అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ అనుకుంటున్న ఏపీ పెన్షనర్లను ఆ ‘టెన్షన్’ ఇప్పుడు ఒకరోజు ముందుగానే పలకరించబోతోంది. కూటమి ప్రభుత్వం వరుసగా 3వ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి ఒక రోజు ముందే పెన్షన్ రానుంది. దీంతో.. అకారణంగా లిస్టు నుంచి తమ పేరును తొలగిస్తారేమో అనే ఆందోళన పింఛన్‌దారుల్లో నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట రెండో నెల(ఆగష్టు 1వ తేదీన) జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.
గడిచిన రెండు నెలల కాలంలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.
జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు.
ఆగష్టు నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది (ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052)
జులై కంటే ఆగష్టులో ఏకంగా 79, 455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం.
జగన్ హయాంలో ఏ నెల ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని ఆరా తీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తోంది.
వలంటీర్ల ఊసేది?
ఏపీలో ఇంటింటికే పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పడేసింది. వలంటీర్లు లేకుండానే రెండు నెలలు పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే సన్నద్ధం చేసింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా.. ‘అసలు వలంటీర్లు అవసరం ఏముంది?’ అనే ధోరణితో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కన్నా.. ఏదో ఒక రకంగా రద్దు చేయాలని చూస్తోంది.
మమ్మల్ని ముంచేశారు
ప్రతిపక్షంలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.
ఇబ్బందులమయంగా పంపిణీ..
చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని ఆదేశాలిప్పిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు సతమతమవుతుండగా.. ఫించన్‌దారుల నిలదీతతో ఇబ్బందికర పరిస్థితి
టీడీపీ ఈవెంట్‌గా..
పెన్షన్‌ల పంపిణీని గత ప్రభుత్వం ఏనాడూ రాజకీయ కార్యక్రమంగా చూడలేదు. కానీ, చంద్రబాబు మాత్రం దాన్ని టీడీపీ ఈవెంట్‌గా మార్చేశారు. టీడీపీలో చోటా లీడర్ల దగ్గరి నుంచి మంత్రుల స్థాయిదాకా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. లబ్ధిదారులతో ఉత్తుత్తి పంపిణీ ఫొజులు ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్టర్లు వేయించుకుంటున్నారు.
పెన్షన్ వచ్చేనా?
ఏపీలో దివ్యాంగుల్లో 8 లక్షల మంది పెన్షన్ పొందుతుండగా.. వారిలో 60 వేల మందికి మళ్లీ వైకల్య పరీక్షలు జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందువల్ల వాళ్లకు పెన్షన్ వస్తుందా అనేది అనుమానమే. వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇస్తున్న పెన్షనర్ల విషయంలోనూ రివిజన్ నిర్వహించాలని బాబు సర్కార్ యోచిస్తోంది. తద్వారా రకరకాల నిబంధనల పేరుతో మరికొందరిని జాబితా నుంచి తొగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుంది. ఈసారి ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేస్తునప్పటికీ.. పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే ఎలా? అనే ఆందోళన లబ్దిదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ రాకపోతే.. సచివాలయాల చుట్టూ తిరగండి. అసలు మీ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోండి.. లేకపోతే ఇక అంతే.. అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షనర్లు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment