అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వ పెన్షన్ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీ మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు.
మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పెనుమాకలో సోమవారం(జులై 1) వేకువజామునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బానావత్ పాములునాయక్ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్ అందజేశారు. ఆపై లబ్ధిదారులు ఇస్లావత్ సాయి, బానవత్ సీతలకు స్వయంగా పెన్షన్ అందజేసి, వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.
అనంతరం ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యా. లోకేష్ మంగళగిరి ప్రజల అభిమానం చురగొన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారు. మంగళగిరిలోనే పెన్షన్ల పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉంది అని అన్నారు.
గత ప్రభుత్వంలో ఒకటవ తేదీ ఉదయమే వెళ్లి వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో దానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఇవాళ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment