Counseling process
-
ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ఐటీల్లో 54477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. -
నేటి నుంచి టీఎస్ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 30 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాసినపుడు నమోదు చేసుకున్న బయోమెట్రిక్ వివరాలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 20,120 ఎంబీఏ సీట్లు ఉండగా, 1,845 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే మెరుగైన కాలేజీలో సీటు పొందేందుకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమవెంట ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల మెమోలు, ఇంటర్, టెన్త్ పాస్ సర్టిఫికెట్లు, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువపత్రం, స్పోర్ట్స్, ఎన్సీసీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీల అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూల్, తదితర వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
► 15వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ► 9 నుంచి ఆప్షన్ల ఎంపిక జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 10 రోజుల పాటు కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీతోపాటు జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సంజీవరావు, పుల్లారెడ్డి కాలేజిలో ప్రిన్సిపాల్ విజయభాస్కర్, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. 15వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన 6వ తేదీ 1 నుంచి 5వేలు, 7న 5001 నుంచి 20వేలు, 8న 20001 నుంచి 35వేలు, 9న 35,001 నుంచి 50వేలు, 10న 50,001 నుంచి 65వేలు, 11న 65,001 నుంచి 80వేలు, 12న 80,001 నుంచి 96వేలు, 13న 96,001 నుంచి 1,12,000, 14న 1,12,001 నుంచి 1,28,000, 15న 1,28,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. 9 నుంచి ఆప్షన్ల ఎంపిక 9వ తేదీ నుంచి ర్యాంకుల వారీగా ఆప్షన్ల ఎంపిక జరగనుంది. 9వ తేదీ నుంచి 10వ తేది వరకు 1 నుంచి 35వేలు, 11 నుంచి 12వ తేదీ వరకు 35,001 నుంచి 60వేల వరకు, 13, 14న 60,001 నుంచి 90వేల వరకు, 15, 16న 90,001 నుంచి 1,20,000, 17, 18న 1,20,001 నుంచి చివరి ర్యాంకు అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్ల మార్పునకు 19, 20వ తేదిల్లో అవకాశం కల్పిస్తారు. 22వ తేదిన కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.tseamcet.nic.in ద్వారా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిన మొదటి రెండు గంటల్లోనే 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాలేజీలు, బ్రాంచీల వారీగా, సీట్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా రాష్ట్రంలోని 260 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,22,786 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 86,862 సీట్ల (70 శాతం) భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులోప్రభుత్వ కాలేజీల్లో 3,041 సీట్లు ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో 83,821 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇక మేనేజ్మెంట్ కోటాలో 35,923 సీట్లు ఉన్నట్లు తెలిపింది. కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలకు ఆకు పచ్చ (లైట్ గ్రీన్) రంగు కేటాయించారు. వీటిని ఎలాంటి వివాదం లేని, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలుగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఈనెల 20 నుంచి చేపట్టబోయే తనిఖీ నివేదికలకు లోబడి వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చిన కాలేజీలకు నీలి రంగు (లైట్ బ్లూ) కేటాయించారు. తనిఖీల్లో అన్ని ఫ్యాకల్టీ అన్ని సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే వాటికి అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కోర్టును ఆశ్రయించకుండా త్వరలో చేపట్టే తనిఖీ నివేదికలకు కట్టుబడి ఉంటామని లేఖలు అందజేసిన కాలేజీలకు ఉదారంగు (లైట్ పర్పుల్) కేటాయించారు. వీటిల్లోనూ ఫ్యాకల్టీ సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే అనుబంధ గుర్తింపు వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆయా రంగుల్లోని కాలేజీల జాబితాలను పరిశీలించుకున్నాకే కాలేజీలను ఎంచుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ఆయా కాలేజీలకు, వాటిలోని కోర్సులకు కూడా పైన పేర్కొన్న రంగులు ఉంటాయని, వాటిని పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఏ రోజు ఎంత ర్యాంకు వరకు..? శుక్రవారం నుంచి ఈనెల 19 సాయంత్రం 5 గంటల వరకు ఒకటో ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19 సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు 44,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అన్ని ర్యాంకుల వారు 22వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు 44 వేల ర్యాంకులోపు వారిలో 32,857 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఉన్నారని, అందులో శుక్రవారం మొదటి రెండు గంటల్లో 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఇష్టారాజ్యంగా ‘ఎం-సెట్’
కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రైవేటు వైద్య కళాశాలల ఒంటెత్తు పోకడ ⇒ ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ పంపాలని విద్యార్థులకు ఎస్ఎంఎస్లు ⇒ వెబ్సైట్లో అప్లోడ్ కావట్లేదని తల్లిదండ్రుల గగ్గోలు ⇒ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అడ్మిషన్ల వ్యవహారం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు కౌన్సెలింగ్ ప్రక్రియలోనూ ఒంటెత్తు పోకడను ప్రదర్శిస్తున్నాయి. ఎం-సెట్ ఫలితాల్లో ర్యాంకుల ఊసెత్తని యాజమాన్యాలు తాజాగా ఇంటర్ హాల్‌టికెట్ నంబర్లను ఈ నెల 22లోగా తమ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలంటూ విద్యార్థులకు ఎస్ఎంఎస్లు పంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ‘సాక్షి’కి చెప్పారు. అయితే ఎంత ప్రయత్నించినా వెబ్సైట్లో ఆ వివరాలు అప్లోడ్ కావట్లేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తండ్రి ఆరోపించారు. దీనిపై వెబ్సైట్లో పేర్కొన్న నంబర్‌కు ఫోన్ చేస్తే ‘ఇది ఒక క్లినికల్ సెంటర్. మాకు, ఎం-సెట్ పరీక్షకు సంబంధం లేదు’ అని సమాధానం వచ్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజులే సమయం ఉందని... ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదని ఆందోళన చెందుతున్నారు. కాగా, ర్యాంకుల ప్రకటనకు ఇంటర్ వెయిటేజీ ఉండదంటూ చెప్పుకొచ్చిన యాజ మాన్యాలు తాజాగా హాల్ టికెట్ నంబర్ అడిగారంటే ఇంటర్ వెయిటేజీ ఉంటుందేమోనన్న చర్చ విద్యార్థుల్లో జరుగుతోంది. కానీ వెయిటేజీ ఉండదని ఆ మేరకు ప్రత్యేక ఎం-సెట్‌పై జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మరి ఎందుకు హాల్‌టికెట్ నంబర్ అడిగారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ఎం-సెట్‌పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలోకానీ... సచివాలయంలోని ముఖ్య కార్యదర్శి పేషీలోకానీ ప్రైవేటు ఎం-సెట్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటంలేదు. ప్రభుత్వం వారికి వత్తాసు పల కడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. 35 శాతం యాజమాన్య కోటా సీట్లను ఎం-సెట్ నిర్వహణకు ముందే కళాశాలల యాజమాన్యాలు ఒక్కోటీ రూ. కోటికిపైగా అమ్ముకొని వందల కోట్లు వెనకేసుకున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తడం తెలిసిందే. -
12 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ ప్రకారం.. ఈ నెల 20వ తే దీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను మార్పుచేసుకునేందుకు 22, 23 తేదీల్లో అవకాశమిస్తున్నారు. 26న విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అడ్మిషన్ల కమిటీ గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై అడ్మిషన్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కోసం గతంలో హైదరాబాద్‌లో నోడల్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు దీన్ని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. విద్యార్థులు ర్యాంకులు, హెల్ప్‌లైన్ సెంటర్లు, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, వెబ్ ఆప్షన్ల తేదీలు తదితర ముఖ్యమైన వివరాలకోసం http://apeamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ యథాతథం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులను గతేడాది మాదిరిగానే అమలు చేయనున్నారు. గతంలో రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన మేరకు ఈ ఫీజులుంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలోని విధానాన్నే అమలు చేయనున్నట్టు వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈసారి ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి చెల్లించనక్కర్లేకుండా నేరుగా కాలేజీల్లో అడ్మిషను పొందిన సమయంలోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గతంలో రూ.600 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.800కు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. -
ఎంఈఓల బదిలీల్లో జాప్యం!
తేలని నిబంధనలు వేర్వేరుగా జెడ్పీ, ప్రభుత్వ సర్వీసులు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఎంఈఓల బదిలీల్లో జాప్యం జరుగుతోంది. నిబంధనలు, కోర్టు కేసుల కారణంగా అసలు బదిలీలు జరుగుతాయా? లేదా అనే సందేహం కలుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల నిబంధనలు వేర్వేరుగా ఉండటమే బదిలీ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ హెచ్ఎంలు, ఎంఈఓలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించడంతో వివాదం కొనసాగుతోంది. నిబంధనలను ఏకీకృతం చేయాలని సుమారు 15 ఏళ్ల క్రితం ఎంఈఓ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు నడుస్తుడగా అక్టోబర్ 30న గుంటూరులో రెగ్యులర్ ఎంఈఓల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ హడావుడిగా చేపట్టారు. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో హాజరైన ఎంఈఓల నుంచి ఆప్షన్లను మాత్రమే తీసుకున్నారు. బదిలీల ఉత్తర్వులను వారికి ఇవ్వలేదు. పలు న్యాయ, సర్వీసు సంబంధిత అస్పష్టత కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. జిల్లాలో 14 మంది రెగ్యులర్ ఎంఈఓలు పని చేస్తున్నారు. వీరిలో 13 మంది ఆప్షన్ల ప్రక్రియలో తమకు ఇష్టమైన మండలాలను ఎంచుకున్నారు. ఒకరు మాత్రం ఆప్షన్ల ప్రక్రియకు హాజరు కాలేదు. ఎంఈఓల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో జరగాలని కొంత మంది, జిల్లాస్థాయిలో జరగాలని మరికొంత మంది వాదిస్తున్నారు. ఎంఈఓలు, హెచ్ఎంల బదిలీలు గుంటూరు ఆర్జేడీ పరిధిలోకి వస్తాయి. గుంటూరు, ఒంగోలులో హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో పనిచేస్తున్న వారు ఎప్పటికైనా సొంత ప్రాంతాలకు వెళ్తామనే ఆశ ఉండేది. ప్రస్తుతం అస్పష్టమైన విధానంతో వారి ఆశలు అడుగంటాయి. 2005లో జరిగిన బదిలీల్లో గుంటూరుకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు నుంచి కూడా గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సీనియార్టీ జాబితా, జిల్లా పరిషత్ సీనియార్టీని జాబితాలో ఏర్పడ్డ సందిగ్ధత వల్ల ఏ ప్రాంత ఎంఈఓలు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తోంది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ ఎంఈఓలకు జిల్లా స్థాయిలో బదిలీలు నిర్వహించడం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. దీంతో పాఠశాలల పర్యవేక్షణ తీవ్రంగా కుంటుపడుతోంది. జిల్లాలోని 46 మండలాలకు గానను 14 మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. వీరిలో ఒకరు సస్పెండ్ కావడంతో 13 మంది ఎంఈఓలు పని చేస్తున్నారు. మిగిలిన మండలాల్లో సీనియర్ హెచ్ఎంలు ఇన్చార్జ్ ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ, పథకాల అమలు, పాఠశాల నిర్వహణ తదితర పనులు వారికి తలకు మించిన భారంగా మారుతోంది. విద్యాబుద్ధులు చెప్పే శాఖలో నిర్దిష్టమైన నియమ నిబంధనలు లేకపోవడంతో జోనల్ స్థాయి, జిల్లా స్థాయి తేలని పక్షంలో బదిలీలు జరిగే ప్రసక్తే లేదని ఎంఈఓలు గుసగుసలాడుతున్నారు. ఏళ్ల తరబడి పరాయి జిల్లాల్లో పనిచేస్తున్న తమను జిల్లా పరిధిలో బదిలీ చేస్తే ఒప్పుకునేది లేదని కొంత మంది ఎంఈఓలు కోర్టులను ఆశ్రయించారు. మంత్రి మౌఖిక ఆదేశాలతో అర్జెంట్ అర్జెంట్‌గా ఆప్షన్ల ప్రక్రియ జరిపారని, కోర్టులో ఉన్న అంశాన్ని పక్కన బెట్టి బదిలీలు జరగడం ఎంత వరకు సాధ్యమో వేచి చూడాల్సిందే. -
దొడ్డిదారిన టీచర్ల బదిలీలు
కౌన్సెలింగ్ ప్రక్రియకు మంగళం ? ప్రజా ప్రతినిధుల సిఫారసులతో బదిలీలకు శ్రీకారం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయుల పేర్లతో జాబితా పరిశీలన కోసం డీఈవోకు పంపిన విద్యాశాఖ డెరైక్టరేట్ ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి అన్యాయం గుంటూరు ఎడ్యుకేషన్ :టీచర్లను దొడ్డిదారిన బదిలీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసింది. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో చేయాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ఏడాదిగా చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సౌలభ్యంగా ఉండే ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు.కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కోసం రాజకీయ పలుకుబడి కలిగిన టీచర్లు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు పొంది సీఎం పేషీకి క్యూ కడుతున్నారు. ఉపాధ్యాయులు సమర్పించిన సిఫార్సు లేఖలను సీఎం పేషీ అధికారులు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు పంపుతున్నారు.సీఎం పేషీ ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులను నేరుగా బదిలీ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు ఆయా టీచర్ల జాబితా పుంపుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కొంత కాలంగా ఈ తంతు నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంపాలని ఓ జాబితాను డీఈవోకు పంపారు. జిల్లా నుంచి బదిలీకి దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యేల సిఫార్సులతో వెళ్లిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, బదిలీకి అర్హులా, కాదా అని నిర్ధారించి నివేదిక పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు సమాచారం పంపారు. ఉపాధ్యాయులను అక్రమ మార్గంలో బదిలీ చేసే పద్ధతికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్వయానా సీఎం ప్రకటించినా అదే ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిలో బదిలీలకు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించాల్సిన బదిలీల ప్రక్రియను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటున్న కారణంగా సీనియార్టీ కలిగి, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు పంపుతున్నాం ... పాఠశాలల్లో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై క్షేత్ర స్థాయిలో విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి వివరాలు అడిగారు. జిల్లాలో ఏఏ పాఠశాలల్లో ఖాళీలున్నదీ ఎంఈవో, డీవైఈవోల నుంచి సమాచారం సేకరించి ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు పంపుతున్నాం. - డి. ఆంజనేయులు, డీఈవో -
చదువులకేదీ చేయూత?
- కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కిమ్మనని సర్కారు - పేరుకుపోతున్న రీయింబర్స్మెంట్ బకాయిలు - స్కాలర్షిప్లు, మెస్ చార్జీలదీ అదే పరిస్థితి - వేలాది మంది విద్యార్థులకు తప్పని అవస్థలు సాక్షి, కాకినాడ : కొత్త ప్రభుత్వం కొలువుదీరి వందరోజులైనా విద్యార్థుల కొలిమి నుంచి బయటపడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, మెస్ చార్జీల బకాయిలు మంజూరు కాక వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా సొమ్ములందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. రెండో కౌన్సెలింగ్ అనంతరం మరో వారం పదిరోజుల్లో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా గత విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాకు సంబంధించి ఈ మొత్తం రూ.122 కోట్ల వరకు ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు (ఉపకార వేతనాలు), మెస్ చార్జీల బకాయిలు కూడా కొండల్లా పేరుకుపోతున్నాయి. 2013-2014 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఎస్సీ, బీసీ, ఈబీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు సంబంధించి మొత్తం రూ.93,24,00,000 బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 3,400 మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించి రూ.13 కోట్లు బకాయిలు ఉండగా, అందులో ఉపకారవేతనాల కింద రూ.10 కోట్లు, రూ.3 కోట్లు మెస్ చార్జీల నిమిత్తం విడుదల కావాల్సి ఉంది. 31వేల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 కోట్లు, మెస్ చార్జీల కింద రూ.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 19 వేల మంది ఈబీసీ విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం చెల్లించాల్సి ఉంది. 3 వేల మంది ఎస్టీ విద్యార్థులకు సంబంధించి రూ.కోటి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు రూ.24 లక్షలు విడుదల కావాల్సి ఉండగా మిగిలిన మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన బకాయిగా విడుదల కావలసి ఉంది. ‘దీవెన’కూ గతి లేదు.. ఇక రాజీవ్ విద్యాదీవెన పథకంకింద 9, 10 తరగతుల ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.150ల చొప్పున పది నెలలకు ఒకేసారి రూ.750 అడ్హాక్ గ్రాంట్ కింద మంజూరు చేస్తుంటారు. జిల్లాలో 12,945 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.91కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ న్యూస్కీమ్ కింద 5 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న బాలురకు నెలకు రూ.100 చొప్పున, బాలికలకు రూ.150 చొప్పున చెల్లిస్తుంటారు. ఈ స్కీమ్ కింద జిల్లాలో 26,224 మంది విద్యార్థులకు రూ.3.28 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం రూ.71 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.2.57 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఉత్తమ గురుకుల పాఠశాలల్లో 652 మంది విదార్థులకు సంబంధించి రూ.1.30 కోట్లు విడుదల కావాల్సి ఉంది. నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు సంబంధించి రూ.20 లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంది. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకైతే రూ.50 కోట్ల వరకు స్కాలర్షిప్, మెస్‌చార్జీల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు పంపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అధికారులంటున్నారు. -
త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు జరుగనున్నాయి. వివిధ ఠాణాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఈ బదిలీల్లో స్థానభ్రంశం కలుగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ కసరత్తు ప్రారంభించారు. పోలీసు శాఖలో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలకు ఆయన స్వీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. పలువురికి స్థానభ్రంశం ఐదేళ్ల నుంచి ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు బదిలీ తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా సుమారు 2,400 మంది కానిస్టేబుళ్లు సివిల్ డ్యూటీలో ఉన్నారు. గతేడాది ఐదేళ్లు నిండిన సుమారు 380 కానిస్టేబుళ్లను ఒక ఠాణా నుంచి మరో ఠాణాకు పంపించారు. ఈ బదిలీల్లో 250 మందికిపైగా బదిలీలు జరిగే అవకాశామున్నట్లు సమాచారం. జూన్ 2న కొత్త సర్కారు కొలువుదీరిన అనంతరం బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. బదిలీకి ఒక్కో విధానం గతంలో ఎస్పీలుగా పనిచేసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధానంలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని సార్లు ఆ విధానాలు విమర్శలకు దారితీశాయి. గతంలో ఓ ఎస్పీ ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించి ఒక గ్రేడ్ నుంచి మరో గ్రేడ్‌కు, ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్ డివిజన్‌కు తప్పనిసరి బదిలీ చేయాలని చేసిన ప్రయత్నాలపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విధానాన్ని ఆయనకు వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎస్పీలు కూడా కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఆప్షన్లకు అవకాశమిచ్చి వారికి అనువుగానే బదిలీలు చేపట్టారు. ప్రధానంగా కానిస్టేబుళ్లు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. రాత్రిపగలు అని తేడా లేకుండా పోలీస్ డ్యూటీలో ఉండే కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అనువైన చోటే అవకాశం ప్రస్తుత ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ విధానంలో ఈ బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో సర్కిల్, సబ్ డివిజన్, గ్రేడ్ అనే విధానాలు కాకుండా కానిస్టేబుల్ తనకు అనువుగా భావించే మూడు పోలీసు స్టేషన్లను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ఎంచుకున్న స్టేషన్లలో ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడకు బదిలీ చేస్తారు. ఈ విధానంపై పోలీసు శాఖలో హార్షం వ్యక్తమవుతోంది. అదే విధంగా పైరవీలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. తనకు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్న పక్షంలో వారిని పట్టణ ప్రాంతాలు, ఆస్పత్రులు ఉన్నచోటికి బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌ను వివరణ కోరగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తామని, త్వరలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.