అనంతపురం జిల్లా నేమకల్లులో సీఎం చంద్రబాబు
కావాల్సినంత ఇసుక ఉచితంగా తెచ్చుకోండి
ఎవరైనా అడ్డుకుంటే నా పేరు చెప్పండి
నా తమ్ముళ్లకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా
సెల్‌ఫోన్ ద్వారా రూ.10 వేలు సంపాదించే మార్గం చూపిస్తాం
ప్రభుత్వ దూరదృష్టి వల్లే విదేశాలకు అరటి పండ్ల ఎగుమతి
బొమ్మనహాళ్ : రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్‌లైన్ ద్వారా అందిస్తామన్నారు. పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా, లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామన్నారు. ఎవరైనా లంచం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
తొలుత గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి వితంతువు పెన్షన్ రూ.4 వేలు, బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి రూ.15 వేలు వికలాంగుల పెన్షన్ అందజేశారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు.
రాష్ట్రంలో తాము ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్యం ధరలు కూడా తగ్గించామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించకూడదన్నారు. ఎక్కడా కూడా బెల్టు షాపులు పెట్టకూడదని, ఎవరైనా బెల్టు షాపులు తెరిస్తే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని హెచ్చరించారు.
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
‘మీ ఊర్లో ఇసుక మీరే తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చాను. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను ఉచితంగా తెచ్చుకోండి. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. అవసరమైతే నిలదీయండి. రెండో గేర్‌లో పోతా ఉంటే నాలుగో గేర్లోకి మార్చి స్పీడ్ పెంచండి’ అని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రస్తుతం డ్రోన్స్ నిఘా పెట్టామని, దానికి ‘డేగ’ అని పెరు పెట్టామని తెలిపారు. ‘నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. త్వరలో నైబర్‌హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. యువత అందరూ సెల్‌ఫోన్‌లో రూ.10 వేలు సంపాదించే మార్గం చూపిస్తాం. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment