Tribals Health
-
కొండంత కష్టం
బుట్టాయగూడెం: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో మార్పులు రావడంలేదు. కష్టాలు తీరే మార్గంలేక వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఇప్పటికీ రహదారి సౌకర్యాలు లేక అనారోగ్యాల పాలయితే వాహన సౌకర్యాలు లేక తరాలుగా జోలు కట్టి ఆస్పత్రికి తీసుకువస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి సంఘటన పశ్చిమ ఏజెన్సీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేలేరుపాడు మండలం మోదేలుకు చెందిన కెచ్చెల లత అనే గర్భిణి ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆమెకు ఫిట్స్ రావడంతో గ్రామస్తులు హుటాహుటిన మం చంపై ఆమెను 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కొండలు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం డోలుగండి సమీపంలోని గానుగమామిడి చెట్ల సమీపం వరకు మోసుకువచ్చారు. రేపల్లెలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారిని చూసి సమాచారాన్ని దొరమామిడి పీహెచ్సీ సిబ్బందికి అందించారు. బాలింత ప్రమాద పరిస్థితిలో ఉందని వెంటనే అంబులెన్స్ పంపాలని సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాలింతకు దొరమామిడి ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని లత దగ్గర ఉన్న ఏఎన్ఎం మంగ తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలు అందేలా అలివేరు ఏఎన్ఎంలు రాధ, మల్లిక చూస్తున్నారన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. అయ్యో.. ఎంత కష్టం బాలింతను మంచంపై మోసుకుంటూ 25 కిలోమీటర్లు నడవడం చాలా కష్టం. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వైద్యం సకాలంలో అందించి బతికించుకోవాలనే గ్రామస్తుల తçపన పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వేలేరుపాడు మండలంలోని మోదేలు గ్రామం వేలేరుపాడుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, బుట్టాయగూడెం మండలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు రేషన్ బియ్యాన్ని బుట్టాయగూడెం మండలంలోని అలివేరు గ్రామంలో తీసుకునేలా ఏర్పాటుచేశారు. త్వరలోనే వైద్య సేవలను దొరమామిడి పీహెచ్సీలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. మోదేలుకి చెందిన గిరిజనులు ప్రతి శుక్రవారం కాలిబాటన బుట్టాయగూడెం మండలానికి నడిచివస్తూ రెండు రోజుల తర్వాత తిరిగి వెళ్తుంటారు. బాలింతను మాత్రం గంటల్లో మోసుకుంటూ సకాలంలో వైద్యం అందించేందుకు చాలా కష్టపడ్డారు. లంకపాకల నుంచి రేపల్లె వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టినా ఇటీవల వర్షాలకు రోడ్డు బాగా దెబ్బతింది. కనీసం ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టినా 10 కిలో మీటర్ల వరకూ వాహనాలు వెళ్తాయని గిరిజనులు అంటున్నారు. -
అడవితల్లికి పుత్ర శోకం
కొండలతో కలిసి.. కోనలతో మురిసి.. అడవి పూల వాసనతో పరిమళించి.. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి.. అటవీ దేవతో ఒడిలో కునుకు తీసే గిరిజన బతుకులు నేటికీ ఏమాత్రం మారలేదు. నీటి కోసం.. కూటి కోసం.. వైద్యం కోసం.. రోడ్డు కోసం.. వెలుగు కోసం ఆశగా ఎదురు చూస్తేనే ఉన్నారు. విష జ్వరాలతో.. అంతుచిక్కని వ్యాధులతో మంచం పడుతూనే ఉన్నారు. ఈ శాపం నుంచి వారికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో సమయమే తేల్చాలి. రాచర్ల(ప్రకాశం): మండల పరిధిలోని జేపీ చేరువు శివారుల్లో ఉన్న గిరిజనకాలనీ మౌలిక వసతులకు దూరంగా.. గిరజనుల అవస్థలకు దగ్గరగా మారింది. గిరిజనులకు అభివృద్ధి, కనీస సౌకర్యాల కోసం ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో సమర్పించిన అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. జేపీ చెరువు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో అంబచెరువు వద్ద లోతు వాగు పక్కనే రెండు నెలల క్రితం ఫారెస్టు లాగింగ్ డీఎఫ్ఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి 25 గిరిజనుల కుటుంబాలకు నివాసాలు ఏర్పాటు చేసుకోనేందుకు పాక్షికంగా స్థలాలను కేటాయించారు. దీంతో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లోని నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఈ నీటిని తాగడం వలన పెద్దలకు విషజర్వాలు, చిన్నారులకు చర్మవ్యాధులు సోకుతున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే క్రూర మృగాలు, విషాసర్పలు తమ నివాసాల్లోకి వస్తున్నాయని భయాందోళనకు గురువుతున్నారు. నిలిచిన నీటి సరఫరా గడిచిన రెండు నెలలు 25 కుటుంబాల కలిగిన గిరిజనకాలనీకి రోజుకు ఒక ట్యాంకర్ చొప్పున తాగునీటిని సరఫరా చేసే వారు. అయితే సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు ఇప్పటి వరకు గిరిజనకాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా 10 రోజులుగా తాగునీటిని సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో గిరిజనులు వ్యవసాయ పొలాల్లో, కొండ ప్రాంతాల్లోని నీటి కుంటల్లో నిలిచిన వర్షపునీరు తాగుతున్నారు. దీనివల్ల దాదాపు 10 మందికి పైగా విషజ్వరాలు సోకి మంచాన పడ్డారు. గర్భిణులకు అందని వైద్యం.. లోతు వాగు పక్కనే నివాసం ఉంటున్న గిరిజనులకు వైద్యం అందడంలేదు. ముఖ్యంగా గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వైద్యాధికారులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గర్భిణి అయిన చెంచు రమణమ్మకు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడంతో మూడు రోజులుగా నొప్పులతో పూరి గుడిసెలోనే విలవిల్లాడుతోంది. కనీసం 108 వాహనం కూడా అటువైపు వెళ్లడంలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మాకు ఇంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కల్పించలేదు. ఎన్టీఆర్ భరోసా అందడంలేదు. వీధిలైట్లు, కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నాం. తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లో నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నాం. ఈ నీటిని తాగడం వ్యాధులు వస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే ఎలుగుబంట్లు, పాములు తమ నివాసాల్లోకి వస్తున్నాయి. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.– పాముల చెంచులక్ష్మి (గిరిజన మహిళ, జేపీ చెరువు) సమస్యలను పట్టించుకొనేవారే లేరు నేను పుట్టకతోనే వికలాంగురాలిని. రేషన్‌కార్డు, అధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉన్నాయి. వికాలాంగుల పింఛన్ కోసం జన్మభూమి–మాఊరు గ్రామసభల్లో ఎన్నో సార్లు అర్జీలను పెట్టుకున్నా. ఇంతవరకు విలాంగ పింఛన్ మంజూరు చేయలేదు. అంతేకాక యాటగిరి అల్లూరయ్య, యాటగిరి పోలయ్య, సవరం శ్రీను, యాటగిరి లక్ష్మీరంగయ్య, పాముల చెంచులక్ష్మి రేషన్‌కార్డు కోసం అర్జీలు పెట్టుకున్నా రేషన్‌కార్డులు కల్పించలేదు. మేము ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారు. -
విజృంభిస్తున్న ఆంత్రాక్స్
డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో ఆంత్రాక్స్ మళ్లీ విజృంభిస్తోంది. ఐదు రోజుల క్రితం పోతంగి గ్రామంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకగా, తాజాగా ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పంచాయతీ కండ్రుం గ్రామంలో ఇద్దరు గిరిజనులకు సోకింది. కండ్రుం గ్రామానికి చెందిన వంతల సన్యాసి,వంతల అర్జున్ అనే గిరిజనులు ఈవ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వ్యాధి గ్రస్తులు వారిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మేక మాంసాన్ని వారం రోజుల క్రితం వీరు తిన్నారని, అందువల్లే ఈ వ్యాధి ప్రబలినట్టు గ్రామస్తులు తెలిపారు.' ఇదే గ్రామంలో 2016 ఏప్రిల్‌లో ఆంత్రాక్స్ వ్యాపించింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలలో ఆంత్రాక్స్ వ్యాధి రావడంపై గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాలి ఆంత్రాక్స్ వ్యాధి పట్ల గిరిజనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహన కల్పించాలని గిరిజన సంఘం నేతలు కోరుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల మృతి చెందిన పశువుల మాంసం తిని వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతున్నా నిరోధించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. అప్రమత్తంగా ఉండాలి ఆంత్రాక్స్ పట్ల గిరిజనులు అప్రమతంగా ఉండాలని పాడేరు ఏడీఎంహెచ్‌వో పార్థసారధి సూచించారు. మంగళవారం ఆయన పోతంగి గ్రామాన్ని సందర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన పశువుల మాంసాన్ని తినరాదని తెలిపారు. దీనిపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిం చాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమ వైద్యులు కళ్యాణ్ ప్రసాద్, స్థానికులు శాంతికిరణ్, సింధరాంపడాల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివాసీల ఆరోగ్యంపై చర్యలు తీసుకోండి
ఏజెన్సీ ఏరియాలపై రాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ ఫోరం లేఖ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకు కనీస ఆరోగ్య రక్షణ కూడా లేదని హ్యూమన్ రైట్స్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మంలోని భద్రాచలం, విశాఖలోని ఏజెన్సీల్లో మలేరియా, రక్తహీనత, ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు ప్రజలను హరింపజేస్తున్నాయని ఫోరం ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్టు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జీవన్ కుమార్, భుజంగరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూర్‌లోని బీముగూడలో 16 కుటుంబాలు అంతుచిక్కని చర్మ వ్యాధులతో 6 నెలలుగా బాధపడుతున్నా యని, ఏపీలోని సీతంపేట్ ఏజెన్సీలో ఆదివాసీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల 1999లో 5 వేల మంది, 2005, 2010ల్లో 2,500 మంది చొప్పున మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు.