అనారోగ్యంతో మంచం పట్టిన గర్భిణి
కొండలతో కలిసి.. కోనలతో మురిసి.. అడవి పూల వాసనతో పరిమళించి.. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి.. అటవీ దేవతో ఒడిలో కునుకు తీసే గిరిజన బతుకులు నేటికీ ఏమాత్రం మారలేదు. నీటి కోసం.. కూటి కోసం.. వైద్యం కోసం.. రోడ్డు కోసం.. వెలుగు కోసం ఆశగా ఎదురు చూస్తేనే ఉన్నారు. విష జ్వరాలతో.. అంతుచిక్కని వ్యాధులతో మంచం పడుతూనే ఉన్నారు. ఈ శాపం నుంచి వారికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో సమయమే తేల్చాలి.
రాచర్ల(ప్రకాశం): మండల పరిధిలోని జేపీ చేరువు శివారుల్లో ఉన్న గిరిజనకాలనీ మౌలిక వసతులకు దూరంగా.. గిరజనుల అవస్థలకు దగ్గరగా మారింది. గిరిజనులకు అభివృద్ధి, కనీస సౌకర్యాల కోసం ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో సమర్పించిన అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. జేపీ చెరువు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో అంబచెరువు వద్ద లోతు వాగు పక్కనే రెండు నెలల క్రితం ఫారెస్టు లాగింగ్ డీఎఫ్‌ఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి 25 గిరిజనుల కుటుంబాలకు నివాసాలు ఏర్పాటు చేసుకోనేందుకు పాక్షికంగా స్థలాలను కేటాయించారు. దీంతో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లోని నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఈ నీటిని తాగడం వలన పెద్దలకు విషజర్వాలు, చిన్నారులకు చర్మవ్యాధులు సోకుతున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే క్రూర మృగాలు, విషాసర్పలు తమ నివాసాల్లోకి వస్తున్నాయని భయాందోళనకు గురువుతున్నారు.
నిలిచిన నీటి సరఫరా
గడిచిన రెండు నెలలు 25 కుటుంబాల కలిగిన గిరిజనకాలనీకి రోజుకు ఒక ట్యాంకర్ చొప్పున తాగునీటిని సరఫరా చేసే వారు. అయితే సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు ఇప్పటి వరకు గిరిజనకాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా 10 రోజులుగా తాగునీటిని సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో గిరిజనులు వ్యవసాయ పొలాల్లో, కొండ ప్రాంతాల్లోని నీటి కుంటల్లో నిలిచిన వర్షపునీరు తాగుతున్నారు. దీనివల్ల దాదాపు 10 మందికి పైగా విషజ్వరాలు సోకి మంచాన పడ్డారు.
గర్భిణులకు అందని వైద్యం..
లోతు వాగు పక్కనే నివాసం ఉంటున్న గిరిజనులకు వైద్యం అందడంలేదు. ముఖ్యంగా గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంతవరకు వైద్యాధికారులు కానీ, అంగన్‌వాడీ కార్యకర్తలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గర్భిణి అయిన చెంచు రమణమ్మకు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడంతో మూడు రోజులుగా నొప్పులతో పూరి గుడిసెలోనే విలవిల్లాడుతోంది. కనీసం 108 వాహనం కూడా అటువైపు వెళ్లడంలేదు.
ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
మాకు ఇంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కల్పించలేదు. ఎన్‌టీఆర్ భరోసా అందడంలేదు. వీధిలైట్లు, కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నాం. తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లో నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నాం. ఈ నీటిని తాగడం వ్యాధులు వస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే ఎలుగుబంట్లు, పాములు తమ నివాసాల్లోకి వస్తున్నాయి. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.– పాముల చెంచులక్ష్మి (గిరిజన మహిళ, జేపీ చెరువు)
సమస్యలను పట్టించుకొనేవారే లేరు
నేను పుట్టకతోనే వికలాంగురాలిని. రేషన్‌కార్డు, అధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉన్నాయి. వికాలాంగుల పింఛన్ కోసం జన్మభూమి–మాఊరు గ్రామసభల్లో ఎన్నో సార్లు అర్జీలను పెట్టుకున్నా. ఇంతవరకు విలాంగ పింఛన్ మంజూరు చేయలేదు. అంతేకాక యాటగిరి అల్లూరయ్య, యాటగిరి పోలయ్య, సవరం శ్రీను, యాటగిరి లక్ష్మీరంగయ్య, పాముల చెంచులక్ష్మి రేషన్‌కార్డు కోసం అర్జీలు పెట్టుకున్నా రేషన్‌కార్డులు కల్పించలేదు. మేము ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment