- తేలని నిబంధనలు
- వేర్వేరుగా జెడ్పీ, ప్రభుత్వ సర్వీసులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఎంఈఓల బదిలీల్లో జాప్యం జరుగుతోంది. నిబంధనలు, కోర్టు కేసుల కారణంగా అసలు బదిలీలు జరుగుతాయా? లేదా అనే సందేహం కలుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల నిబంధనలు వేర్వేరుగా ఉండటమే బదిలీ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ హెచ్‌ఎంలు, ఎంఈఓలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించడంతో వివాదం కొనసాగుతోంది.
నిబంధనలను ఏకీకృతం చేయాలని సుమారు 15 ఏళ్ల క్రితం ఎంఈఓ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు నడుస్తుడగా అక్టోబర్ 30న గుంటూరులో రెగ్యులర్ ఎంఈఓల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ హడావుడిగా చేపట్టారు. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో హాజరైన ఎంఈఓల నుంచి ఆప్షన్లను మాత్రమే తీసుకున్నారు. బదిలీల ఉత్తర్వులను వారికి ఇవ్వలేదు. పలు న్యాయ, సర్వీసు సంబంధిత అస్పష్టత కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం.
జిల్లాలో 14 మంది రెగ్యులర్ ఎంఈఓలు పని చేస్తున్నారు. వీరిలో 13 మంది ఆప్షన్ల ప్రక్రియలో తమకు ఇష్టమైన మండలాలను ఎంచుకున్నారు. ఒకరు మాత్రం ఆప్షన్ల ప్రక్రియకు హాజరు కాలేదు. ఎంఈఓల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో జరగాలని కొంత మంది, జిల్లాస్థాయిలో జరగాలని మరికొంత మంది వాదిస్తున్నారు.
ఎంఈఓలు, హెచ్‌ఎంల బదిలీలు గుంటూరు ఆర్‌జేడీ పరిధిలోకి వస్తాయి. గుంటూరు, ఒంగోలులో హెచ్‌ఎంలుగా, ఎంఈఓలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో పనిచేస్తున్న వారు ఎప్పటికైనా సొంత ప్రాంతాలకు వెళ్తామనే ఆశ ఉండేది. ప్రస్తుతం అస్పష్టమైన విధానంతో వారి ఆశలు అడుగంటాయి. 2005లో జరిగిన బదిలీల్లో గుంటూరుకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు నుంచి కూడా గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో పని చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ సీనియార్టీ జాబితా, జిల్లా పరిషత్ సీనియార్టీని జాబితాలో ఏర్పడ్డ సందిగ్ధత వల్ల ఏ ప్రాంత ఎంఈఓలు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తోంది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ ఎంఈఓలకు జిల్లా స్థాయిలో బదిలీలు నిర్వహించడం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. దీంతో పాఠశాలల పర్యవేక్షణ తీవ్రంగా కుంటుపడుతోంది.
జిల్లాలోని 46 మండలాలకు గానను 14 మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. వీరిలో ఒకరు సస్పెండ్ కావడంతో 13 మంది ఎంఈఓలు పని చేస్తున్నారు. మిగిలిన మండలాల్లో సీనియర్ హెచ్‌ఎంలు ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ, పథకాల అమలు, పాఠశాల నిర్వహణ తదితర పనులు వారికి తలకు మించిన భారంగా మారుతోంది. విద్యాబుద్ధులు చెప్పే శాఖలో నిర్దిష్టమైన నియమ నిబంధనలు లేకపోవడంతో జోనల్ స్థాయి, జిల్లా స్థాయి తేలని పక్షంలో బదిలీలు జరిగే ప్రసక్తే లేదని ఎంఈఓలు గుసగుసలాడుతున్నారు.
ఏళ్ల తరబడి పరాయి జిల్లాల్లో పనిచేస్తున్న తమను జిల్లా పరిధిలో బదిలీ చేస్తే ఒప్పుకునేది లేదని కొంత మంది ఎంఈఓలు కోర్టులను ఆశ్రయించారు. మంత్రి మౌఖిక ఆదేశాలతో అర్జెంట్ అర్జెంట్‌గా ఆప్షన్ల ప్రక్రియ జరిపారని, కోర్టులో ఉన్న అంశాన్ని పక్కన బెట్టి బదిలీలు జరగడం ఎంత వరకు సాధ్యమో వేచి చూడాల్సిందే.