కమిషనరేట్ వర్సెస్ రూరల్ పోలీస్
-
కామన్ సీనియారిటీ జాబితా కోసం సిబ్బంది డిమాండ్
-
జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పట్టుపడుతున్న ఉద్యోగులు
-
రూరల్ అసోసియేషన్ అధ్యక్షుడిపై ఆగ్రహం
-
న్యాయం చేస్తానని రూరల్ ఎస్పీ హామీ
వరంగల్ : జిల్లా పోలీసు శాఖలోని సివిల్ విభాగం ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపకల్పనలో జాప్యంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2012లో జిల్లా పోలీసు విభాగం అర్బన్, రూరల్‌గా విడిపోగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించారు. అనంతరం ఏర్పడిన కమిషనరేట్‌కు అర్బన్ పోలీసులను కేటాయించారు. దీంతో భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన రూరల్ పోలీసులు కామన్ సీనియారిటీ జాబితాను కేడర్ల వారీగా రూపొందించాలని డిమాండ్ చేశారు. అయితే, జాబితా తయారీలో ఆలస్యంపై ఏఆర్ ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా.. పరిశీలించిన హైకోర్టు కామన్ సీనియార్టీ జాబితా రూపొందించాలని ఆదేశించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇది అమలు కాకపోవడంతో హైకోర్టుకు మరోసారి వెళ్లగా ఈ ఏడాది జూన్ 29న జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ కమిషనర్ అనుమతితో రూరల్ ఎస్పీ ఈ జాబితాను ఈ ఏడాది డిసెంబర్ 31లోగా రూపొందించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీలోగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు.
సంఘ నేతపై ఉద్యోగుల ఆగ్రహం...
ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారీలో జాప్యంపై చర్చించేందుకు రూరల్ పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం హన్మకొండలోని జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు శోభన్‌కుమార్‌ను పలువురు నిలదీశారు. అనంతరం జిల్లాలోని మొత్తం పోలీసుల ఉమ్మడి సీనియారిటీ రూపొందించాకే కొత్త జిల్లాలకు సిబ్బందిని విభజించాలని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూను కలిసి కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు తెలిపారు.
అప్‌లోడ్ కాని వివరాలు...
జిల్లాల విభజన సందర్భంగా ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ప్రతీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు జాబితాలను అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈక్రమంలో రూరల్ పోలీసుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినా కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు మాత్రం చేయలేదని తెలిసింది. కమిషనరేట్ ఉద్యోగుల వివరాలు అప్‌లోడ్ చేస్తే ఉమ్మడి సీనియారిటీ బహిర్గతమవుతుందనే జాప్యం చేస్తున్నట్లు రూరల్ పోలీసులు ఆరోపిస్తున్నారు. జిల్లా విభజన అనంతరం వివరాలు అప్‌లోడ్ చేసినా.. అప్పటిలోగా తమను జిల్లాకు కేటాయిస్తే సర్వీసు పరంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికతను ఆధారంగా తీసుకోవాలి...
రూరల్-కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులందరికీ వర్తించేలా ఉమ్మడి సీనియారిటీ జాబితా రూపొందించి కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఉద్యోగంలో చేరిన సమయంలో పేర్కొన్న స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తే న్యాయం జరుగుతుందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని వారు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి.. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కాగా, ఉమ్మడి సీనియారిటీ జాబితాను ప్రకటిస్తే పదోన్నతులు ఆలస్యమవుతాయనే కారణంతోనే కొంత మంది ఇలా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.