విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది...
వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు.
మోసపోయాం: వలంటీర్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా.
ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు.
సచివాలయ ఉద్యోగులు కూడా!
చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment