దొడ్డిదారిన టీచర్ల బదిలీలు | Loopholes of teachers' transfers | Sakshi
Sakshi News home page

దొడ్డిదారిన టీచర్ల బదిలీలు

Published Sat, Oct 25 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

దొడ్డిదారిన  టీచర్ల బదిలీలు

దొడ్డిదారిన టీచర్ల బదిలీలు

కౌన్సెలింగ్ ప్రక్రియకు మంగళం ?
     
ప్రజా ప్రతినిధుల సిఫారసులతో బదిలీలకు శ్రీకారం
జిల్లాలో 45 మంది ఉపాధ్యాయుల పేర్లతో జాబితా
పరిశీలన కోసం డీఈవోకు పంపిన  విద్యాశాఖ డెరైక్టరేట్
ఏళ్ల తరబడి బదిలీ కోసం  ఎదురు చూస్తున్న వారికి అన్యాయం

 
గుంటూరు ఎడ్యుకేషన్ :టీచర్లను దొడ్డిదారిన బదిలీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసింది. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో చేయాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ఏడాదిగా చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సౌలభ్యంగా ఉండే ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు.కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కోసం రాజకీయ పలుకుబడి కలిగిన టీచర్లు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు పొంది సీఎం పేషీకి క్యూ కడుతున్నారు.

ఉపాధ్యాయులు సమర్పించిన సిఫార్సు లేఖలను సీఎం పేషీ అధికారులు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు పంపుతున్నారు.సీఎం పేషీ ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులను నేరుగా బదిలీ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు ఆయా టీచర్ల జాబితా పుంపుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కొంత కాలంగా ఈ తంతు నడుస్తోంది.  ప్రస్తుతం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంపాలని ఓ జాబితాను డీఈవోకు పంపారు.  జిల్లా నుంచి బదిలీకి దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యేల సిఫార్సులతో వెళ్లిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, బదిలీకి అర్హులా, కాదా అని నిర్ధారించి నివేదిక పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు సమాచారం పంపారు.

 ఉపాధ్యాయులను అక్రమ మార్గంలో బదిలీ చేసే పద్ధతికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్వయానా సీఎం ప్రకటించినా అదే ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిలో బదిలీలకు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు.  నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించాల్సిన బదిలీల ప్రక్రియను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటున్న కారణంగా సీనియార్టీ కలిగి, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని  ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు పంపుతున్నాం ...

పాఠశాలల్లో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై క్షేత్ర స్థాయిలో విద్యాశాఖ డెరైక్టరేట్  నుంచి వివరాలు అడిగారు. జిల్లాలో ఏఏ పాఠశాలల్లో ఖాళీలున్నదీ ఎంఈవో, డీవైఈవోల నుంచి సమాచారం సేకరించి ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు పంపుతున్నాం.
 - డి. ఆంజనేయులు, డీఈవో
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement