సీనియారిటీ తేలే వరకు డీఎస్పీల విభజన వద్దు
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీ తేలేంత వరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)ల కేడర్ విభజన చేయవద్దని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. సీనియారిటీ తేలిన తరువాత తుది కేటాయింపులు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
2014లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 108, తదానుగుణంగా 2015లో జారీ చేసిన మెమోను పునఃసమీక్షించిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం డీఎస్పీల కేడర్‌లో కేటాయింపులు జరిపేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఏసీపీ గిరిధర్, డీఎస్పీలు శ్రీనివాస్, లావణ్యలక్ష్మి, రామమోహనరావు, పరమేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను రెండు రోజుల కిందట న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అదే అంశానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ల కేసులో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఆ ఉత్తర్వులే ఈ వ్యాజ్యాల్లోనూ వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.