seniority
-
పాత సీనియారిటీనీ లెక్కించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామానికో రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశం సమస్యగా మారుతోంది. మళ్లీ మాతృశాఖలోకి వస్తున్నందున తమ పాత సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లోకి వెళ్లిన తమకు సీనియారిటీ వర్తింపచేయని కారణంగా సర్వీసు కోల్పోయామని, ఇప్పుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. నియామక ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదని, అప్పుడే సీనియారిటీ అంశాన్ని తెరపైకి తీసుకురావద్దని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దాటవేస్తుండడం గమనార్హం. సీనియారిటీ లేకుండానే ఇతర శాఖల్లోకి.. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న చాలా మంది వీఆర్వోలు, వీఆర్ఏల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా జీరో సర్వీసుతో ఇతర శాఖల్లోకి పంపారు. విద్యాశాఖ, మున్సిపల్.. తదితర శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలు, వీఆర్ఏల సర్వీసు కలపకుండానే జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో నియమించారు. వీరికి రెవెన్యూలో పనిచేసిన సర్వీసును కలిపితే అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు నష్టపోతారని, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారి కంటే ముందు కొత్తగా రెవెన్యూ నుంచి వచి్చన వారు పదోన్నతులకు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీ ఇవ్వకుండానే ఇతర శాఖల్లో విలీనం చేశారు. ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది. అయినా ఆ సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇప్పుడు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికో రెవెన్యూ అధి కారి నియామకం కోసం ఇతర శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి సుముఖత పత్రాలను రెవెన్యూ వర్గాలు సేకరించాయి. సుముఖత వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెట్టి మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తమ పాత శాఖలోకి మళ్లీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో రెవెన్యూలో పనిచేసినప్పుడు ఏడాదిన్నర నుంచి పదేళ్ల వరకు సర్వీసును కోల్పోయామని, ఇతర శాఖల్లో దాదాపు రెండేళ్లు పనిచేశామని, మళ్లీ ఇప్పుడు జీరో సర్వీసుతో రెవెన్యూలోకి రావడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా పరీక్ష పెట్టినా రాసేందుకు చాలా మంది సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇతర శాఖల్లోనే ఉంటే గత రెండేళ్ల సర్వీసుతో పదోన్నతులకు వీలుంటుందనే భావనలో పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్నారు. పరీక్ష పెట్టాలా వద్దా అన్నదానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా సీనియారిటీ సమస్య తెరపైకి రావడం ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారనుంది. కోదండరాంను కలసి విన్నపం..సీనియారిటీ అంశంపై కొందరు పూర్వ వీఆర్వోలు బుధవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాంను కలిశారు. రెవెన్యూ శాఖలోకి తీసుకుంటున్న తమకు సీనియారిటీ వర్తింపజేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కోదండరాంను కలసిన వారిలో రీడిప్లాయ్డ్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, నేతలు ముత్యా లు, బసవరాజు, భానుశ్రీ, మాధవి, హైమావతి తదితరులున్నారు. -
ప్రమోషన్లలో సీనియారిటీ లొల్లి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతు ల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) నుంచి ప్రధానోపాధ్యాయుడు (హెచ్ఎం)గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని కొందరు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో సీనియారిటీ రూపకల్పనలో తప్పులు దొర్లుతున్నాయని, దీనివల్ల కొందరు టీచర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరిగే వీలుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 3 నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా, సెప్టెంబర్ 1కి కటాఫ్ పెంచడంతో మంగళవారం వరకూ మరో 7 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. కాగా, పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు. జోనల్ సిస్టమ్‌తో సమస్యలు... 2022లో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్ పరిధిలోకి వస్తారు. రెండు జోన్లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి, సిద్దిపేటను మల్టిజోన్–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలతోపాటు సంగారెడ్డిని మల్టీజోన్–2 పరిధిలోకి తెచ్చారు. జోనల్ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదో న్నతులు కల్పించారు. అక్కడి పోస్టులు, ఖాళీల కు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్విసు ఉన్న వారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్విస్ ఉన్నా హెచ్ఎంలుగా ప్రమోష న్లు వచ్చాయి. ఇప్పుడు మల్టిజోన్ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే 19 జిల్లాల పరిధిలోని టీచర్ల ను మల్టిజోన్–1లో కి తేవాలి. 14 జిల్లా ల పరిధిలోని టీచర్లను మల్టిజోన్–2 పరిధిలోకి తేవాలి. ఇక్కడే సమస్య తలెత్తుతోందని, ఈ సమస్యలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయని టీచర్లు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎక్సెల్ ఫార్మాట్లో సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని టీచర్లు డీఈవోలకు ఫిర్యాదులు చేస్తున్నారు. మల్టిజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు చెబుతున్నారు. ఏడాది ఉన్నా వెళ్లాల్సిందేనా? రాష్ట్రవ్యాప్తంగా రెండు మల్టిజోన్ల పరిధిలో 1,974 హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సీనియారిటీని కొలమానంగా తీసుకుంటే దాదాపు వెయ్యి మందికిపైగా టీచర్లు మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్ వచ్చాక మల్టిజోనల్ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వెళ్లాల్సిందే. ఈ కారణంగా సర్విస్ తక్కువగా ఉన్న దాదాపు 800 మంది వరకూ పదోన్నతిని తిరస్కరించే వీలుంది. ప్రమోషన్, బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత పదోన్నతిని తిరస్కరించే వీలుంది. అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయని టీచర్లు అంటున్నారు. రిటైర్మెంట్ వయసులో హెచ్ఎం ప్రమోషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ చేయడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో వీరిని నియమించింది. అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్ సిగ్నల్ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు. అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో ఒకరు తనకు కూడా జేఎల్ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. -
జీవో 19 వారికి వర్తించదు.. కానిస్టేబుళ్ల సీనియారిటీపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: సివిల్ కానిస్టేబుళ్ల సీనియారిటీకి సంబంధించి 2018 ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో 19ను గతంలో నియమితులైన వారికి వర్తింపజేయడం సరికాదని హైకోర్టు స్పష్టంచేసింది. 2018 తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి 10 శాతం కోటాలో సివిల్ విభాగంలోకి వచ్చిన వారికి మాత్రమే ఈ జీవో వర్తిస్తుందని తేల్చిచెప్పింది. 2018కి ముందు నియమితులైన వారంతా గతంలో ఉన్న నిబంధనల మేరకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి పొందేందుకు అర్హులని పేర్కొంది. సీనియారిటీ తయారీలో స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాల్లో వీరు చేసిన సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. స్పెషల్ పోలీస్ నుంచి సివిల్ విభాగంలోకి రావాలని కోరుకునే వారికి ఆరేళ్ల సీనియారిటీ మాత్రమే ఇస్తూ జారీచేసిన జీవో 19ని సవాల్‌చేస్తూ పలువురు కానిస్టేబుళ్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. స్పెషల్ బెటాలియన్‌లో పదేళ్లు, ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో ఐదేళ్లు విధులు నిర్వహించిన వారికి ఇప్పుడు సీనియారిటీ వర్తింపజేయడం లేదని, వీరికంటే జూనియర్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
సీఐల సీనియారిటీ సమస్య కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ పోలీస్ శాఖలను ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిన ఇన్స్పెక్టర్ల సీనియారిటీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. నోషనల్ సీనియారిటీ, పదోన్నతుల వ్యవహారం, ఇతర ప్రతిపాదనలకు సమస్యగా మారిన ఇన్స్పెక్టర్ల సీనియారిటీ జాబి తాను రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు పూర్తి చేశాయి. ఎట్టకేలకు 2రోజుల క్రితం సీనియారిటీ జాబితాను పూర్తి స్థాయిలో సమీక్షించి పోలీస్‌శాఖ తుది జాబితాను విడుదల చేసింది. 1972 నుంచి 1996 వరకు.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు సీనియారిటీ జాబితా రూపొందించకుండా అడహక్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తూ రావడంతో సమస్య ఏర్పడింది. వాస్తవంగా ప్రతీ ఏటా ప్యానల్ ఇయర్కల్లా సీనియారిటీ జాబితా సిద్ధం చేసి అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. తీరా రాష్ట్ర విభజన సమయంలో జీవో నంబర్.54 పేరుతో తప్పులతడకగా రూపొందించిన సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. పదోన్నతుల్లో అన్యాయానికి గురైన అధికారులు హైకోర్టును ఆశ్రయించి సీనియారిటీ జాబితాపై సమీక్షకు ఆదేశాలు తెచ్చారు. దీనిపై అప్పట్నుంచి మౌనంగా ఉన్న పోలీస్ శాఖ చివరికి పాత సీనియారిటీ జాబితాపై పూర్తిగా సమీక్షించి కొత్త జాబితాను విడుదల చేసింది. 1972 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికైన వారి నుంచి 1996 వరకు పోలీస్ శాఖలోకి వచ్చిన అధికారుల జాబితా, వారి నోషనల్ సీనియారిటీ, పదోన్నతి పొందిన సంవత్సరం, సీనియారిటీ పోస్టులు అన్నింటిని సమీక్షించి తుది జాబితా అందుబాటులో పెట్టారు. ఇలా హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్‌ల్లో ఉన్న అధికారుల జాబితాను విడివిడిగా రూపొందించి సంబంధిత అధికారులు, రేంజ్ కార్యాలయాలకు పంపించారు. వీటిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు తెలపాలని పోలీస్ శాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది. 90 శాతం పరిష్కారం దొరికినట్లే.. సీనియారిటీ సమస్యకు సంబంధించి పూర్తి న్యాయం చేయడం కష్టమని, 100కు 90 శాతం మేర సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇంతకుమించి సీనియారిటీ సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని వెల్లడించారు. కన్వర్షన్, కన్వర్షన్ నుంచి వచ్చిన వారికి ఇచ్చిన పదోన్నతులు, అగ్జిలేటరీ పదోన్నతుల వల్ల మొదలైన సమస్య ఇంతకు మించి పరిష్కరించడం కుదరదని, రూపొందించిన సీనియారిటీ తుది జాబితాను హైకోర్టు ముందు పెడతామని, కోర్టు దిశానిర్దేశం ప్రకారం ముందుకెళ్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
సీఐ పదోన్నతుల్లో జాప్యం
* ఏలూరు రేంజిలో రెండు నెలల క్రితమే అమలులోకి * గుంటూరు రేంజ్లో ఎటూ తేల్చని ఐజీ * పదోన్నతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటున్న ఎస్సైలు * సీనియారిటీలో వెనుకపడుతున్నామని ఆవేదన సాక్షి, గుంటూరు: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే సామెత సీఐ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఎస్సైలకు సరిగ్గా సరిపోతుంది. గుంటూరు రేంజ్ పరిధిలో ఎస్సైలు పదోన్నతి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు పూర్తయినా ఇక్కడ మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. రేంజి పరిధిలోని గుంటూరు రూరల్, అర్బన్ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 16 మంది ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొందేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పదోన్నతుల్లో జరుగుతున్న జాప్యంపై సదరు ఎస్సైలు తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులుగా పెండింగ్... పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పించేందుకు డీపీసీ (డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ) నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఎస్సైల సీనియారిటీ, వారిపై ఉన్న ఆరోపణలు, పనిష్మెంట్లు, వారి ప్రతిభ ఆధారంగా జాబితాను తయారు చేసి కౌంటర్ ఆర్డర్ కోసం ఆయా రేంజ్‌ల ఐజీలకు పంపారు. రాష్ట్రంలో వైజాగ్, కర్నూలు, ఏలూరు, గుంటూరు రేంజ్‌లు ఉండగా వైజాగ్, కర్నూలు రేంజిల్లో ఖాళీలు లేకపోవడంతో అక్కడి ఎస్సైలకు పదోన్నతులు కల్పించలేదు. గుంటూరు, ఏలూరు రేంజ్‌ల్లో మాత్రం ఎస్సైలకు పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ నిర్ణయం తీసుకుంది. ఏలూరు రేంజ్ పరిధిలో 42 మంది, గుంటూరు రేంజ్ పరిధిలో 16 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ నిర్ణయం తీసుకుని కౌంటర్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఐజీలకు ఫైల్ పంపింది. ఏలూరు రేంజ్ పరిధిలో రెండు నెలల క్రితమే వీరందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏసీబీ వంటి విభాగాల్లో పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. గుంటూరు రేంజ్ పరిధిలో మాత్రం పదోన్నతుల ఫైల్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ వద్ద పెండింగ్‌లో ఉంది. తమతోపాటు పదోన్నతులు పొందిన ఏలూరు రేంజ్ ఎస్సైలంతా తమకంటే రెండు నెలలు ముందు సీఐలు అయ్యారని, భవిష్యత్తులో డీఎస్పీల పదోన్నతుల సమయంలో సీనియారిటీలో వారికంటే తాము వెనకబడతామని గుంటూరు రేంజి పరిధిలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీపీసీ నుంచి ఐజీకి ఫైల్ వచ్చి 25 రోజులు దాటుతున్నా దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పదోన్నతులు పొందిన 16 మంది ఎస్సైల నుంచి ఏయే విభాగాలకు పోస్టింగ్‌లు కావాలనే దానిపై అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఒకరిద్దరి పోస్టింగ్‌ల విషయంలో నెలకొన్న సందిగ్ధం వల్ల మిగతా వారందరికి పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రేంజ్ ఐజీ స్పందించి వెంటనే పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ వారు కోరుతున్నారు. త్వరలో పోస్టింగ్‌లు కేటాయిస్తాం.. గుంటూరు రేంజ్ పరిధిలో 16 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ డీపీసీ నుంచి ఫైల్ వచ్చింది. పదోన్నతులు పొందిన ఎస్సైల నుంచి అనుమతి పత్రాలు పొంది సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏసీబీ వంటి విభాగాలకు లేఖలు రాశాం. కొంతమంది ఏసీబీకి వెళ్లేందుకు అనుమతి కోరారు. ఏసీబీ ఉన్నతాధికారులు దీన్ని తిరస్కరించడంతో సమస్య తలెత్తింది. త్వరలో సమస్యలన్నీ తొలగించి పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఎన్.సంజయ్, గుంటూరు రేంజ్ ఐజీ -
కమిషనరేట్ వర్సెస్ రూరల్ పోలీస్
కామన్ సీనియారిటీ జాబితా కోసం సిబ్బంది డిమాండ్ జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పట్టుపడుతున్న ఉద్యోగులు రూరల్ అసోసియేషన్ అధ్యక్షుడిపై ఆగ్రహం న్యాయం చేస్తానని రూరల్ ఎస్పీ హామీ వరంగల్ : జిల్లా పోలీసు శాఖలోని సివిల్ విభాగం ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపకల్పనలో జాప్యంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2012లో జిల్లా పోలీసు విభాగం అర్బన్, రూరల్‌గా విడిపోగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించారు. అనంతరం ఏర్పడిన కమిషనరేట్‌కు అర్బన్ పోలీసులను కేటాయించారు. దీంతో భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన రూరల్ పోలీసులు కామన్ సీనియారిటీ జాబితాను కేడర్ల వారీగా రూపొందించాలని డిమాండ్ చేశారు. అయితే, జాబితా తయారీలో ఆలస్యంపై ఏఆర్ ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా.. పరిశీలించిన హైకోర్టు కామన్ సీనియార్టీ జాబితా రూపొందించాలని ఆదేశించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇది అమలు కాకపోవడంతో హైకోర్టుకు మరోసారి వెళ్లగా ఈ ఏడాది జూన్ 29న జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ కమిషనర్ అనుమతితో రూరల్ ఎస్పీ ఈ జాబితాను ఈ ఏడాది డిసెంబర్ 31లోగా రూపొందించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీలోగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. సంఘ నేతపై ఉద్యోగుల ఆగ్రహం... ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారీలో జాప్యంపై చర్చించేందుకు రూరల్ పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం హన్మకొండలోని జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు శోభన్‌కుమార్‌ను పలువురు నిలదీశారు. అనంతరం జిల్లాలోని మొత్తం పోలీసుల ఉమ్మడి సీనియారిటీ రూపొందించాకే కొత్త జిల్లాలకు సిబ్బందిని విభజించాలని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ఝూను కలిసి కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు తెలిపారు. అప్లోడ్ కాని వివరాలు... జిల్లాల విభజన సందర్భంగా ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ప్రతీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు జాబితాలను అన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈక్రమంలో రూరల్ పోలీసుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసినా కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు మాత్రం చేయలేదని తెలిసింది. కమిషనరేట్ ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేస్తే ఉమ్మడి సీనియారిటీ బహిర్గతమవుతుందనే జాప్యం చేస్తున్నట్లు రూరల్ పోలీసులు ఆరోపిస్తున్నారు. జిల్లా విభజన అనంతరం వివరాలు అప్లోడ్ చేసినా.. అప్పటిలోగా తమను జిల్లాకు కేటాయిస్తే సర్వీసు పరంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికతను ఆధారంగా తీసుకోవాలి... రూరల్-కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులందరికీ వర్తించేలా ఉమ్మడి సీనియారిటీ జాబితా రూపొందించి కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఉద్యోగంలో చేరిన సమయంలో పేర్కొన్న స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తే న్యాయం జరుగుతుందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని వారు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి.. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కాగా, ఉమ్మడి సీనియారిటీ జాబితాను ప్రకటిస్తే పదోన్నతులు ఆలస్యమవుతాయనే కారణంతోనే కొంత మంది ఇలా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
సీనియారిటీ తేలే వరకు డీఎస్పీల విభజన వద్దు
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సీనియారిటీ తేలేంత వరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)ల కేడర్ విభజన చేయవద్దని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. సీనియారిటీ తేలిన తరువాత తుది కేటాయింపులు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2014లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 108, తదానుగుణంగా 2015లో జారీ చేసిన మెమోను పునఃసమీక్షించిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం డీఎస్పీల కేడర్‌లో కేటాయింపులు జరిపేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఏసీపీ గిరిధర్, డీఎస్పీలు శ్రీనివాస్, లావణ్యలక్ష్మి, రామమోహనరావు, పరమేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను రెండు రోజుల కిందట న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అదే అంశానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ల కేసులో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఆ ఉత్తర్వులే ఈ వ్యాజ్యాల్లోనూ వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. -
దొడ్డిదారిన టీచర్ల బదిలీలు
కౌన్సెలింగ్ ప్రక్రియకు మంగళం ? ప్రజా ప్రతినిధుల సిఫారసులతో బదిలీలకు శ్రీకారం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయుల పేర్లతో జాబితా పరిశీలన కోసం డీఈవోకు పంపిన విద్యాశాఖ డెరైక్టరేట్ ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి అన్యాయం గుంటూరు ఎడ్యుకేషన్ :టీచర్లను దొడ్డిదారిన బదిలీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసింది. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో చేయాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ఏడాదిగా చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సౌలభ్యంగా ఉండే ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు.కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కోసం రాజకీయ పలుకుబడి కలిగిన టీచర్లు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు పొంది సీఎం పేషీకి క్యూ కడుతున్నారు. ఉపాధ్యాయులు సమర్పించిన సిఫార్సు లేఖలను సీఎం పేషీ అధికారులు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు పంపుతున్నారు.సీఎం పేషీ ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులను నేరుగా బదిలీ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు ఆయా టీచర్ల జాబితా పుంపుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కొంత కాలంగా ఈ తంతు నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంపాలని ఓ జాబితాను డీఈవోకు పంపారు. జిల్లా నుంచి బదిలీకి దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యేల సిఫార్సులతో వెళ్లిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, బదిలీకి అర్హులా, కాదా అని నిర్ధారించి నివేదిక పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు సమాచారం పంపారు. ఉపాధ్యాయులను అక్రమ మార్గంలో బదిలీ చేసే పద్ధతికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్వయానా సీఎం ప్రకటించినా అదే ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిలో బదిలీలకు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించాల్సిన బదిలీల ప్రక్రియను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటున్న కారణంగా సీనియార్టీ కలిగి, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు పంపుతున్నాం ... పాఠశాలల్లో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై క్షేత్ర స్థాయిలో విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి వివరాలు అడిగారు. జిల్లాలో ఏఏ పాఠశాలల్లో ఖాళీలున్నదీ ఎంఈవో, డీవైఈవోల నుంచి సమాచారం సేకరించి ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు పంపుతున్నాం. - డి. ఆంజనేయులు, డీఈవో -
అయినోళ్లు ఇక్కడే!
కర్నూలు, న్యూస్‌లైన్: రెండో పటాలంలో ఇద్దరు ఆర్ఎస్ఐలు, ఆరుగురు ఏఆర్ ఎస్ఐలు, 33 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 97 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ కమాండెంట్ విజయ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. బయటి కంపెనీల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ బదిలీల్లో వీరి బాధలను పట్టించుకోకపోవడం గమనార్హం. దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నా అనుకూలమైన వారికే పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. ఏ కంపెనీ నుంచి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఆఫీసర్ కమాండింగ్(ఓసీ) నుంచి ఎన్ని ఫార్వర్డ్ అయ్యాయి.. అసిస్టెంట్ కమాండెంట్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఏ ప్రాతిపదికన బదిలీ చేశారనే విషయాలపై స్పష్టత కొరవడింది. మెడికల్, స్పౌజ్, కొత్తగా పెళ్లయిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సదరు సిబ్బంది బయటకు చెప్పుకోలేక మౌనంగా రోదిస్తున్నారు. కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, ఆర్ఐతో పాటు మరికొందరు కమిటీ సభ్యుల కసరత్తుతో బదిలీల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అలాంటిది కమిటీలో కొందరు సభ్యులకు తెలియకుండానే ఈ ప్రక్రియ ముగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై పలువురు సిబ్బంది సోమవారం డీజీపీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసినట్లు సమాచారం.