
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు.
అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.