సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులుచేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్టు లక్ష్మీశ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్‌లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment