ntr bharosa
-
మెసేజ్ పెడితే సర్టిఫికెట్ పంపిస్తాం
బొమ్మనహాళ్ : రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తామన్నారు. పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా, లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామన్నారు. ఎవరైనా లంచం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి వితంతువు పెన్షన్ రూ.4 వేలు, బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి రూ.15 వేలు వికలాంగుల పెన్షన్ అందజేశారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు.రాష్ట్రంలో తాము ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్యం ధరలు కూడా తగ్గించామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించకూడదన్నారు. ఎక్కడా కూడా బెల్టు షాపులు పెట్టకూడదని, ఎవరైనా బెల్టు షాపులు తెరిస్తే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ‘మీ ఊర్లో ఇసుక మీరే తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చాను. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను ఉచితంగా తెచ్చుకోండి. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. అవసరమైతే నిలదీయండి. రెండో గేర్‌లో పోతా ఉంటే నాలుగో గేర్‌లోకి మార్చి స్పీడ్ పెంచండి’ అని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం డ్రోన్స్ నిఘా పెట్టామని, దానికి ‘డేగ’ అని పెరు పెట్టామని తెలిపారు. ‘నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. త్వరలో నైబర్‌హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. యువత అందరూ సెల్ఫోన్లో రూ.10 వేలు సంపాదించే మార్గం చూపిస్తాం. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం’ అని అన్నారు. -
ఏపీలో పెన్షన్.. టెన్షన్
అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ అనుకుంటున్న ఏపీ పెన్షనర్లను ఆ ‘టెన్షన్’ ఇప్పుడు ఒకరోజు ముందుగానే పలకరించబోతోంది. కూటమి ప్రభుత్వం వరుసగా 3వ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి ఒక రోజు ముందే పెన్షన్ రానుంది. దీంతో.. అకారణంగా లిస్టు నుంచి తమ పేరును తొలగిస్తారేమో అనే ఆందోళన పింఛన్‌దారుల్లో నెలకొంది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట రెండో నెల(ఆగష్టు 1వ తేదీన) జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.గడిచిన రెండు నెలల కాలంలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు.ఆగష్టు నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది (ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052)జులై కంటే ఆగష్టులో ఏకంగా 79, 455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం. జగన్ హయాంలో ఏ నెల ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని ఆరా తీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తోంది.వలంటీర్ల ఊసేది?ఏపీలో ఇంటింటికే పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పడేసింది. వలంటీర్లు లేకుండానే రెండు నెలలు పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే సన్నద్ధం చేసింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా.. ‘అసలు వలంటీర్లు అవసరం ఏముంది?’ అనే ధోరణితో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కన్నా.. ఏదో ఒక రకంగా రద్దు చేయాలని చూస్తోంది.మమ్మల్ని ముంచేశారుప్రతిపక్షంలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.ఇబ్బందులమయంగా పంపిణీ..చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని ఆదేశాలిప్పిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు సతమతమవుతుండగా.. ఫించన్‌దారుల నిలదీతతో ఇబ్బందికర పరిస్థితి టీడీపీ ఈవెంట్‌గా.. పెన్షన్ల పంపిణీని గత ప్రభుత్వం ఏనాడూ రాజకీయ కార్యక్రమంగా చూడలేదు. కానీ, చంద్రబాబు మాత్రం దాన్ని టీడీపీ ఈవెంట్‌గా మార్చేశారు. టీడీపీలో చోటా లీడర్ల దగ్గరి నుంచి మంత్రుల స్థాయిదాకా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. లబ్ధిదారులతో ఉత్తుత్తి పంపిణీ ఫొజులు ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్టర్లు వేయించుకుంటున్నారు. పెన్షన్ వచ్చేనా?ఏపీలో దివ్యాంగుల్లో 8 లక్షల మంది పెన్షన్ పొందుతుండగా.. వారిలో 60 వేల మందికి మళ్లీ వైకల్య పరీక్షలు జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందువల్ల వాళ్లకు పెన్షన్ వస్తుందా అనేది అనుమానమే. వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇస్తున్న పెన్షనర్ల విషయంలోనూ రివిజన్ నిర్వహించాలని బాబు సర్కార్ యోచిస్తోంది. తద్వారా రకరకాల నిబంధనల పేరుతో మరికొందరిని జాబితా నుంచి తొగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుంది. ఈసారి ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేస్తునప్పటికీ.. పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే ఎలా? అనే ఆందోళన లబ్దిదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ రాకపోతే.. సచివాలయాల చుట్టూ తిరగండి. అసలు మీ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోండి.. లేకపోతే ఇక అంతే.. అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షనర్లు వాపోతున్నారు. -
ఏపీలో పెన్షనర్లకు కూటమి సర్కార్ షాక్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట ఇవాళ రెండో నెల జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది. కూటమి పాలనలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో 67,812 పెన్షనర్లు తగ్గిపోయారు. అలాగే గత నెల కంటే ఈనెల(ఈరోజు జరిగిన పంపిణీ) భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది. ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052గా ఉంది. జులై కంటే ఆగష్టులో 79, 455 పెన్షన్లు తగ్గించి ప్రభుత్వం. జగన్ హయాంలో ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని నిలదీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు
విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది... వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. మోసపోయాం: వలంటీర్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా. ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా!చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు. -
పండుటాకులపై టీడీపీ కక్ష !
ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు పి.నరసింహులు. టీఓపల్లె గ్రామానికి చెందిన ఇతను 2014 టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి డప్పు కళాకారుడిగా పింఛన్ పొందుతున్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకు ప్రమాదం జరిగింది. పింఛన్ డబ్బులు మీదే ఆధారపడి భార్యను పోషించుకుంటున్నాడు. ‘గత నెల వరకూ పింఛన్ వచ్చింది.. ఈ నెలలో ఇవ్వలేదు. ఇదేమనడిగితే ఉన్నతాధికారులు ఆపమన్నారని చెబుతున్నా’రని వాపోయాడు.ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు ఆలూరు సీతారాములు. టీఓపల్లె పంచాయతీ రేపల్లెకు చెందిన ఇతనికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్న రూ.200ల వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. గత నెల వరకూ వికలాంగత్వ పింఛను పొందాడు. ఈ నెలలో పింఛన్ కోసం వెళ్లగా తనకు ఇవ్వడం లేదని వాపోయాడు. తన వికలాంగ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ఇస్తామని అధికారులు చెబుతున్నారని. కావాలనే గ్రామంలోని టీడీపీ నాయకులు తన పింఛను ఆపిస్తున్నారని, తన చేతిని చూసి కూడా పింఛన్ ఆపటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.చాపాడు : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ‘మీ భద్రతే .. మా బాధ్యత’ అంటూ ఊదరగొట్టింది. అవన్నీ మాటలకే అంటూ మరోసారి రుజువు చేసింది. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇవ్వకుండా నిరుపేద పండుటాకులకు, దివ్యాంగులకు మోసం చేసింది. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామ పంచాయతీలో 94 మంది పింఛన్ దారులకు డబ్బులు పంపిణీ చేయకుండా వారి కన్నీళ్లకు కారణమైంది. స్వయానా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మూడు పంచాయతీలకు చెందిన 94 మంది పింఛన్‌దారులకు అర్హతలను పునర్విచారణ చేసిన తర్వాతనే డబ్బులు పంపిణీ చేయాలని కలెక్టర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జరిగిన పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన 94 మందికి పింఛన్ డబ్బులను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసిన సదరు లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. పదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఈ సారి తమకెందుకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని, తామేమి పాపం చేశామని బాధితులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులన్న కారణంగా పింఛన్లు ఆపారని ఆయా గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.ఎంపీడీఓ ఏమన్నారంటే..మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో 94మందికి పింఛన్లను ఆపడంపై ఎంపీడీఓ రహంతుల్లయ్యను వివరణ కోరగా.. ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, డీఆర్డీఏ పీడీ నుంచి 94 మంది పింఛన్లను వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పింఛన్ల పంపిణీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.పింఛన్ డబ్బులు అందని బాధితులు..మండలంలోని మడూరు పంచాయతీలో వృద్ధాప్య పింఛను పొందుతున్న ఎం.శివారెడ్డి, మబ్బులు, కె.మహమ్మద్ షరీఫ్, మాలబాల సుబ్బారెడ్డి, కట్టుబడి సాసేన్ వలి, మాబు షరీఫ్, సాకం చిన్న సుబ్బారెడ్డి, పర్లపాటి షేక్ రసూల్, బాషా, రామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, కల్లెగాల్ల చెన్నమ్మ, చంటి సుబ్బయ్య, ఆవుల గుర్రప్ప, కాలేబు, సానెపల్లె బయపురెడ్డి, లక్షుమ్మ, ఆళ్లగడ్డ దానం, బొగ్గుల రాజమ్మ, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, శేషారెడ్డి, పెద్ద లక్ష్మీరెడ్డి, వికలాంగులైన లక్ష్మీప్రియ, సాకం నాగసూయమ్మ, సుభానీ, మహబూబ్ బాషా, రంగాగాళ్ల లలితమ్మ, సుబ్బమ్మ, డప్పు పింఛన్‌దారులు సుబ్బరాయుడు, కల్లగాల్ల సుబ్బరాయుడు, చిన్నటిగాళ్ల సుబ్బరాయుడు, చెప్పులు కుట్టేవారు అంకన్న, పెద్ద ఓబయ్య, బాల ఓబయ్య, అభయహస్తం, వితంతువు మునెమ్మ ఉన్నారు. అలాగే అన్నవరంలో.. వృద్దాప్య పింఛన్ దారులు పల్లవోలు ప్రసాద్‌రెడ్డి, ఆలూరు పీరయ్య, బాషా, వీరనారాయణ, గంగిరెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, కుల్లాయిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, పెద్ద కొండారెడ్డి, కాసా వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి, సంజీవరెడ్డి, జాకోబ్, చిన్న సుబ్బరాయుడు, వికలాంగులైన ఆదినారాయణరెడ్డి, చింతకుంట పైద్దీన్, ఇందిరమ్మ, కానాల మేరి, గంగయ్య, రామిరెడ్డి, రామ ఓబులరెడ్డి, అశ్వని, రామసుబ్బమ్మ, బంక మమత, చేనేత నారాయణ పింఛన్ ఆపేసిన వారిలో ఉన్నారు. టీఓపల్లెలో.. వృద్దాప్య పింఛన్ పొందుతున్న చెన్నూరు సుబ్బమ్మ, వీరమ్మ, సుబ్బారెడ్డి, ఏ.వెంకటసుబ్బారెడ్డి, కుంచెం సుబ్బ మ్మ, పిచ్చయ్య, మద్దిలేటి, రామయ్య, వెంకటసుబ్బ య్య, శివారెడ్డి, గంగమ్మ, కొండారెడ్డి, వికలాంగులైన సాంబశివారెడ్డి, శ్రీదేవి, తిరుపాలమ్మ, గురుస్వామి, రంగరాజు, సాంబశివారెడ్డి, డప్పు కళాకారులు వెంకటసుబ్బయ్య, చిన్నమ్మ, నరసింహులు, రాముడు, చేనేతలైన సుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడులకు పింఛన్ డబ్బులను ఆపారు.76 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య పింఛన్ ఆపడం న్యాయమాపదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాను. గతంలో టీడీపీ, గత ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా పింఛన్ సజావుగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావటం మొదటి నెలే నాకు పింఛను ఇవ్వకుండా ఆపటం ఎంత వరకు న్యాయం. 76 ఏళ్లు ఉన్న నా పత్రాలను పరిశీలించిన తర్వాతనే ఇస్తామని చెప్పటం బాధాకరం.– ముదిరెడ్డి శివారెడ్డి, వృద్ధుడు, మడూరు గ్రామం -
AP Pension: రూ.500 ఇస్తేనే పెన్షన్ ఇస్తా!
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి. (గమనిక: పైన ఫొటోలో పెన్షన్ పంపిణీ చేస్తున్న షేక్ కరిష్మా విజయనగరంలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రంగానే ఆ ఫొటోను వాడటం జరిగింది. కింది ప్రచురితమైన పల్నాడు వార్తకు.. ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం)పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్‌దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్‌ను సస్పెండ్ చేశారు. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంరాజకీయ జోక్యాలుఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంసంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!పింఛన్ నగదు చోరీ?వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు. -
టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!
తాడేపల్లి, సాక్షి: వలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు.‘‘వలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.ఇదీ చదవండి: పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరుచంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి. -
పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వ పెన్షన్ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీ మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్లోని పెనుమాకలో సోమవారం(జులై 1) వేకువజామునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బానావత్ పాములునాయక్ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్ అందజేశారు. ఆపై లబ్ధిదారులు ఇస్లావత్ సాయి, బానవత్ సీతలకు స్వయంగా పెన్షన్ అందజేసి, వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.అనంతరం ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యా. లోకేష్ మంగళగిరి ప్రజల అభిమానం చురగొన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారు. మంగళగిరిలోనే పెన్షన్ల పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉంది అని అన్నారు. గత ప్రభుత్వంలో ఒకటవ తేదీ ఉదయమే వెళ్లి వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో దానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఇవాళ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందాల్సి ఉంది. -
అడవితల్లికి పుత్ర శోకం
కొండలతో కలిసి.. కోనలతో మురిసి.. అడవి పూల వాసనతో పరిమళించి.. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి.. అటవీ దేవతో ఒడిలో కునుకు తీసే గిరిజన బతుకులు నేటికీ ఏమాత్రం మారలేదు. నీటి కోసం.. కూటి కోసం.. వైద్యం కోసం.. రోడ్డు కోసం.. వెలుగు కోసం ఆశగా ఎదురు చూస్తేనే ఉన్నారు. విష జ్వరాలతో.. అంతుచిక్కని వ్యాధులతో మంచం పడుతూనే ఉన్నారు. ఈ శాపం నుంచి వారికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో సమయమే తేల్చాలి. రాచర్ల(ప్రకాశం): మండల పరిధిలోని జేపీ చేరువు శివారుల్లో ఉన్న గిరిజనకాలనీ మౌలిక వసతులకు దూరంగా.. గిరజనుల అవస్థలకు దగ్గరగా మారింది. గిరిజనులకు అభివృద్ధి, కనీస సౌకర్యాల కోసం ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో సమర్పించిన అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. జేపీ చెరువు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో అంబచెరువు వద్ద లోతు వాగు పక్కనే రెండు నెలల క్రితం ఫారెస్టు లాగింగ్ డీఎఫ్ఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి 25 గిరిజనుల కుటుంబాలకు నివాసాలు ఏర్పాటు చేసుకోనేందుకు పాక్షికంగా స్థలాలను కేటాయించారు. దీంతో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లోని నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఈ నీటిని తాగడం వలన పెద్దలకు విషజర్వాలు, చిన్నారులకు చర్మవ్యాధులు సోకుతున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే క్రూర మృగాలు, విషాసర్పలు తమ నివాసాల్లోకి వస్తున్నాయని భయాందోళనకు గురువుతున్నారు. నిలిచిన నీటి సరఫరా గడిచిన రెండు నెలలు 25 కుటుంబాల కలిగిన గిరిజనకాలనీకి రోజుకు ఒక ట్యాంకర్ చొప్పున తాగునీటిని సరఫరా చేసే వారు. అయితే సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు ఇప్పటి వరకు గిరిజనకాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా 10 రోజులుగా తాగునీటిని సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో గిరిజనులు వ్యవసాయ పొలాల్లో, కొండ ప్రాంతాల్లోని నీటి కుంటల్లో నిలిచిన వర్షపునీరు తాగుతున్నారు. దీనివల్ల దాదాపు 10 మందికి పైగా విషజ్వరాలు సోకి మంచాన పడ్డారు. గర్భిణులకు అందని వైద్యం.. లోతు వాగు పక్కనే నివాసం ఉంటున్న గిరిజనులకు వైద్యం అందడంలేదు. ముఖ్యంగా గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వైద్యాధికారులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గర్భిణి అయిన చెంచు రమణమ్మకు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడంతో మూడు రోజులుగా నొప్పులతో పూరి గుడిసెలోనే విలవిల్లాడుతోంది. కనీసం 108 వాహనం కూడా అటువైపు వెళ్లడంలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మాకు ఇంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కల్పించలేదు. ఎన్టీఆర్ భరోసా అందడంలేదు. వీధిలైట్లు, కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నాం. తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లో నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నాం. ఈ నీటిని తాగడం వ్యాధులు వస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే ఎలుగుబంట్లు, పాములు తమ నివాసాల్లోకి వస్తున్నాయి. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.– పాముల చెంచులక్ష్మి (గిరిజన మహిళ, జేపీ చెరువు) సమస్యలను పట్టించుకొనేవారే లేరు నేను పుట్టకతోనే వికలాంగురాలిని. రేషన్‌కార్డు, అధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉన్నాయి. వికాలాంగుల పింఛన్ కోసం జన్మభూమి–మాఊరు గ్రామసభల్లో ఎన్నో సార్లు అర్జీలను పెట్టుకున్నా. ఇంతవరకు విలాంగ పింఛన్ మంజూరు చేయలేదు. అంతేకాక యాటగిరి అల్లూరయ్య, యాటగిరి పోలయ్య, సవరం శ్రీను, యాటగిరి లక్ష్మీరంగయ్య, పాముల చెంచులక్ష్మి రేషన్‌కార్డు కోసం అర్జీలు పెట్టుకున్నా రేషన్‌కార్డులు కల్పించలేదు. మేము ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారు. -
ముందుకు సాగని విత్తనాల పంపిణీ
–మొరాయిస్తున్న సర్వర్ కర్నూలు(అగ్రికల్చర్): సర్వర్‌పై ఒత్తడి పెరగడంతో విత్తనాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఎన్టీఆర్ భరోస పింఛన్ల పంపిణీ, నేషనల్ ఇన్ఫర్మ్యాటిక్ సెంటర్(ఎన్ఐసీ).. సబ్సిడీపై విత్తనాల పంపిణీ.. వీటన్నింటికీ సర్వర్ ఒక్కటే. దీంతో నాలుగైదు రోజులుగా సర్వర్ మొండికేస్తోంది. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించారు. అయితే మండలాలకు 50,600 క్వింటాళ్లు కేటాయించి 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో పెట్టారు. డిమాండ్ ఉన్న మండలాలకు అదనంగా ఇవ్వాలనేది బఫర్ ఉద్దేశం. ఇప్పటి వరకు వేరుశనగ 26,919 క్వింటాళ్లు పొజిషన్ చేశారు. సోమవారం సాయంత్రం నాటికి 17,820 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. కందులు 628 క్వింటాళ్లు, దయంచ 1,288 క్వింటాళ్లు, పిల్లి పెసర 33 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. -
84.13 శాతం మందికి ‘ఎన్టీఆర్ భరోసా’
– రాష్ట్రంలోనే రెండో స్థానంలో ‘అనంత’ – మూడు మండలాల్లో నత్తనడకన పంపిణీ – 7వ తేదీ వరకు పంపిణీ గడువు పొడిగింపు అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరో రెండ్రోజులు పొడిగించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాకు 4,02,587 పింఛన్లు విడుదలవగా బుధవారం సాయంత్రానికి 3,38,682 మందికి పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో పింఛన్ పంపిణీ అధికారులు (పీడీఓ) ఉదయం మాత్రమే పంపిణీ చేస్తుండడం.. కొన్ని మండలాల్లో నగదు కొరత.. సెలవులు (ఆదివారం, శ్రీరామనవమి) వచ్చిన నేపథ్యంలో గడువును పెంచినట్లు తెలిసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా 84.13 శాతం పంపిణీతో రెండో స్థానంలో నిలిచింది. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో నత్తనడకన పంపిణీ సాగుతోంది. రామగిరి మండలానికి 4006 పింఛన్లు విడుదలవగా 2307 (57.59 శాతం) మాత్రమే అందజేశారు. బుక్కపట్నం మండలంలో 5248కి గాను 2669 (50.86 శాతం), యాడికిలో 5607 మందికి గాను 2047 (36.51 శాతం) పంపిణీ చేశారు. ఈ మూడు మండలాల్లో నగదు సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీనే పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా ఇక్కడ మూడో తేదీ ప్రారంభించారు. వజ్రకరూరు మండలానికి సంబంధించి 5507 మందికి విడుదలవగా 3040 (55.20) మందికే అందజేశారు. ఇక్కడ నగదు సమస్య లేకున్నా సాంకేతిక ఇబ్బందులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల ఏడో తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తామని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ నగదు అందజేస్తామన్నారు. -
నాలుగు రూకల కోసం నడకయాతన
అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్‌దారులు 194 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో పాటు పింఛన్ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్లైన్లో నమోదు‡ చేసే అవకాశముంది. ఈ విషయంలో∙చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు. 22,936 మందికి అందని పింఛన్ ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,00 0. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. -
పింఛన్ రావడం లేదని వృద్ధురాలి మృతి
రాజమండ్రి: నిలిచిపోయిన పింఛనును పునరుద్ధరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ వృద్ధురాలు కన్నుమూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన ముత్యాల సూర్యకాంతం(80) రూ.200 పింఛన్ అందుకునేది. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 'ఎన్టీఆర్ భరోసా'తో అక్టోబరు నుంచి రూ. వెయ్యి వస్తుందని ఆమె ఆశపడింది. ఆమె ఆధార్, రేషన్‌కార్డుల్లో వయస్సు సరిపోయినా వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్‌ను నిలిపివేశారు. దీంతో బెంగపెట్టుకుని మంచానపడి బుధవారం అర్ధరాత్రి కన్నుమూసింది. -
‘భరోసా’..అడియాస
గాంధీ జయంతి నాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’.. వేల మందిపింఛన్దారుల ఆశను అడియాస చేసింది. ఇన్నాళ్లూ వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అందిన చిరుసాయం ఐదు రెట్లు కానుందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఇకకొత్తగా పింఛన్ల ఆసరా లభిస్తుందని వేయి కళ్లతో ఎదురు చూసిన అభాగ్యులకూ,అసహాయులకూ సర్కారు మొండిచెయ్యే చూపింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ :సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’గా కొత్త పేరు పెట్టి పింఛన్ సొమ్ము అయిదురెట్లు పెంచుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి అర్హులకే ఎసరు పెట్టింది. కొత్తగా ఆసరా కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి ఆశాభంగం కలిగించింది. జిల్లాలో సవాలక్ష సాకులు చూపించి ఈ నెలలో 90 వేల పైచిలుకు పింఛన్‌దారులకు అన్యాయం చేశారు. వారందరినీ అనర్హులనే సాకుతో లబ్ధిదారులుగా తొలగించిన సర్కారు ఇప్పుడు కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను కూడా చెరిసగానికి కోతపెట్టి వారికి భరోసా లేకుండా చేసింది. పింఛన్ల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామంటూ ఏర్పాటు చేసిన గ్రామకమిటీలు చేసిన సిఫార్సులనే గాలికొదిలేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. అదేమని అర్హులడుగుతుంటే మండల స్థాయి కమిటీలకు ఫిర్యాదు చేసుకుంటే విచారించి చర్యలు తీసుకుంటారని అధికారులు తాపీగా చెబుతున్నారు.పింఛన్ల ఎంపికలో సర్వాధికారాలూ గ్రామ కమిటీలకే ఇచ్చామని గొప్పలకు పోయిన ప్రభుత్వం కమిటీల్లో సామాజిక కార్యకర్తల ముసుగులో అధికార పార్టీ వారికే పెద్దపీట వేసిందనే విమర్శలు లేకపోలేదు. కమిటీల్లో వేసుకున్నా స్థానికంగా అర్హులైన వారికి అన్యాయం చేయడానికి వారు సాహసించరని అనుకున్నారు. గ్రామాల్లో కమిటీలు అర్హత ఉందని నిర్ధారిస్తే చాలు పింఛన్ ఖాయమని ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకొచ్చారు. చివరకు కమిటీలు అర్హులని తేల్చిన జాబితాల్లో కూడా అడ్డగోలుగా కోతలుపెట్టి ఆసరా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుండె కోతను మిగిల్చింది. కమిటీల్లో వేసి బలిపశువుల్ని చేస్తారా.. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో సర్పంచ్ చైర్మన్‌గా, ఎంపీటీసీ మెంబర్‌గా, ఆయా వర్గాల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు (టీడీపీ నేతలు), మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, కార్పొరేషన్ అయితే కార్పొరేటర్...ఇలా స్థానిక ప్రతినిధులతో కలిపి కమిటీలు ఏర్పాటుచేశారు. ఆ కమిటీలు చెప్పిందే తుది నిర్ణయం అని అంతా అనుకున్నారు. అందుకే కమిటీల్లో చోటు కోసం అధికారపార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ కూడా కనిపించింది. అప్పుడేమో కమిటీలదే తుది నిర్ణయమని, ఇప్పుడేమో సవాలక్ష సాకులు చూపించి కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని, కమిటీల్లో వేసింది తమను బలిపశువులను చేయడం కోసమేనా అని కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. గ్రామ కమిటీలు పింఛన్లకు అర్హతను నిర్ధారించి మండల కమిటీల ద్వారా జిల్లా యంత్రాంగానికి పంపించిన జాబితాలను కాగితాలకే పరిమితం చేసి, ఆశగా కోసం నిరీక్షిస్తున్న వారికి నిరాశనే మిగిల్చారు. ఎన్ని సాకులు చూపినా ఎగవేతకే.. ఎన్టీఆర్ భరోసా పథకం పురుడుపోసుకోక మునుపు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 4,65,617 ఉన్నాయి. వాటిలో 90,981 పింఛన్లను ఎన్టీఆర్ భరోసా అమలులోకి వ చ్చాక ఈ నెల నుంచి నిలిపివేశారు. వారిలో 40,509 మందిని శాశ్వతంగా అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలను చూపించారు. అర్హులుగా గుర్తించిన జాబితాను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) ఆధారంగా ఆన్లైన్లో అనుసంధానించే సమయంలో ఆధార్, రేషన్‌కార్డులలో వయసుల్లో వ్యత్యాసం ఉందని, స్త్రీకి బదులు పురుషుడనో, పురుషునికి బదులు స్త్రీ అని ఉందనో, పరిమితికి మించి పొలం ఉందనో.. ఇలా పలు కారణాలతో 38,957 మంది పింఛన్‌దారులకు నోటి దగ్గర కూడు లేకుండా చేశారు. ఈ కోత చాలదా అన్నట్టు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారుల జాబితాను అడ్డంగా కోసేశారు. జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య, చేనేత, వితంతు, వికలాంగ, కల్లుగీత కార్మిక పింఛన్ల కోసం కొత్తగా 54,927 మంది దరఖాస్తు చేసుకుంటే సగానికి పైగా అంటే 28,195 మందిని జాబితాల నుంచి తొలగించారు. ఈ జాబితాలు ఆయా గ్రామ కమిటీల సిఫార్సులతో మండల కమిటీల నుంచి జిల్లా యంత్రాంగానికి వచ్చినవే. అటువంటి జాబితాల్లో కూడా కోతవేయడంలో ఔచిత్యమేమిటని పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వారికి ఏమని సమాధానం చెబుతుందో!