‘భరోసా’..అడియాస | NTR Bharosa Pension consumers injustice | Sakshi
Sakshi News home page

‘భరోసా’..అడియాస

Published Fri, Oct 17 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

‘భరోసా’..అడియాస

‘భరోసా’..అడియాస

 గాంధీ జయంతి నాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’.. వేల మందిపింఛన్‌దారుల ఆశను అడియాస చేసింది. ఇన్నాళ్లూ వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అందిన చిరుసాయం ఐదు రెట్లు కానుందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఇకకొత్తగా పింఛన్ల ఆసరా లభిస్తుందని వేయి కళ్లతో ఎదురు చూసిన అభాగ్యులకూ,అసహాయులకూ సర్కారు మొండిచెయ్యే చూపింది.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’గా కొత్త పేరు పెట్టి పింఛన్ సొమ్ము అయిదురెట్లు పెంచుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి అర్హులకే ఎసరు పెట్టింది. కొత్తగా ఆసరా కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి ఆశాభంగం కలిగించింది. జిల్లాలో సవాలక్ష సాకులు చూపించి ఈ నెలలో 90 వేల పైచిలుకు పింఛన్‌దారులకు అన్యాయం చేశారు. వారందరినీ అనర్హులనే సాకుతో లబ్ధిదారులుగా తొలగించిన సర్కారు ఇప్పుడు కొత్తగా పింఛన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను కూడా చెరిసగానికి కోతపెట్టి వారికి భరోసా లేకుండా చేసింది. పింఛన్ల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామంటూ ఏర్పాటు చేసిన గ్రామకమిటీలు చేసిన సిఫార్సులనే గాలికొదిలేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది.
 
 అదేమని అర్హులడుగుతుంటే మండల స్థాయి కమిటీలకు ఫిర్యాదు చేసుకుంటే విచారించి చర్యలు తీసుకుంటారని అధికారులు తాపీగా చెబుతున్నారు.పింఛన్‌ల ఎంపికలో సర్వాధికారాలూ గ్రామ కమిటీలకే ఇచ్చామని గొప్పలకు పోయిన ప్రభుత్వం కమిటీల్లో సామాజిక కార్యకర్తల ముసుగులో అధికార పార్టీ వారికే పెద్దపీట వేసిందనే విమర్శలు లేకపోలేదు. కమిటీల్లో వేసుకున్నా స్థానికంగా అర్హులైన వారికి అన్యాయం చేయడానికి వారు సాహసించరని అనుకున్నారు. గ్రామాల్లో కమిటీలు అర్హత ఉందని నిర్ధారిస్తే చాలు పింఛన్ ఖాయమని ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకొచ్చారు. చివరకు కమిటీలు అర్హులని తేల్చిన జాబితాల్లో కూడా అడ్డగోలుగా కోతలుపెట్టి ఆసరా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుండె కోతను మిగిల్చింది.
 
 కమిటీల్లో వేసి బలిపశువుల్ని చేస్తారా..
 జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో సర్పంచ్ చైర్మన్‌గా, ఎంపీటీసీ మెంబర్‌గా, ఆయా వర్గాల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు (టీడీపీ నేతలు), మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, కార్పొరేషన్ అయితే కార్పొరేటర్...ఇలా స్థానిక ప్రతినిధులతో కలిపి కమిటీలు ఏర్పాటుచేశారు. ఆ కమిటీలు చెప్పిందే తుది నిర్ణయం అని అంతా అనుకున్నారు. అందుకే కమిటీల్లో చోటు కోసం అధికారపార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ కూడా కనిపించింది. అప్పుడేమో కమిటీలదే తుది నిర్ణయమని,  ఇప్పుడేమో సవాలక్ష సాకులు చూపించి కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని, కమిటీల్లో వేసింది తమను బలిపశువులను చేయడం కోసమేనా అని కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. గ్రామ కమిటీలు పింఛన్లకు అర్హతను నిర్ధారించి మండల కమిటీల ద్వారా జిల్లా యంత్రాంగానికి పంపించిన జాబితాలను కాగితాలకే పరిమితం చేసి, ఆశగా కోసం నిరీక్షిస్తున్న వారికి నిరాశనే మిగిల్చారు.
 
 ఎన్ని సాకులు చూపినా ఎగవేతకే..
 ఎన్టీఆర్ భరోసా పథకం పురుడుపోసుకోక మునుపు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 4,65,617 ఉన్నాయి. వాటిలో 90,981 పింఛన్లను ఎన్టీఆర్ భరోసా అమలులోకి వ చ్చాక ఈ నెల నుంచి నిలిపివేశారు. వారిలో 40,509 మందిని శాశ్వతంగా అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలను చూపించారు. అర్హులుగా గుర్తించిన జాబితాను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్‌డీహెచ్) ఆధారంగా ఆన్‌లైన్‌లో అనుసంధానించే సమయంలో ఆధార్, రేషన్‌కార్డులలో వయసుల్లో వ్యత్యాసం ఉందని, స్త్రీకి బదులు పురుషుడనో, పురుషునికి బదులు స్త్రీ అని ఉందనో, పరిమితికి మించి పొలం ఉందనో.. ఇలా పలు కారణాలతో  38,957 మంది పింఛన్‌దారులకు నోటి దగ్గర కూడు లేకుండా చేశారు.  
 
 ఈ కోత చాలదా అన్నట్టు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారుల జాబితాను అడ్డంగా కోసేశారు. జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య, చేనేత, వితంతు, వికలాంగ, కల్లుగీత కార్మిక పింఛన్‌ల కోసం కొత్తగా 54,927 మంది దరఖాస్తు చేసుకుంటే సగానికి పైగా అంటే 28,195 మందిని జాబితాల నుంచి తొలగించారు. ఈ జాబితాలు ఆయా గ్రామ కమిటీల సిఫార్సులతో మండల కమిటీల నుంచి జిల్లా యంత్రాంగానికి వచ్చినవే. అటువంటి జాబితాల్లో కూడా కోతవేయడంలో ఔచిత్యమేమిటని పింఛన్‌ల కోసం పడిగాపులు పడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వారికి ఏమని సమాధానం చెబుతుందో!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement