
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి.

(గమనిక: పైన ఫొటోలో పెన్షన్ పంపిణీ చేస్తున్న షేక్ కరిష్మా విజయనగరంలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రంగానే ఆ ఫొటోను వాడటం జరిగింది. కింది ప్రచురితమైన పల్నాడు వార్తకు.. ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం)
పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్‌దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్‌ను సస్పెండ్ చేశారు.

ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రం
ఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రం
రాజకీయ జోక్యాలు
ఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రం
సంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!
పింఛన్ నగదు చోరీ?
వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment