస్టిస్‌ నారిమన్‌ తండ్రి అయిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఫాలి నారిమన్‌ను తెరపైకి తెచ్చారు. ఫాలీ నారిమన్‌ వద్దకు వెళ్లి పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల గురించి ’బ్రీఫ్‌’ చేశారు. 
► ఈ క్రమంలో బుధవారం జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ ధర్మాసనం వద్దకు ప్రభుత్వ పిటిషన్‌ విచారణకు రావడానికి ముందుగానే, ఫాలీ నారిమన్‌కు ఈ కేసు గురించి వివరించామంటూ బాబు అండ్‌ కో ఓ లేఖను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇచ్చారు. 
► బుధవారం ఈ కేసు విచారణకు రాగానే, ఓ న్యాయవాది లేచి రిజిస్ట్రీకి తాము ఇచ్చిన లేఖ గురించి జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ ధర్మాసనానికి చెప్పారు. దీంతో ఫాలీ నారిమన్‌ తన తండ్రి కావడంతో.. జస్టిస్‌ నారిమన్‌ నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వపిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ ధర్మాసనం నుంచి పిటిషన్‌ను తప్పించేందుకే!
► బాబు అండ్‌ కో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే ఫాలీ నారిమన్‌కు వివరించామని చెప్పారే తప్ప, ఆయన తమ తరఫున ఈ కేసులో వాదనలు వినిపిస్తారని చెప్పలేదు. దీనిని బట్టి ఫాలీ నారిమన్‌ను తమ తరఫున వాదనలు వినిపించుకునేందుకు నియమించుకోలేదని సులభంగా అర్థమవుతోంది. కేవలం జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం నుంచి ప్రభుత్వ పిటిషన్‌ను తప్పించేందుకే ఫాలీ నారిమన్‌ పేరును తెరపైకి తీసుకొచ్చి బాబు అండ్‌ కో తన కుట్రను విజయవంతంగా అమలు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement