పట్టుబడిన ఉద్యోగులతో మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య
కరీంనగర్ క్రైం: మెడికల్ షాపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన రవీందర్ పదేళ్లుగా శ్రీగణేష్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఫార్మాసిస్టు మారడంతో లైసెన్స్ పునరుద్ధరణ కోసం గత నెల 26న ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ పెద్ది వినాయక్ రెడ్డిని సంప్రదించాడు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించి రూ.3,500 తీసుకున్నాడు. ఈ నెల 2న మళ్లీ సంప్రదించగా రూ.25 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం కరీంనగర్‌లోని చైతన్యపురిలోని ఔషధ నియంత్రణ ఏడీ కార్యాలయంలో రవీందర్ వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా వినాయక్‌రెడ్డిని, పని పూర్తయిందని రూ.500 డిమాండ్ చేసిన అటెండర్ ఎండీ.రిజ్వాన్‌ను పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment