వలంటీర్ల సమ్మె అవాస్తవం | Volunteer Associations Clarity On Yellow Media Campaign | Sakshi
Sakshi News home page

వలంటీర్ల సమ్మె అవాస్తవం

Dec 27 2023 4:38 AM | Updated on Dec 27 2023 4:38 AM

Volunteer Associations Clarity On Yellow Media Campaign - Sakshi

మాట్లాడుతున్న చిత్తూరు జిల్లా డీఆర్‌ఓ రాజశేఖర్‌

సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్‌/పటమట (విజయవాడ తూర్పు)/వీరఘట్టం: నిన్న మొన్నటి­దాకా వలంటీర్లను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించిన విపక్ష పార్టీలు, వారి అనుకూల పచ్చ మీడియా ఇప్పుడు వలంటీర్లలో కొందరినైనా చీల్చి వారిలో ప్రభుత్వ విద్వేషాన్ని రగిల్చి సమ్మెబాట పట్టించాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. తామెలాంటి సమ్మెలో పాల్గొనడంలేదని వలంటీర్ల సంఘాలు తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా.. ఆయా వలంటీర్లు తమ వృత్తి సంబంధిత అంశాలపై తలెత్తే సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జిల్లాల వారీగా లేదా ఎక్కడికక్కడ అనధికారికంగా సోషల్‌ మీడియా గ్రూపులు ఏర్పాటుచేసుకున్నారు.

కొన్నింటిలో ఎవరికి వారే ఆ గ్రూపుల్లో చేరే అవకాశం ఉండడంతో.. వివిధ ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు కొందరు వలంటీర్ల ముసుగులో ఆ గ్రూపుల్లోకి దూరి వలంటీర్లను రెచ్చగొట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వంపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ వచ్చారని వలంటీర్లు చెప్పారు. ఆ తర్వాత వీరే ప్రభుత్వం జీతాలు అప్పుడు పెంచబోతోంది, ఇప్పుడు పెంచబోతోందని అంటూ గ్రూపుల్లో అనవసర చర్చ పెట్టి, అనంతరం సమ్మె అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ వచ్చేవారని వారు చెప్పారు.

కానీ, అసలైన వలంటీర్లు వాటిని ఎప్పటికప్పుడు ఖండించడమో లేదంటే వాటిని అసలు పట్టించుకోకపోవడం చేసేవారన్నారు. నిజా­నికి.. వలంటీర్లకుగానీ, వలంటీర్ల సంఘాల ప్రతినిధులకు గానీ సమ్మె చేయాలని ఎలాంటి ఆలోచన లేకపోయినా ప్రేరేపిత పోస్టులకు స్పందించే ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు సమ్మెకు దిగుతున్నారని మిగిలిన వలంటీర్లను రెచ్చగొట్టి వారితో సమ్మె ముసుగులో ఆందోళన చేపట్టేందుకు తెలుగుదేశం సహా మరికొన్ని రాజకీయ పక్షాలు యత్నిస్తున్నాయి. 

ఎక్కడా ఎవ్వరూ విధులు బహిష్కరించలేదు..
వలంటీర్ల సమ్మెను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు కొట్టిపారేశారు. రాష్ట్రంలో వలంటీర్లు ఎక్కడా విధులు బహిష్కరించినట్లుగానీ, ఆందోళనలు చేపట్టినట్లుగానీ ఎలాంటి సమాచారంలేదని వారు పేర్కొంటున్నారు. ఇక.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో వలంటీర్లు పూర్తిస్థాయిలో పాల్గొన్నా­రని వారు స్పష్టంచేశారు. మరోవైపు.. సమ్మె ప్రచా­రంపై చాలాచోట్ల వలంటీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తు­న్నారు. జిల్లాల్లోని వివిధ వలంటీర్ల సంఘాల నాయ­కులు కూడా సమ్మె ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారే­శారు.

తాము సమ్మె చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి సత్యదూరమని విజయవాడ మున్సి­పల్‌ కార్పొ­రేషన్‌ వార్డు వలంటీర్ల ప్రతినిధులు బి. మల్లికాదేవీ, బి. రాజకల్పన మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ­న్నారు. ఈనాడులో వచ్చిన వార్త అసత్యమని, తాము పూర్తి చిత్తశుద్ధితో ప్రభుత్వ పథ­కాలను లబ్ధి­దారులకు చేరవేసేందుకు పని­చేస్తున్నా­మని, ఇలాంటి వార్తలకు తాము ప్రభా­వి­తం కాలే­మని వారు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభు­త్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని వారు తేల్చిచెప్పారు.

మేమెలాంటి సమ్మెలో పాల్గొనడంలేదు..
వలంటీర్ల సమ్మె నోటీసులు అంటూ కొన్ని దినప­త్రికల్లో, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవా­స్తవం. చిత్తూరు జిల్లాలోని వలంటీర్లు అందరం ఎలాంటి ఆందోళనలను కానీ, సమ్మెలోగానీ పాల్గొనడంలేదు. చిత్తూ­రు జిల్లా వలంటీర్ల సంఘం తరఫున మేమందరం సీఎం ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తు­న్నాం. మేం ఎలాంటి సమ్మెలో పాల్గొనడంలేదు.     
– చిత్తూరు జిల్లా గ్రామ, వార్డు వలంటీర్ల సంఘం

ఈనాడు తప్పుడు రాతలపై వలంటీర్ల ఆగ్రహజ్వాల
సీఎం జగన్‌ ప్రభుత్వానికి, వలంటీర్లకు మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబుకు లబ్ధి చేకూ­ర్చాలన్న దురుద్దేశంతో ఈనాడులో ప్రచురించిన తప్పు­డు కథనంపై వలంటీర్లు మండిపడ్డారు. ఆడు­దాం–ఆంధ్రా కార్యక్రమానికి వచ్చిన వారు పార్వ­తీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని సీపీఎస్‌ రోడ్డులో మంగళవారం ఈనాడు ప్రతులతో ఆందోళన చేశారు. రామో­జీ­రావు డౌన్‌­డౌన్‌ అంటూ నినదిస్తూ ఈనాడు ప్రతులను దగ్థంచేశారు.

వలంటీర్లు మాట్లా­డుతూ.. గత టీడీపీ పాలనలో పింఛన్‌ తీసు­కోవా­లంటే వృద్ధులు, దివ్యాంగులు, మహి­ళలు నానా కష్టాలు పడేవారని.. సీఎం జగన్‌ ప్రవే­శపెట్టిన వలంటీర్‌ వ్యవస్థతో ఆ కష్టాలన్నీ దూరమై ప్రభుత్వ సేవ­లు, పథకాలు ప్రజ­లకు చేరువ­య్యాయన్నారు. వలంటీర్‌ వ్యవస్థకు ప్రజ­ల్లో మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈనాడు కుళ్లు­కుంటోందని.. ఈ వ్యవస్థను చూసి ఈనాడు, టీడీపీ, జనసేన భయపడుతు­న్నాయని, అందుకే మా మీద కుట్రలు చేస్తున్నాయని వలంటీర్లు అన్నారు.

ఎలాంటి ఆందోళనలు చేపట్టడంలేదు
తామెలాంటి ఆందోళనలు చేపట్టడంలేదని.. సమ్మెలోనూ  పాల్గొనడంలేదని చిత్తూరు జిల్లా వలంటీర్లు ఆ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్, డీఆర్‌ఓ రాజశేఖర్‌లకు లిఖితపూర్వకంగా తెలి­పారు. అనంతరం డీఆర్‌ఓ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లపై సామాజిక మాధ్య­మాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవ­మన్నారు. ఇక మంగళవారం జరిగిన ఆడు­దాం ఆంధ్ర కార్య­క్రమంలో, ఇతర కార్య­క్రమాల్లో వలంటీర్లు పాల్గొన్నారన్నారు. వలంటీర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వేణు మాట్లా­డుతూ.. వలంటీర్ల సమ్మెబాట వార్త అవాస్తవమ­న్నారు. తప్పు­డు ప్రచారాలను  ఖండిస్తున్నామన్నారు.
     – విధుల్లోనే ఉన్నామని కలెక్టర్‌కు చిత్తూరు జిల్లా వలంటీర్లు వెల్లడి

వలంటీర్‌ వ్యవస్థతో జరిగే మంచిని జీర్ణించుకోలేకే..
సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన వెంటనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ వ్యవస్థ వలన జరుగుతున్న మంచిని కొంతమంది రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేక తమ ఉనికికోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఇందులో భాగంగానే.. వలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారని, విధులు బహిష్కరిస్తున్నారని కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా గ్రూపుల్లో దుష్ప్రచారం చేపట్టాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఇలాంటి వార్తల్లో నిజంలేదు. రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్‌ తరఫున మేం దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. సమ్మెబాట పట్టిన వలంటీర్లు అని.. జగన్‌తో వలంటీర్లు యుద్ధం అని కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాం. 
– పీటా నాగమల్లేశ్వరరావు (వలంటీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు), 
– మద్దిలి కాళిదాసు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), – కొమ్ము సురేష్‌బాబు (జాయింట్‌ సెక్రటరీ), 
– పూజారి ఉదయ్‌కుమార్‌ (రాష్ట్ర ఉపాధ్యక్షుడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement