Joint High Court
-
కోర్టుల అతి జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగే.. పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాస్తవాన్ని నివేదించవచ్చు. ఆర్టికల్–19 ప్రకారం సత్యాన్ని వెల్లడించే హక్కు వాటికి ఉంది. దీనిని ఏ న్యాయస్థానం కాదనడానికి వీల్లేదు’.. అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం ఆయన స్పందించారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలతోపాటు 13 మందిపై ఆ రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన పలు అంశాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. వాస్తవాన్ని ప్రచురించకుండా, వెల్లడించకుండా అడ్డుకోవడమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని, అసాధారణ విషయాల్లో మాత్రమే న్యాయస్థానాలు ఇలాంటి ఆదేశాలిస్తాయని తెలిపారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా తమ అభిప్రాయాలతో, ఊహాగానాలతో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదముందని భావించినప్పుడు కూడా న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే, ఒక సంఘటనను, పరిణామాన్ని యధాతథంగా వెల్లడించేందుకు అడ్డుచెప్పాల్సిన అవసరంలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే ప్రజల సంక్షేమం కోసం విధానాలను రూపొందించి అమలుచేయడం ప్రభుత్వం బాధ్యత. అందులో న్యాయస్థానాలు అతిగా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పరిపాలనాపరమైన అన్ని అంశాల్లోనూ అంతిమ నిర్ణయం ప్రభుత్వానికే ఉంటుంది. అసలు విధానాలనే రూపొందించొద్దు, అమలుచెయొద్దని కోర్టులు చెప్పలేవు. ప్రభుత్వ విధానాలవల్ల, నిర్ణయాలవల్ల అన్యాయం జరిగితే అప్పుడు బాధితుల పక్షాన కోర్టులు తీర్పులు చెప్పవచ్చు. నేర విచారణ చెయ్యొచ్చు భూ కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, అవినీతి వంటివి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తే విచారణకు ఆదేశిస్తుంది. ఈ మేరకు విచారణ సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతాయి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ, అసలు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు అడ్డుకోవడం సహేతుకం కాదు. ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న మొత్తం నిర్ణయాలపైన విచారణ జరిపించడం సాధ్యంకాదు. బహుశా సాంకేతికంగా కూడా వీలుకాదు. ప్రభుత్వ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలతో, వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. సాంకేతిక కారణాలవల్ల ఆ ఒప్పందాలను యధాతథంగా అమలుచేసే అవకాశం లేనప్పుడు బాధితులకు తగిన పరిహారం అందజేయాలి. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. -
కుట్రల్లో నెవర్ బిఫోర్!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అండ్ కో తమకే సొంతమైన ’నాట్ బిఫోర్’ కుట్రను మరోసారి తెరపైకి తెచ్చింది. ఉమ్మడి హైకోర్టులో నాట్ బిఫోర్ నాటకం ఆడి అప్రతిష్ట పాలైన టీడీపీ అత్యున్నత న్యాయస్థానంలోనూ అదే కుట్రకు తెగబడింది. నాట్ బిఫోర్ అనే నాటకంతో గతంలో బెంచ్‌లను మార్చుకుంటూ వచ్చి విచారణను కావాల్సిన బెంచ్‌కు మార్చేందుకు ప్రయత్నించి అప్రతిష్ట పాలైన టీడీపీ తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి మరో ధర్మాసనానికి మార్చడం ద్వారా కుట్రలకు పాల్పడింది. విచారణ ఏ బెంచ్ వద్దకు వస్తుందో ముందే పసిగడుతూ సంబంధిత అడ్వొకేట్లకు కేసును ‘బ్రీఫింగ్’ చేయడం.. తరువాత అదే అంశాన్ని బెంచ్ వద్ద ప్రస్తావించి అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. చివరకు మరో బెంచ్‌కు నివేదించేలా చేయడం అనే వ్యూహాలను అమలు చేస్తోంది. న్యాయవర్గాల్లో ఆందోళన... ► చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్లో సీబీఐ దర్యాప్తును తప్పించుకునేందుకు ‘నాట్ బిఫోర్’ కుట్రను విజయవంతంగా అమలు చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు అదే కుట్రను సుప్రీంకోర్టులో అమలు చేస్తుండటంపై న్యాయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ’నాట్ బిఫోర్’ ద్వారా తమకు కావాల్సిన ’బెంచ్’ వద్దకు కేసు వచ్చేలా చేయడం, ఇష్టంలేని ’బెంచ్’ నుంచి కేసును తప్పించడం చేస్తూ ’బెంచ్ హాంటింగ్’ పాల్పడుతున్నారు. ► ముందస్తు వ్యూహంతో మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెను.. ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తండ్రిని కారణాలుగా చూపించి నాట్‌బిఫోర్ కుట్రలను అమలు చేశారు. ► గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ నాట్ బిఫోర్, బెంచ్ హాంటింగ్ కుట్రలపై హేమాహేమీలైన సుప్రీంకోర్టు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉక్కు పిడికిలితో ఆదిలోనే అణిచివేయాలని, లేదంటే అత్యున్నత న్యాయస్థానం పరువు ప్రతిష్టలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు అలా... ► పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే అప్పుడు జస్టిస్ బాబ్డే కుమార్తె రుక్మిణీ బాబ్డే పేరును తెరపైకి తీసుకొచ్చారు. ► హైకోర్టులో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున హాజరయ్యారని రాజధాని పరిరక్షణ సమితి తరఫు సీనియర్ న్యాయవాది ఒకరు జస్టిస్ బాబ్డే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జస్టిస్ బాబ్డే ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రోహింటన్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనానికి పంపింది. ► వాస్తవానికి రుక్మిణి బాబ్డే రైతుల తరఫున హాజరైనట్లు హైకోర్టు ఎక్కడా రికార్డుల్లో నమోదు చేయలేదు. హైకోర్టులో ఈ నెల 14న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ విచారణలో ఆమె పాల్గొన్నారు. అంతకుమించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను ఫలానా వారి తరఫున హాజరవుతున్నట్లు కోర్టుకు సైతం చెప్పలేదు. ఆ రోజు సీనియర్ న్యాయవాదులే సాంకేతిక అంశాలపై మాట్లాడారు. ► అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా రుక్మిణి బాబ్డే హాజరును నమోదు చేయలేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ముందు రుక్మిణి బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్లు చెప్పారు. దీంతో తన కుమార్తె హాజరైన కేసును తాను విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని భావించిన జస్టిస్ బాబ్డే, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్ రోహింటన్ నారీమన్ ధర్మాసనానికి పంపారు. ఇప్పుడు ఇలా... ► జస్టిస్ రోహింటన్ నారిమన్‌కు అత్యంత సమర్థుడిగా, నిజాయితీపరుడిగా, ముక్కుసూటి మనిషిగా, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని న్యాయవర్గాల్లోమంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్ ఈ ధర్మాసనం ముందు విచారణకు వస్తే, పరిస్థితులు తమ అదుపులో ఉండవని పసిగట్టిన బాబు అండ్ కో పక్కా వ్యూహాన్ని రచించింది. ► హైకోర్టులో రుక్మిణి బాబ్డేని ఏ విధంగా తెరపైకి తెచ్చారో, ఇక్కడ కూడా జస్టిస్ నారిమన్ తండ్రి అయిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్‌ను తెరపైకి తెచ్చారు. ఫాలీ నారిమన్ వద్దకు వెళ్లి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల గురించి ’బ్రీఫ్’ చేశారు. ► ఈ క్రమంలో బుధవారం జస్టిస్ రోహింటన్ నారిమన్ ధర్మాసనం వద్దకు ప్రభుత్వ పిటిషన్ విచారణకు రావడానికి ముందుగానే, ఫాలీ నారిమన్‌కు ఈ కేసు గురించి వివరించామంటూ బాబు అండ్ కో ఓ లేఖను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇచ్చారు. ► బుధవారం ఈ కేసు విచారణకు రాగానే, ఓ న్యాయవాది లేచి రిజిస్ట్రీకి తాము ఇచ్చిన లేఖ గురించి జస్టిస్ రోహింటన్ నారిమన్ ధర్మాసనానికి చెప్పారు. దీంతో ఫాలీ నారిమన్ తన తండ్రి కావడంతో.. జస్టిస్ నారిమన్ నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వపిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ధర్మాసనం నుంచి పిటిషన్‌ను తప్పించేందుకే! ► బాబు అండ్ కో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే ఫాలీ నారిమన్‌కు వివరించామని చెప్పారే తప్ప, ఆయన తమ తరఫున ఈ కేసులో వాదనలు వినిపిస్తారని చెప్పలేదు. దీనిని బట్టి ఫాలీ నారిమన్‌ను తమ తరఫున వాదనలు వినిపించుకునేందుకు నియమించుకోలేదని సులభంగా అర్థమవుతోంది. కేవలం జస్టిస్ నారిమన్ ధర్మాసనం నుంచి ప్రభుత్వ పిటిషన్‌ను తప్పించేందుకే ఫాలీ నారిమన్ పేరును తెరపైకి తీసుకొచ్చి బాబు అండ్ కో తన కుట్రను విజయవంతంగా అమలు చేసింది. -
పెన్నా ప్రతాప్ రెడ్డికి పాక్షిక ఊరట
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న పెన్నా ప్రతాప్‌రెడ్డికి హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అతనిపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 12 కింద సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఐపీసీ సెక్షన్ 120(బీ), 420 కింద ఉన్న కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పెన్నా ప్రతాప్‌రెడ్డితో పాటు పెన్నా గ్రూపు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అటు పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇటు పెన్నా గ్రూపు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేశారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును మాత్రమే కొట్టేశారు. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 420 కింద ఉన్న కేసుల్లో విచారణను కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ తీర్పు ప్రభావం లేకుండా.. ఆ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించారు. -
హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీపై కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఉమ్మడి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ సొసైటీ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.కేశవరావులకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. సొసైటీ అకౌంట్ల పరిశీలనకు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమతలతో ఏర్పాటు చేసిన కమిటీ తన బాధ్యతలను పూర్తి చేసి, రెండు నెలల్లో తన నివేదికను జడ్జీల కమిటీకి అప్పగించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కమిటీ నివేదికను బట్టి జడ్జీల కమిటీ తదుపరి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చునంది. సొసైటీ మేనేజింగ్ కమిటీలోని సభ్యులు ఎవరైనా ఏ రకమైన దుర్వినియోగానికి పాల్పడి ఉంటే, వారిపై ఐపీసీ, సహకార చట్ట నిబంధనల మేరకు మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ కూడా రిజిష్ట్రార్ జనరల్ చేత నియమితులయ్యే అధికారికి అప్పగించాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. లేఔట్ అమలు విషయంలో జడ్జీల కమిటీ అనుమతితో సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవచ్చునంది. ప్లాట్ల కేటాయింపు విధానం, సభ్యులు చెల్లించిన లేఔట్ అభివృద్ధి చార్జీలు తదితర వివరాలను జడ్జీల కమిటీకి, సొసైటీ సభ్యులకు అందచేయాలని ప్రస్తుత హౌసింగ్ సొసైటీ పాలకవర్గాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ ముందుంచిన లేఔట్, భవన ప్లాన్లను జడ్జీల కమిటీ ముందు ఉంచి, వాటిని ఆ కమిటీ సలహా మేరకు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్జీ... ఉద్యోగులపైఓ కన్నేసి ఉంచండి.. ఏ వ్యక్తి నుంచి రూ.5వేలకు మించి నగదును తీసుకోవడానికి గానీ, చెల్లింపులు చేయడానికిగానీ వీల్లేదని కమిటీ పాలకవర్గానికి హైకోర్టు తేల్చి చెప్పింది. జడ్జీల కమిటీని సంప్రదించి ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించుకోవాలని ఆదేశించింది. చెల్లింపులు, స్వీకరణల ఖాతాలను సిద్ధం చేయాలంది, మూడు, ఆరు నెలలతో పాటు వార్షిక ఆడిట్ నివేదికలను సిద్ధం చేసి, వాటిని డిస్ప్లే బోర్డులో ఉంచాలంది. లేఔట్ అభివృద్ధి, తదితర పనులపై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వేర్వేరు ఏజెన్సీల నుంచి తెప్పించుకోవాలని, అంతిమంగా జడ్జీల కమిటీ ఆమోదించిన వారికి పనులు అప్పగించాలంది. సభ్యులకు కేటాయించిన ప్లాట్లలో నిర్మాణాలను హౌసింగ్ సొసైటీ చేపట్టడానికి వీల్లేదంది. కేటాయించిన ప్లాట్లను ఉపయోగించుకునే విషయంలో సభ్యులకు స్వేచ్ఛనివ్వాలంది. సొసైటీకి హైకోర్టు ప్రాంగణంలో కేటాయించిన కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని, కోర్టు పని గంటల్లో సొసైటీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఈ విషయంలో ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని రిజిష్ట్రార్ జనరల్ (ఆర్జీ)ను ఆదేశించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోండి... అర్హులైన పలువురికి సొసైటీలో సభ్యత్వం ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం కేటాయించిన స్థలం పక్కనే ఏదైనా స్థలం ఖాళీగా ఉంటే దానిని కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోవాలని సొసైటీకి స్పష్టం చేసింది. స్థలం కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చునంది. తాము ఆదేశించిన మేర ప్లాట్ల కేటాయింపులు, లేఔట్ అభివృద్ధి సంతృప్తికరంగా జరుగుతుంటే, జడ్జీల కమిటీ పక్కకు జరిగి, ఎన్నిౖకైన పాలకవర్గాలు స్వతంత్రంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక దృష్టి సారించిన సీజే రాధాకృష్ణన్... హైకోర్టు ఉద్యోగులకు 2010లో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగింది. అంతకు ముందే ఏపీ హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు జరిగింది. స్థలాల కేటాయింపు జరగడానికి ముందే సొసైటీ బైలాను సవరించడంపై 2007లో కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్థలం కేటాయింపు జరిగిన తరువాత వివాదాలు మరింత ముదిరాయి. ఆ తరువాత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. వీటన్నింటిపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉమ్మడి హైకోర్టు సీజేగా వచ్చిన జస్టిస్ రాధాకృష్ణన్ ఈ మొత్తం వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సొసైటీలో చోటు చేసుకున్న అన్ని పరిణామాలను పాలనాపరంగా తెలుసుకున్నారు. ఈ వివాదాలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల వాదనలు విని తీర్పు వెలువరించింది. -
బార్‌కు.. బెంచ్‌కి మధ్య సమన్వయం అవసరం
సాక్షి, విశాఖపట్నం: బార్ అసోసియేషన్‌లో కూర్చున్న వారే తర్వాతి రోజుల్లో బెంచ్‌లో తీర్పులిస్తుంటారని.. అందువల్ల బార్‌కు, బెంచ్‌కి మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ అన్నారు. దిగువ కోర్టు తీర్పులను కనీసం చదవకుండా పైస్థాయి కోర్టుల్లో వాదించడం వల్ల తీర్పులకు ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తున్నాయని, తద్వారా సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో శనివారం సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రాధాకృష్ణన్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ దివంగత డీవీ సుబ్బారావు స్మారకోపన్యాసం చేశారు. న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, నగర మేయర్‌గా, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మన్ననలు అందుకున్న సుబ్బారావు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. కొందరు కక్షిదారులు కేసులో తమ తరఫున న్యాయవాదులను నియమించుకొని, విచారణ సమయంలో వారు కోర్టులకు రావట్లేదన్నారు. కక్షిదారులు విధిగా కోర్టులకు రావాలని, అప్పుడే తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, న్యాయవాదులు ఏవిధంగా వాదిస్తున్నారో అర్థమవుతుందన్నారు. తీర్పు చెప్పేటప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న వారు ఒకటి రెండుసార్లు ఆలోచించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్పులివ్వాలని సూచించారు. న్యాయస్థానాల్లో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తాను న్యాయవాదిగా ఉన్నంత కాలం ఏనాడూ అలసత్వం వహించలేదని, సత్యం మాత్రమే ప్రకటించి కక్షిదారులకు సహాయం చేశానని గుర్తు చేశారు. సత్యాన్ని నమ్ముకుంటే న్యాయం దానంతట అదే వస్తుందన్న సిద్ధాంతాన్ని న్యాయవాదులు ముందుగా తెలుసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ (బెంగుళూరు) ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీ సోమయాజులు, విశాఖకు చెందిన న్యాయనిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఓటర్ల జాబితాపై పూర్తి వివరాలు మా ముందుంచండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా తయారు, ముసాయిదా జాబితా ప్రచురణ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను, అనర్హులను, డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో 34.17 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. 17 లక్షలమంది ఓటర్లు అటు ఏపీ, ఇటు తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. అంతేగాక అధికారపార్టీకి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో స్లీపర్ సెల్స్‌గా ఓటర్ల జాబితాలో ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలున్నాయని, ఏడాది వయస్సున్న చిన్నారిని వివాహితగా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఓటర్ల వయస్సును 248 సంవత్సరాలుగా కూడా పేర్కొన్నారని తెలిపారు. ఎప్పుడో రాజుల కాలంలో పుట్టినట్లుగా వయస్సును ఓటర్ల జాబితాలో పేర్కొన్నారని, దీన్నిబట్టి ఓటర్ల జాబితా తయారీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్రియ ఏ దశలో ఉందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది బదులిస్తూ.. 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నామని, జనవరి 4 నాటికి ముసాయిదా ప్రచురిస్తామని బదులిచ్చారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. హాయ్ల్యాండ్కూ, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇదే సమయంలో హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. మరోపక్క హాయ్‌ల్యాండ్ యాజమాన్యం కూడా తమని అగ్రిగోల్డ్‌కి చెందిన కంపెనీగా భావిస్తూ, తమ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద ఇప్పటికే జప్తు చేశారని, అందువల్ల సర్ఫేసీ చట్టం కింద వాటిని వేలం వేసే అధికారం బ్యాంకులకు లేదని హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేసింది. హాయ్‌ల్యాండ్ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మాటమార్చడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇప్పటి వరకు హాయ్‌ల్యాండ్ తమదేనని చెప్పుకుంటూ ఆ మేర అఫిడవిట్ చేసి, ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. దీనికి అగ్రి గోల్డ్ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా మాట మార్చకుండా గట్టి గుణపాఠం నేర్పుతామంది. అప్పుడు డిపాజిటర్లతో, ఇప్పుడు న్యాయస్థానంతో ఆటలాడుకుంటున్నారని, ఇందుకు ఎదుర్కోబోయే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాయ్‌ల్యాండ్ ఎంఓయూను పరిశీలిస్తే అందులో ఈ కంపెనీ యాజమాన్యం వివరాలుంటాయని, వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ యాజమానులకు, హాయ్‌ల్యాండ్ యాజమానులకు ఉన్న సంబంధం తెలిసి ఉండేదని, ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏముందని నిలదీసింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ యాజమాన్యం విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోనున్నారో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. పర్యవసానాలు ఎదుర్కొంటారు విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్, రిజిస్టర్ విలువను ధర్మాసనం ముందుంచారు. అటు తరువాత హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ వాదనలు వినిపిస్తూ, హాయ్ల్యాండ్కూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తమ పూర్తి వాదనలను వినాలని కోరారు. దీనిపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం వివరణ కోరింది. ఆయన కూడా సంబంధం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. హాయ్‌ల్యాండ్ విషయంలో మాట మార్చినందుకు వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానాలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తామని, వారు మోసం చేసింది కోర్టునే కాదు.. 32 లక్షల మంది డిపాజిటర్లను కూడా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్ పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారా? అని సీఐడీ అధికారులను ధర్మాసనం ప్రశ్నించగా, అతడు ఈ కేసులో నిందితుడు కాదని, అందుకే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధాలను తప్పక తెలుసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల వేలం ప్రక్రియను సవాలు చేస్తూ హాయ్‌ల్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఎస్బీఐ, కర్ణాటక, ఓబీసీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి, వారికి కూడా నోటీసులిచ్చింది. అవ్వా సీతారామారావు, అల్లూరి వెంకటేశ్వరరావుల మధ్య ఉన్న సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే హాయ్‌ల్యాండ్ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. -
జగన్‌పై హత్యాయత్నం: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
-
జగన్‌పై హత్యాయత్నం: హోం శాఖలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర, రాష్ట్ర హోంశాఖలతో పాటు ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ తో సహా 7 మందికి నోటీసులు జారీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ రెండు వారాల విచారణ రిపోర్ట్‌ను సీల్డ్కవర్లో మరోసారి తమకు సమర్పించాలని సిట్ అధికారులను ఆదేశించింది. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. సిట్ దర్యాప్తు పురోగతిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీసు అధికారుల వివరాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు సిట్ అధికారులు మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ సీసీ టీవీ ఫుటేజ్ వివరాలు ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్ లేదని అధికారులు తెలపడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై కూడా సిట్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్ భద్రతా లోపాలు క్షమించరానివని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. హత్యాయత్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకుర్ వ్యాఖ్యలను వైఎస్ జగన్ తరుపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంశాన్ని కూడా వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం రిట్ పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
నివేదికతో ఏసీపీ హైదరాబాద్ పయనం
-
నేడు హైకోర్టుకు ‘సిట్’ నివేదిక
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హైదరాబాద్ పయనమయ్యారు. ఈ కేసు పురోగతిని మంగళవారం తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలంటూ అడ్వొకేట్ జనరల్‌ను ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు, మరికొంతమంది సిబ్బందితో హైదరాబాద్ వెళ్లారు. దర్యాప్తు నివేదికను రూపొందించేందుకు సిట్, ఇతర ఉన్నతాధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేశారు. ఉన్నత న్యాయస్థానం ఏయే అంశాలపై దృష్టి సారిస్తుందో ముందుగా అంచనా వేసి అందుకనుగుణంగా వీరు నివేదికను సిద్ధం చేశారు. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. సిట్ దర్యాప్తు పురోగతిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీసు అధికారుల వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు సిట్ అధికారులు మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించనున్నారు. -
నాపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి : రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. తనను టార్గెట్ చేసుకుని పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా రేవంత్ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది. -
జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. జస్టిస్ రమేశ్ రంగనాథన్ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని, రాజీలేని మార్గంలో, చట్టానికి లోబడి పనిచేశారని కొనియాడారు. నిరంతరం అధ్యయనం చేసే జస్టిస్ రంగనాథన్ 31,487 కేసుల్ని పరిష్కరిస్తే.. అందులో ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పులు 36 ఉన్నాయన్నారు. అనంతరం జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ.. చట్ట నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం వల్ల చాలామంది న్యాయవాదులు నొచ్చుకుని ఉంటారని, దీంతో ఈ కార్యక్రమానికి పెద్దగా న్యాయవాదులు రారేమోనని భావించానన్నారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తనకు విధుల్లో సహకరించిన తోటి న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు మాట్లాడుతూ.. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ పాటుపడ్డారని చెప్పారు. న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. రెండు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులు కలసి సీజే చేతుల మీదుగా జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ రమేశ్ రంగనాథన్ భార్య హాజరయ్యారు. -
జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు పదోన్నతి లభించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఫైలుపై బుధవారం సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. బాంబే, గౌహతి, సిక్కిం, కలకత్తా హైకోర్టులకు సైతం ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–04 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. -
3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు
రాజ్యాంగ లక్ష్యాల్ని కాలరాసేలా వ్యవహరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. ఇక ప్రత్యేకాధికారుల నియామకం విషయానికొస్తే.. వీరి నియామకం రాజ్యాంగం లోని పార్ట్ 9 ప్రకారం చెల్లుబాటు కాదు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలపరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారులను నియమించడాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. ప్రత్యేకాధికారుల నియామకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చింది. ప్రత్యేకాధికారుల నియామకానికి ఉద్దేశించిన జీవో 90ని రద్దు చేసింది. అయితే ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేకాధికారులను కొనసాగించవచ్చునంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించ లేదని తెలిపింది. తమ ఆదేశాల మేరకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించడంకోసం రాష్ట్రంలో బీసీ జనాభా గణన, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అదే సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించే విషయంలో అవసరమైతే గవర్నర్ సాయం కూడా కోరవచ్చునని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఏజీ అభ్యంతరాలను పరిగణించని న్యాయస్థానం.. తీర్పు వెలువరించాక అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. మూడు నెలల కాలపరిమితి విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని నివేదించారు. అయితే ఏజీ నివేదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 1తో గడువు ముగిసిందని, అప్పట్లోపు ఎన్నికలకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ పని చేయకుండా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని, అలాగే ప్రత్యేకాధికారులను నియమిం చేందుకు ఉద్దేశించిన జీవో 90ని సవాలు చేస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి మాజీ సర్పంచ్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కలపల్లి మాజీ సర్పంచ్ రాయవరం శ్రీనివా సులరెడ్డి, మరో ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది రవి చీమలపాటి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం 41 పేజీల తీర్పు వెలువరించారు. ప్రభుత్వం.. ఎన్నికల సంఘం విఫలమయ్యాయి... ‘‘పంచాయతీరాజ్ చట్టనిబంధనల ప్రకారం పంచాయతీల కాలపరిమితి ఐదేళ్లు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 1తో ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకుగాను బీసీ జనాభా గణన, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ ప్రభుత్వం బీసీ జనాభా గణనకు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఖరారుకు చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సంఘమూ దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఏ రకంగా చూసుకున్నా అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాయి.’’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. సహకరించనప్పుడు ఎన్నికల సంఘం హైకోర్టుకు రావాల్సింది... ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు. అధికరణ 243కె క్లాజ్ 3 ప్రకారం ఎన్నికల కమిషన్ కోరినప్పుడు గవర్నర్ ఎన్నికల నిర్వహణ నిమిత్తం తన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఐదేళ్ల కాలపరిమితి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే ఎన్నికల నిర్వహణ నుంచి మినహాయింపు కోరవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రాష్ట్రంలో పంచాయతీల గడువు ముగిసేనాటికి అటువంటి పరిస్థితులేమీ లేవు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోలేదు కాబట్టే ఎన్నికలు జరగలేదు. హైకోర్టులో పిటిషన్ వేసి.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరి ఉండొచ్చు. కానీ ఎన్నికల సంఘం ఆ పని చేయలేదు’’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ లక్ష్యాలను కాలరాసేందుకు అనుమతించేది లేదు... ‘‘1–8–2018 కల్లా ఎన్నికలు నిర్వహించకపోవడానికి ప్రభుత్వం వద్ద సహేతుక కారణం లేదు. న్యాయపరంగా ఆమోదయోగ్యమైన కారణమూ లేదు. కాలపరిమితి ముగిసేలోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకం. ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీలను నిర్వీర్యం చేయడమంటే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. రాజ్యాంగ లక్ష్యాల్ని కాలరాసేలా వ్యవహరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. ఇక ప్రత్యేకాధికారుల నియామకం విషయానికొస్తే.. వీరి నియామకం రాజ్యాంగంలోని పార్ట్ 9 ప్రకారం చెల్లుబాటు కాదు. ఐదేళ్ల కాలపరిమితిలోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ పని చేయకుండా ప్రత్యేకాధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమే కాదు.. రాజ్యాంగ విరుద్ధం కూడా. కాబట్టి ప్రత్యేకాధికారుల నియామకం కోసం జారీ చేసిన జీవో 90.. తదనుగుణంగా జారీ అయిన మెమో రాజ్యాంగంలోని అధికరణ 14, 243ఈ(3)లకు విరుద్ధం’’ అని జస్టిస్ రామచంద్రరావు స్పష్టీకరించారు. మూడు నెలల వరకు ప్రత్యేకాధికారులు కొనసాగవచ్చునని, అప్పటిలోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ‘హైకోర్టు తీర్పును వెంటనే అమలు పరచాలి’ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పంచాయతీలకు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తెస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి’ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను రద్దు చేసి 90 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గౌరవించి వెంటనే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలుపెట్టాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పు శుభ పరిణామమని పరిషత్ జాతీయ కార్యదర్శి జాష్టి వీరాంజనేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ సురేష్‌కుమార్ కెయిత్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ కెయిత్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ అధ్యక్షతన బుధవారం మొదటి కోర్టు హాల్లో ప్రత్యేకంగా జరిగిన వీడ్కోలు సమావేశానికి న్యాయమూర్తులు, తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం సీజే జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ కెయిత్ అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తిగా సేవలు అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో తనకు సంపూర్ణ సహకారాలు లభించాయని జస్టిస్ కెయిత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ కెయిత్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు కూడా జస్టిస్ కెయిత్ను సత్కరించాయి. హరియాణాకు చెందిన జస్టిస్ కెయిత్ 1963లో జన్మించారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు. 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2016లో తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్నారు. -
పరిష్కారమైన తాడిపత్రి తగాదా
-
తాడిపత్రిలో సడలిన ఉద్రిక్తత
తాడిపత్రి: వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రభోదానంద ఆశ్రమం వద్ద హింసాత్మక ఘటనలతో నెలకొన్న ఉద్రిక్తత సోమవారం అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్‌గుప్తా, ఐజీ రవిశంకర్ అయ్యర్, ఆక్టోపస్ డీఎస్పీ రాధతోపాటు ఆక్టోపస్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమం వద్దకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆశ్రమం వద్దకు వచ్చిన కలెక్టర్ వీరపాండియన్, అధికారుల బృందం ఆశ్రమంలోకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరడంతో భక్తులు శాంతించారు. అనంతరం 20 బస్సుల్లో 500 మంది భక్తులను స్వస్థలాలకు తలించారు. శాంతిభద్రతల సమస్య అదుపులోకి వచ్చిందని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా తో పాటు ఆశ్రమానికి పారా మిలటరీ బలగాలతో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. అంతకుముందు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. భక్తులను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు ప్రబోధాశ్రమంలో ఉన్న భక్తులను బలవంతంగా తరలించరాదని ఉమ్మడి హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆశ్రమంతోపాటు ఆశ్రమ నిర్వాహకులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. చిన్నపొలమడ ఘటనలో సీఐ, ఎస్ఐ సస్పెన్షన్? చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యులను చేస్తూ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిలను సస్పెండ్‌చేస్తూ సీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. నిమజ్జనం సందర్భంగా వీఆర్‌లో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి బందోబస్తు నిమిత్తం చిన్నపొలమడకు వెళ్లారు. గతంలో జరిగిన సంఘటలను అంచనా వేయలేక ఆశ్రమం ముందు ఊరేగింపునకు అనుమతివ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జేసీ అనుచరులు ఆశ్రమంపైకి రాళ్లు రువ్వుతున్నా నిలువరించలేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
రిజిస్ట్రార్ జనరల్‌కి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ను బెదిరించి, దూషించిన వ్యవహారంలో హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్.లక్ష్మీనర్సింహాచార్యులు (ఆర్ఎల్ఎన్ చార్యులు)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ పరిపాలనాపరంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్ఎల్ఎన్ చార్యులపై హైకోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చార్యులుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా జడ్జి అయిన మానవేంద్రనాథ్ రాయ్ డిప్యుటేషన్‌పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జడ్జీల క్వార్టర్స్‌లో నివాసముంటున్న మానవేంద్రనాథ్ రాయ్ విధి నిర్వహణలో సూటిగా, కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఈనెల 2వ తేదీ అర్థరాత్రి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఆయనను తీవ్రంగా దూషించారు. ఎవరని రాయ్ ప్రశ్నించేలోపే కాల్ కట్ అయింది. తిరిగి మరుసటి రోజుకూడా ల్యాండ్‌ఫోన్‌కు ఆ వ్యక్తి ఇదేవిధంగా ఫోన్ చేసి దూషించడమే కాక, బెదిరింపులకు సైతం దిగాడు. దీంతో రాయ్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్ గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆ నెంబర్ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఆర్ఎల్ఎన్ చార్యులదని తేల్చారు. ఇదే విషయాన్ని వారు రాయ్‌కి తెలియజేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీజే, చార్యులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనపై ఫిర్యాదుకు ఆదేశాలిచ్చారు. దీంతో దిగొచ్చిన చార్యులు అటు మౌఖికంగా, ఇటు రాతపూర్వకంగా మానవేంద్రనాథ్కి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా సీజే ఆదేశాల మేరకు చార్యులుపై హైకోర్టు అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, వివాదాస్పదుడిగా చార్యులుకు హైకోర్టులో పేరుంది. -
న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానం
పుట్టపర్తి అర్బన్: న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులందరిపై ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న 2రోజుల జాతీయ న్యాయ సదస్సు ఆదివారం ముగిసింది. ఆదివారం ఉదయం 7.50కు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు, వేద పఠనం అనంతరం సుప్రీం కోర్టు మాజీ జడ్జీ జస్టిస్ ఏపీ మిశ్రా, రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ చైర్మన్ కె.కన్నన్, సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా అధ్యక్షుడు నిమీష్‌పాండే, ఉపాధ్యక్షుడు జితేందర్ చీమా, ట్రస్ట్ మెంబర్లు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు సన్మానించారు. ఉదయం 11 గంటలకు పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ సదస్సులో.. ఉమ్మడి హైకోర్టు జడ్జీ జస్టిస్ రామసుబ్రమణ్యం, ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్ సంగీత ధింగ్రా సెహగల్, మణిపూర్ హైకోర్టు జడ్జ్జీలు జస్టిస్ కోటేశ్వర్‌సింగ్, జస్టిస్ హరిశంకర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం, లౌకిక సిద్ధాంతాలు చాలా గొప్పవని, పౌర హక్కులు, విధులు ముఖ్యమైనవని చెప్పారు. న్యాయమూర్తులు కొందరు గాంధీ తత్వాన్ని, మరికొందరు గాడ్సే తత్వాన్ని అవలంబించకుండా అందరూ సత్యాన్ని అవలంబిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. న్యాయవాదులు వారి కక్షిదారులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కక్షిదారులకు హక్కులు తెలుస్తున్నాయి.. కానీ కేసు పూర్వాపరాలు తెలియడం లేదన్నారు. కేసు ఓడినా న్యాయాన్ని గెలిపించాలన్నారు. చేసే పనిలో ఏది తప్పు... ఏది ఒప్పు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీని వల్ల శాంతిని, ధర్మాన్ని రక్షిస్తూ విలువలు పెంపొందించే అవకాశం లభిస్తుంద న్నారు. అనంతరం వేదికపై ఉన్న జడ్జీలను నిర్వాహకులు సత్కరించారు. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయ మూర్తుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉందని, దీంతో పౌరులకు సత్వర న్యాయం అందే పరిస్థితులు కనిపించటం లేవంటూ న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించగా.. అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని వ్యాజ్యంలో పిటిషనర్ వివరించారు. -
బయోడేటాలతో వద్దు.. విషయ పరిజ్ఞానంతో రండి..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ మంగళవారం హైకోర్టు న్యాయవాదులకు తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన వద్దకు బయోడేటాలతో రావద్దని, విషయ పరిజ్ఞానంతో రావాలని స్పష్టం చేశారు. న్యాయవాదుల వ్యవహారశైలిని బట్టే న్యాయమూర్తుల తీరు ఉంటుందన్నారు. బార్ అండ్ బెంచ్(న్యాయవాదులు–న్యాయమూర్తులు) మధ్య సహకారం ఉండాలని, అయితే అది కేసుల విషయంలో కాదని, కక్షిదారులకు న్యాయం చేసే విషయంలోనేనని తెలిపారు. ఇప్పటివరకు తాను అవినీతిని దరిచేర నీయ లేదని, దాన్ని ప్రోత్సహించడం చేయలేదన్నారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల విజ్ఞప్తి మేరకు జస్టిస్ రాధాకృష్ణన్ మంగళవారం మధ్యా హ్నం భోజనవిరామంలో ఆ సంఘాలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయవాదులు సొంత శైలిని కలిగి ఉండాలి: ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఎవరినీ అనుకరించకుండా సొంత శైలిని కలిగి ఉండాలన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని, కొందరు తనను తన తండ్రిలా, మరికొందరు తనను తన తల్లిలా ఉండాలని సూచించారన్నారు. అయితే తాను మాత్రం సొంత శైలిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. పెద్ద పెద్ద లా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదని, ఎంత కష్టపడ్డాం.. ఎంత నిబద్ధతతో పనిచేశాం.. అన్నదే ముఖ్యమని తెలిపారు. కట్ అండ్ పేస్ట్ విధానాలకు స్వస్తి పలికినప్పుడే జీవితంలో ముందుకెళ్లడం సాధ్యమవుతుందన్నారు. న్యాయవాదులు లేకుండా న్యాయమూర్తులు లేరని, వీరిద్దరి లక్ష్యం కూడా మారుమూల ఉన్న కక్షిదారులకు న్యాయం చేయడమేనన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను ఇరు సంఘాల ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు. -
వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల్లో నో స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోటా కింద వృత్తి విద్యా కోర్సుల్లో ఈ ఏడాది ప్రవేశాలు జరపరాదని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయని.. ఆ కోటా జీవోను రద్దు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను టి.శ్రియతో పాటు మరో నలుగురు సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా తమ వాదనతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. ‘వృత్తి విద్యా కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్ని ఈ ఏడాదికి నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయం బాధాకరమే అయినా విస్తృత అంశాలతో ముడిపడినందున ఆదేశాలు ఇస్తున్నాం. గతేడాది స్పోర్ట్స్ కోటా ప్రవేశాలపై స్టే విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినా.. అది గత విద్యా సంవత్సరానికే పరిమితం. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు. ఇందులో అక్రమాలకు తెర లేస్తున్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకుని ఉండవు’అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్ నోటిఫికేషన్ తర్వాత జీవోనా? విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. ‘క్రీడా కోటా కింద 2017–18 విద్యా సంవత్సరంలో జరిగిన ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఎం విచారణ ఆదేశాల ఫలితంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేపట్టింది. లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డిప్యూటీ డైరెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అప్పటికే క్రీడా కోటాపై ఉన్న కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జీవో 7జారీ అయింది. అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అలాంటి అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన జీవో 7ను అమలు చేయడం అన్యాయం’అని అన్నారు. పైగా, నీట్ నోటిఫికేషన్ వెలువడ్డాక జీవో వచ్చిందని.. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశాలున్నాయని చెప్పారు. దేశంలో ఎప్పుడూ వినని క్రీడలను జీవో ద్వారా ప్రభుత్వం గుర్తించిందని.. స్పోర్ట్స్ కోటాలో సీటు పొందిన విద్యార్థి ఏ ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పతకమైనా సాధించలేదని ఆమె వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. స్పోర్ట్స్ కోటాను ఈ ఏడాది రద్దు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టుకు గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 4న హైకోర్టు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులను ఏర్పాటుచేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్ కోర్టు 10, 17వ తేదీల్లో ఉంటుంది. అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 8న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై 10వ తేదీన కోర్టు విచారణ జరుపుతుంది. అలాగే 15న దాఖలు చేసే కేసులను 17న విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి నేతృత్వం వహిస్తారు. ఇందులో జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ అభినంద్కుమార్లు ధర్మాసనంగా, జస్టిస్ సునీల్‌చౌదరి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 24, 31వ తేదీల్లో రెండో దశ వెకేషన్ కోర్టు.. ఇక రెండో దశ వెకేషన్ కోర్టు 24, 31వ తేదీల్లో ఉంటుంది. అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు 22, 29వ తేదీల్లో చేసుకోవాలి. 22న దాఖలైన కేసులను 24న, 29న దాఖలైన కేసులను 31న విచారించడం జరుగుతుంది. ఈ రెండో దశ వెకేషన్ కోర్టులకు జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లు నేతృత్వం వహిస్తారు. జస్టిస్ భట్, జస్టిస్ ఉమాదేవిలు ధర్మాసనంగా కేసులను విచారిస్తే, జస్టిస్ షమీమ్ అక్తర్ సింగిల్జడ్జిగా కేసులను విచారిస్తారు. -
న్యాయవ్యవస్థలో చంద్రబాబు జోక్యం
హైదరాబాద్: న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ స్వప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో–కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బీసీలు ప్రధాన న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అనుకూలమైన వారు లేరనే కారణంతో ఇటీవల ఉమ్మడి హైకోర్టులో నియమితులైన న్యాయమూర్తులను ఎంపిక దశలోనే నిరోధించే యత్నం చేశారని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టుకు పంపిన న్యాయవాదులపై కావాలనే ఆరోపణలు చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన న్యాయవాదులపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలకు 2016 ఏప్రిల్ 30న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి లేఖ రాస్తే నెల రోజుల్లో సీఎం కేసీఆర్ తన అభిప్రాయం పంపగా.. చంద్రబాబు మాత్రం సిఫార్సులను వ్యతిరేకించారన్నారు. బీసీ న్యాయమూర్తుల పట్ల చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవికుమార్, సదానంద్, దేవరాజు, ప్రశాంత్, స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ న్యాయవాదుల ఆందోళనలు బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలపై కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని వేర్వేరు కోర్టుల్లోని బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రంగారెడ్డి కోర్టుకు చెందిన బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీల ఓట్లు కావాలి.. బీసీలు వద్దా అంటూ ప్రశ్నించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.