– రాష్ట్రంలోనే రెండో స్థానంలో ‘అనంత’
– మూడు మండలాల్లో నత్తనడకన పంపిణీ
– 7వ తేదీ వరకు పంపిణీ గడువు పొడిగింపు
అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరో రెండ్రోజులు పొడిగించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాకు 4,02,587 పింఛన్లు విడుదలవగా బుధవారం సాయంత్రానికి 3,38,682 మందికి పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో పింఛన్ పంపిణీ అధికారులు (పీడీఓ) ఉదయం మాత్రమే పంపిణీ చేస్తుండడం.. కొన్ని మండలాల్లో నగదు కొరత.. సెలవులు (ఆదివారం, శ్రీరామనవమి) వచ్చిన నేపథ్యంలో గడువును పెంచినట్లు తెలిసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా 84.13 శాతం పంపిణీతో రెండో స్థానంలో నిలిచింది. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో నత్తనడకన పంపిణీ సాగుతోంది.
రామగిరి మండలానికి 4006 పింఛన్లు విడుదలవగా 2307 (57.59 శాతం) మాత్రమే అందజేశారు. బుక్కపట్నం మండలంలో 5248కి గాను 2669 (50.86 శాతం), యాడికిలో 5607 మందికి గాను 2047 (36.51 శాతం) పంపిణీ చేశారు. ఈ మూడు మండలాల్లో నగదు సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీనే పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా ఇక్కడ మూడో తేదీ ప్రారంభించారు. వజ్రకరూరు మండలానికి సంబంధించి 5507 మందికి విడుదలవగా 3040 (55.20) మందికే అందజేశారు. ఇక్కడ నగదు సమస్య లేకున్నా సాంకేతిక ఇబ్బందులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల ఏడో తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ నగదు అందజేస్తామన్నారు.
84.13 శాతం మందికి ‘ఎన్టీఆర్ భరోసా’
Published Wed, Apr 5 2017 10:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement