సాక్షి, హైదరాబాద్: సివిల్ కానిస్టేబుళ్ల సీనియారిటీకి సంబంధించి 2018 ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో 19ను గతంలో నియమితులైన వారికి వర్తింపజేయడం సరికాదని హైకోర్టు స్పష్టంచేసింది. 2018 తర్వాత ఆర్మ్‌డ్ రిజర్వ్ నుంచి 10 శాతం కోటాలో సివిల్ విభాగంలోకి వచ్చిన వారికి మాత్రమే ఈ జీవో వర్తిస్తుందని తేల్చిచెప్పింది. 2018కి ముందు నియమితులైన వారంతా గతంలో ఉన్న నిబంధనల మేరకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి పొందేందుకు అర్హులని పేర్కొంది.
సీనియారిటీ తయారీలో స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాల్లో వీరు చేసిన సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. స్పెషల్ పోలీస్ నుంచి సివిల్ విభాగంలోకి రావాలని కోరుకునే వారికి ఆరేళ్ల సీనియారిటీ మాత్రమే ఇస్తూ జారీచేసిన జీవో 19ని సవాల్‌చేస్తూ పలువురు కానిస్టేబుళ్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. స్పెషల్ బెటాలియన్‌లో పదేళ్లు, ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో ఐదేళ్లు విధులు నిర్వహించిన వారికి ఇప్పుడు సీనియారిటీ వర్తింపజేయడం లేదని, వీరికంటే జూనియర్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment