government services
-
YS Jagan: 4 వసంతాల నవచరిత
ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్‌లు సేవలందిస్తున్నాయి. వీటి ఫలితమేంటో తెలుసా..? ► కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళుతున్నారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూనిఫామ్.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్ కంటెంట్‌తో అందే ట్యాబ్‌లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తున్నాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్బీకేలు చేయిపట్టి నడిపిస్తున్నాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే. హెల్త్ క్లినిక్‌లోని ఫ్యామిలీ డాక్టర్... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నాడు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్‌ను తెచ్చి చేతిలో పెడుతున్నారు. ► పేదలకు రేషన్ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్లు పనిచేస్తున్నాయి. కాకపోతే... ఇవన్నీ సాధ్యమయింది కేవలం నాలుగేళ్లలో. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత!!. ► అందుకే ఇప్పుడు ఏపీ ఒక రోల్ మోడల్. సీఎంగా వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్బీకే, రేషన్ డోర్‌డెలివరీ, వలంటీర్ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. ► ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... జగన్ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఇవన్నీ ఒకెత్తయితే పారిశ్రామికంగా వేసిన అడుగులు మరో ఎత్తు. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్లు, మూడు ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రంవైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది ముఖ్యమంత్రి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన నాలుగేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త చరిత్ర. -
ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
Grama, ward Sachivalayam: సేవల్లో రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 25న ఒక్క రోజులో ఏకంగా 2.88 లక్షల మంది వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలెవరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలు లేదంటే దగ్గర్లోని పట్టణాలు లేదా జిల్లా కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి సొంత ఊర్లోనే ఆయా పనులయ్యేలా ఓ వినూత్న, విప్లవాత్మక ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఈ పనులు దాదాపు పరిష్కారమయ్యేలా 2020 జనవరి 26 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకు గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలను పొందారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలను మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది. కానీ, గత బుధవారం ఒక్కరోజే 2.88 లక్షల మంది వివిధ రకాల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో అదేరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అది లేకుండా ఉంటే సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు తెలిపారు. 65 శాతానికి పైగా రెవెన్యూ సేవలే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లల్లో ప్రజలకు అందించిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా.. ఈ నెల 25న పరిష్కరించిన 2.88 లక్షల వినతులను చూసినా.. అందులో 65–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం ఒక రైతు తన సొంత పొలం వివరాలను పాస్ పుస్తకంలోగానీ, రెవెన్యూ శాఖ మీ–భూమి రికార్డులోగానీ నమోదు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవారు. నెలల తరబడి మండలాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని పరిస్థితి. లంచాల బెడద వీటికి అదనం. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులో భూమి బదిలీకి సంబంధించి జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వారి సొంత గ్రామాల్లోని గ్రామ సచివాలయాలోనే అత్యంత సులువుగా, ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోనే పూర్తిచేసి ఆ సమాచారాన్ని సంబంధిత యజమానికి మెసేజ్ పంపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఈసీ జారీ కూడా సచివాలయాల ద్వారానే లభిస్తోంది. అలాగే, ఆదాయ, కుల ధృవీకరణ ప్రతాలు వంటి వాటికి గతంలో 30 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సగటున ఐదు రోజుల వ్యవధిలో సంబంధిత తహసీల్దార్ ఆమోదం పూర్తయి, సర్టిఫికెట్లను కూడా సచివాలయాల్లోనే జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 25న అందజేసిన సేవలలో కూడా రెవెన్యూ సంబంధిత సేవలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జగనన్న చేదోడు పథకం తుది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ రోజు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. సేవల సంఖ్య, నాణ్యతలో పెరుగుదల ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కాలేదు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, సేవల నాణ్యత పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టింది. ఉదా.. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఆధార్ వివరాలతో అనుసంధానం చేసి అమలుచేస్తుండడంతో ప్రభుత్వం కొత్తగా సచివాలయాల్లో ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ► రాష్ట్రంలోని ప్రతి ఐదు గ్రామ సచివాలయాల్లో ఒకచోట చొప్పున 2,377 సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటిదాకా ఆధార్ సేవలు లేని ప్రాంతాలను గుర్తించి ఆయా సచివాలయాల్లోనే ముందుగా వీటిని ఏర్పాటుచేశారు. ► అలాగే, ఇళ్లు, భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను సైతం ప్రభుత్వం సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది. 1,537 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్థానిక సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేసింది. వీటిల్లో 51చోట్ల ఇప్పటికే ఆ సేవలు ప్రారంభయ్యాయి. ► గత ఏడాది కాలంలో కొత్తగా మున్సిపల్ ప్రాంతాలకు సంబంధించి నీటి, ఆస్తిపన్నులు, ట్రాఫిక్ చలానాలు, రైతుల నీటి తీరువా బిల్లుల చెల్లింపులనూ ప్రభుత్వం సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు నాంది పలికిన తర్వాత ప్రభుత్వంతో ఏ చిన్న పనిపడినా రోజుల తరబడి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెరిగి లంచాలకు తావులేకుండా పోయింది. రాబోయే రోజుల్లో సచివాలయాల్లో మరిన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడు సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడే వాటిని పరిష్కరించడానికి జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏర్పాటుచేస్తోంది. అలాగే, సేవలు అందజేసే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన శిక్షణనూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంటినుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సంబంధిత సర్టిఫికెట్ల సాఫ్ట్ కాపీలను వాట్సాప్ లింక్ ద్వారా పంపేందుకు యత్నిస్తున్నారు. -
సచివాలయాల సేవలూ ఇంటి వద్దకే!
సాక్షి, అమరావతి: ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో సినిమా, బస్, రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టే.. గ్రామ, వార్డు సచివాలయాల సేవలు కూడా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రజలు ఇంటి వద్దనే ఉండి దరఖాస్తు చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతోంది. దీని ద్వారా ప్రభుత్వం సచివాలయాల్లో అందజేస్తున్న 545 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. ఇంట్లో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ ఉంటే చాలు.. ఎవరైనా తమ వ్యక్తిగత మెయిల్ ఐడీల ద్వారా 545 రకాల ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి వద్దే ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత గ్రామం దాటి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే 545 రకాల ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసే పింఛన్లు, రేషన్ వంటివాటిని ఇప్పటికే వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వం చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి సచివాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లనుంది. ఈ క్రమంలో ఎవరైనా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు నేరుగా ఆయా శాఖల సిబ్బందికి చేరతాయి. వాటి ఆమోదం అనంతరం తిరిగి మెయిల్ ఐడీ ద్వారా ఆ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటి వద్దనే పొందే వీలుంటుందని అధికారులు వెల్లడించారు. -
భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలి
గుంటూరు వెస్ట్: ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించి ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ప్రాధాన్యతా భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, విలేజ్ వెల్నెస్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేలు, బీఎంసీయులు నిర్మాణాల్లోని ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరిస్తానన్నా రు. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని భవనాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అధికారులు వివరాలను కలెక్టర్‌కు అందిస్తూ 154 ఆర్బీకేలకుగాను 43 పూర్తి చేశామన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు 164కుగాను 47, గ్రామ సచివాలయాలు 206కు గాను 110, 25 బీఎంసీయూలకు గాను 2, డిజిటల్ లైబ్రరీలు 92కు గాను 49 పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి మొత్తం భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న జగనన్న లే అవుట్స్‌లో నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా నిర్మాణాల్లో కొంత ఆలస్యమేర్పడిందన్నారు. తొలి దశలో మంజూరైన 68,989 ఇళ్ల నిర్మాణాలను అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు. ఇందులో 42,821 ఇళ్లు బీబీఎల్, 12,394 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 1200 గృహాలు రూప్ లెవెల్, 2430 ఇళ్లు ఆర్సీ లెవెల్స్‌లో ఉన్నాయన్నారు. కాలనీలకు అప్రోచ్ రోడ్లు, లెవెలింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి మిగతాఇళ్ల బేస్మెంట్ పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్‌లు నిరంతరాయంగా అందించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, మెప్మా పీడీలు హరిహరనాథ్, వెంకట నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోండి ప్రతి వృత్తిలో సాంకేతికత పెరుగుతోందని దాంట్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి మార్గాలు మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్కిల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో గుంటూరు ఐటీఐ, పొన్నూరులోని చేబ్రోలు ప్రభు త్వ కళాశాలలో, తెనాలిలోని ఐటీఐ కళాశాలలో హబ్‌ను ప్రారంభించి శిక్షణ ప్రారంభిస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సీడ్యాప్, ఎన్ఏసీ, ఆర్ఎస్టీఐ, జన శిక్షణా సంస్థలు ఎవరికి వారు నిరుద్యోగులకు శిక్షణ నిచ్చేవారన్నారు. ఇక నుంచి స్కిల్ హబ్‌లలో కమిటీల ద్వారా అవసరమైన శిక్షణనిస్తారన్నారు. జాతీయస్థాయి పరిశ్రమలు, జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగులను స్కిల్డ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో వెబ్, యాప్ డిజైనింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రిక్, ప్లంబరింగ్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనా«థ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రణయ్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకరరావు, అధికారులు పాల్గొన్నారు. -
AP: ఈ సేవలన్నీ మీకు తెలుసా?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన వెంకట రమణ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తోంది. ఇదే సమయంలో ఆ గ్రామ సచివాలయంలో పని చేసే వెల్ఫేర్ అసిస్టెంట్, మరో ముగ్గురు వలంటీర్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. తలుపు తీయగానే నమస్కారం.. అంటూ తాము వచ్చిన పని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి తెలుసా? అని వాకబు చేశారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు పొందే విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. వెంకట రమణ చెప్పిన సమాధానాన్ని ఆ సచివాలయ ఉద్యోగి తన వెంట తెచ్చుకున్న మొబైల్లోని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి, అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు చేర వేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊళ్లలోనూ సచివాలయాల బృందాలు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సమస్యలపై వాకబు చేశాయి. ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు, రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ సేవలు పొందడంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడం కోసం ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’ (ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 44.55 లక్షల కుటుంబాలను కలిశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారి సొంత గ్రామంలో అందిస్తున్న సేవల గురించి వివరించాయి. సేవలు పొందడంలో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నాయి. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 22.28 లక్షల కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లో 18.27 లక్షల కుటుంబాలను సచివాలయ ఉద్యోగుల బృందాలు కలిసి అభిప్రాయాలు సేకరించాయి. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒక్కో బృందం వంద ఇళ్లకు.. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి, మరో ముగ్గురు వలంటీర్లను ఒక్కో బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందం గ్రామం/వార్డులోని కనీసం వంద కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి వివరాలు సేకరిస్తోంది. ఆగస్టు నెలలో కేవలం పట్టణ ప్రాంతాలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ నెల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కొనసాగిస్తోంది. ఇక ప్రతి నెలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల ఫోన్ నంబర్ల కరపత్రాలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్ ఫోను నంబర్‌తో పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగుల ఫోన్ నంబర్ల వివరాలు, ఆ ప్రాంత వలంటీరు ఫోను నంబరు ముద్రించిన కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమాచారమైన ఆయా నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని బృందం సభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు. ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’లో ప్రధాన వివరాలు ఇలా.. ► గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ► మీ గ్రామ/వార్డు వలంటీర్ మీకు తెలుసా? ► మీ వలంటీర్ ఎన్ని రోజులకొకసారి మీ ఇంటికి వస్తున్నారు? ► మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? (ఈ ప్రశ్న తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతారు) ►సచివాలయంలో ఏయే సేవలు అందిస్తున్నారో మీకు తెలుసా? ► ‘సచివాలయం’ ద్వారా సేవలు పొందే విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? -
దేశానికే ఆదర్శం.. మన ‘సచివాలయం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలనాపరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు దేశానికే ఆదర్శమైంది. ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్న మన గ్రామ సచివాలయాల తరహాలోనే అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలోనే వీలైనన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలోనే 59 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తాజాగా ఒక మోడల్ సిటిజన్ చార్టర్‌ను ప్రకటించారు. ప్రతి సేవకు సంబంధించి ప్రజల నుంచి వినతి అందాక.. ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరించాలో నిర్దిష్ట గడువును విధించి, ఆ గడువులోగా వాటిని అందించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. మోడల్ సిటిజన్ చార్టర్ ప్రారంభ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల్లో అందుబాటులో 545 సేవలు.. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో కేవలం 19 రకాల ప్రభుత్వ సేవలు మాత్రమే ఉండేవి. ఇవికాకుండా ఇంకేమైనా అవసరమైతే మండల, జిల్లా కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019, అక్టోబర్ 2న రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మారుమూల కుగ్రామంలో ఉండే సచివాలయంలో సైతం 2020 జనవరి 26 నుంచి ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని సేవలను అప్పటికప్పుడు, మరికొన్నింటిని 72 గంటల్లో, ఇంకొన్నింటిని సాధ్యమైన త్వరగా అందించేలా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించారు. అంతేకాకుండా 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రతి అభివృద్ది సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. గత 17 నెలల కాలంలో 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలు.. గత 17 నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలను ప్రజలు అందుకోగా.. అందులో 1.89 కోట్లు గ్రామీణ ప్రజలే పొందారు. సచివాలయాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు, మారుమూల కుగ్రామాల్లో ఉండేవారికి సమాన స్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు.. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు పది వేల జనాభా ఉండే గుంటూరు జిల్లా కాజ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య ఏడాదికి రెండు వందల లోపే ఉండేదని అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న రెండు సచివాలయాలకు రోజుకు 70 నుంచి 100 మంది వరకు వివిధ పనుల కోసం వస్తున్నారని చెప్పారు. 1.34 లక్షల ఉద్యోగాల భర్తీతో సత్వరమే సేవలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. అంతే వేగంగా పారదర్శకంగా వాటిని భర్తీ చేసి.. ప్రతి గ్రామ సచివాలయంలో 10–12 మంది ఉద్యోగులను నియమించింది. దీంతో 545 సేవలు ప్రజలకు సత్వరమే అందుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు మన రాష్ట్రంలో మాదిరిగానే అత్యధిక రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య నామమాత్రంగా ఉందని వివరించాయి. ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రశంసలు.. ఇటీవల కరోనా కట్టడి సమయంలో, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సమీక్షలు నిర్వహించినప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్లు అందజేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మన రాష్ట్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవల పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న తీరును మెచ్చుకోవడమే కాకుండా ఈ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. కోవిడ్–19 తర్వాత ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌లో ‘గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్’ పేరిట జపాన్ రాజధాని టోక్యోలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా నిర్వహించబోతున్నామని, ఇందులో పాల్గొని రాష్ట్రం తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. -
ప్రభుత్వ సేవలు.. హెల్ప్‌లైన్ నంబర్లు
సాక్షి, కాకినాడ: ధనిక, పేద, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రజలు పైసా ఖర్చు లేకుండా ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను, సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే వీటి ముఖ్యోద్దేశం. ఆ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ.. 14400 (అవినీతి నిరోధం): వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్ కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు. 1912 (విద్యుత్ సేవలు) విద్యుత్ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది 14500 (ఇసుక, మద్యం) ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. దీనిద్వారా మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందవచ్చు. అలాగే ఇసుక డోర్ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 108 (ప్రభుత్వ అంబులెన్స్) అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్ చేయవచ్చు. కాల్ సెంటర్ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. 1907 (వ్యవసాయం) వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు. 104 (వైద్యం, ఆరోగ్యం) ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నారు. 100 (పోలీసు సేవలు) ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్ 24 గంటలూ పని చేస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, మాట్లాడే ప్రతి మాటా రికార్డవుతుంది. 112, 181 (దిశ) లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన అమానవీయ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్ చేస్తే కంట్రోల్ రూము నుంచి వారు ఫోన్ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు. 1902 (ప్రజా సమస్యలు) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే లభిస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువు తేదీలోగా వాటిని పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. దీనివలన అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి. 101 (అగ్నిమాపక కేంద్రం) ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు. -
మీడియాను అలా అనుమతించొచ్చా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలను చొప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రను బయటపెడుతున్నామంటూ సుదర్శన్ టీవీలో ప్రసారమవుతున్న బిందాస్ బోల్ కార్యక్రమంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఒక మతం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునేలా మీడియాను అనుమతించవచ్చా అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘ముస్లింలు సివిల్ సర్వీసెస్‌లో చేరడం ఒక పెద్ద కుట్రని మీరు చెప్పాలనుకుంటున్నారు. ఇలా విద్వేషాన్ని, విభేదాలను పెంచడం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి ప్రచారంతో దేశం మనుగడ సాధించలేదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో తమకు తెలుసునంది. ఎలక్ట్రానిక్ మీడియా స్వయం నియంత్రణను బలోపేతం చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రం, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్(ఎన్బీఏ)లను కోరింది. సుదర్శన్ టీవీ తరఫున ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చవ్హంకే తన పిటిషన్లో.. బిందాస్ బోల్ కార్యక్రమంలో ‘యూపీఎస్సీ జిహాద్’ అనే మాట వాడటాన్ని సమర్థించుకున్నారు. యూపీఎస్సీ పరీక్ష రాసే ముస్లింలకు జకాత్ ఫౌండేషన్ అన్నివిధాలుగా సాయం అందిస్తోందనీ, ఈ ఫౌండేషన్‌కు ఉగ్ర లింకులున్న సంస్థల నుంచి నిధులందుతున్నాయని పేర్కొన్నారు. ఒకరిద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినంతమాత్రాన కార్యక్రమంపై నిషేధం విధించడం తగదని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమం ప్రొమోలో చూపిన దృశ్యాలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. జకాత్ ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. జకాత్ ఫౌండేషన్ ముస్లింలతోపాటు ముస్లిమేతరులకు కూడా సాయం చేస్తోందన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బిందాస్ బోల్ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఈ నెల 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై సుదర్శన్ టీవీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆగిపోయిందీ కోట్లాదిమంది తెలుసుకోవాలని భావిస్తున్నందున విచారణ ప్రక్రియను లైవ్‌లో చూపేందుకు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కోరింది. వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి ఇది చాలా కీలకమైన కేసని పేర్కొంది. -
ఊరించిన సేవలు ఇక ఊర్లోనే
-
ఊరించిన సేవలు ఇక ఊర్లోనే
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా కొర్రాయి గ్రామ ప్రజలు ఇప్పటివరకు ఏ చిన్న పని కావాలన్నా 20 కి.మీ. దూరంలో ఉండే మండల కేంద్రానికి వెళ్లాలి. వెళ్లి వచ్చేందుకు రవాణా సదుపాయాలు లేక గ్రామస్తులు అవస్థలు పడుతుంటారు. ఆ ఊరికీ ఓ పంచాయితీ కార్యదర్శి, వీఆర్వో ఉన్నా నెలకోసారి పింఛన్లు పంపిణీ చేసేటప్పుడో మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వచ్చి పోతుంటారన్నది గ్రామస్తులు చెప్పే మాట. అలాంటి మారుమూల ప్రాంతంలో సైతం ఆదివారం నుంచి 536 రకాల సేవలు గ్రామ సచివాలయంలోనే అందజేసే ప్రక్రియ మొదలు కానుంది. కొర్రాయి ఒక్క చోటే కాదు రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు. అందుబాటులోకి వచ్చే ప్రధాన సేవలు.. ఇప్పుటిదాకా వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పొలం పాస్‌బుక్‌లో భూముల వివరాలు నమోదు, ఈసీల జారీ, కుల ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులో మార్పుచేర్పులు, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ లాంటి సేవలన్నీ ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తాయి. పావుగంటలో పలు సేవలు... 15 నిమిషాల వ్యవధిలోనే 1 బి, అడంగల్, ఆధార్, రేషన్‌కార్డు ప్రింట్, టైటిల్‌డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సరిఫికెట్ కాపీ, విద్యుత్ కనెక్షన్ కేటగిరి మార్పు లాంటి సేవలు పొందవచ్చు. అప్పటికప్పుడు మొత్తం 47 రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తారు. మిగిలిన వాటిని కూడా మూడు రోజుల అనంతరం ఒక్కో సేవను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సేవలన్నింటినీ అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించారు. ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో దీన్ని అనుసంధానించారు. దీనికి తోడు గ్రామ, వార్డు సచివాలయాల్లో నిత్యం ‘స్పందన’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లు, ప్రింటర్, నెట్ సదుపాయం సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను అందుబాటులోకి తెస్తుండటంతో ప్రతి చోట కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ప్రింట్ తీసిన అనంతరం దరఖాస్తుదారులకు లామినేషన్ చేసిన కార్డులను అందచేస్తారు. వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్దే అందచేసేందుకు ప్రభుత్వం నియమించిన 2.81 లక్షల మంది వలంటీర్లకు మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు. -
ఇంటి ముంగిటే ప్రభుత్వ సేవలు
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటే పలు సేవలు అందించేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్లోనే సేవలను నిర్ణీత గడువులోగా అందించనున్నారు. ఇందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ల్యామినేషన్ యంత్రాలు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింటింగ్ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే 80 శాతానికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. 50 శాతానికిపైగా కార్యాలయాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిసెంబర్ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా పాలనా వ్యహారాలను కొనసాగించనున్నట్లు వెల్లడించాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వైఎస్సార్ నవశకం పేరుతో నవరత్నాల పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను ఇంటింటి సర్వే ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లు ఎంపిక చేశారు. వైఎస్సార్ ఆర్యోగశ్రీ పథకం లబ్ధిదారులను ఇప్పటికే పూర్తిస్థాయిలో గుర్తించారు. సామాజిక తనిఖీ నిమిత్తం లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గురువారం వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. శుక్రవారం లబ్ధిదారుల తుది జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదిస్తారు. ఇప్పటివరకు దాదాపు 1,43,04,823 కుటుంబాలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత కలిగి ఉన్నట్లు తేల్చారు. లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు. అందుబాటులోకి 500కు పైగా సేవలు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు. ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు. ఉదాహరణకు.. రైతు తన పొలానికి సంబంధించి అడంగల్ కోసం గ్రామ సచివాలయానికి వస్తే అక్కడికక్కడే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. ఇదంతా పావు గంటలోనే పూర్తవుతుంది. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే పావు గంటలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు. ఈ 311 రకాల సేవలను 72 గంటల కంటే ఇంకా తక్కువ వ్యవధిలోనే అందించేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. ప్రజలకు అందించాల్సిన సేవలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
రూ.10 లక్షలు దాటితే రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: పారదర్శకతకు మరింత పెద్దపీట వేసేలా రూ.10 లక్షలు.. ఆ పైబడి విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం బిడ్డింగ్, రివర్స్ టెండరింగ్ విధానాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కొత్త విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఇ–ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫాం మీదే సాధ్యమైనంత మేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో పారదర్శకత, ప్రజాధనం ఆదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.100 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ముందస్తు న్యాయ సమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామని చెప్పారు. ఈ విధానాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో భాగంగా కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మంది మాత్రమే (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్ 1 నుంచి ఎల్ 6 వరకు) రివర్స్ టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్ ప్రక్రియలో కోట్ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని చెప్పారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలి రూ.10 లక్షలు పైబడి, రూ.100 కోట్ల లోపు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక విధానం ఉండాలని ఆదేశించారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనాలంటే నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత విశదీకరంగా, అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలను ఇ–ప్రొక్యూర్మెంట్ సైట్లో వారం రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా ప్యాకేజీలు ఉండాలని చెప్పారు. పనులు, సర్వీసులు, కొనుగోళ్లపై జాబితా ప్రభుత్వ పరంగా సర్వీసులు, పనులు, కొనుగోళ్లలో ఒకే రీతి విధానం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థిరమైన విధానం లేనందున ఒక్కోశాఖ ఒక్కోలా వ్యవహరిస్తోందని వివరించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ కోసం ఉన్న పోర్టల్‌ను పూర్తి స్థాయిలో వినియోగించని వైనాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రభుత్వ పరంగా చేస్తున్న రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల లోపు కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీసులు, పనుల విషయంలో ఒక జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వీటి టెండర్ల విషయంలో ఒక విధానాన్ని తీసుకురావాలన్నారు. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నామని, వీటిని పరిగణనలోకి తీసుకుని ఒక విధానాన్ని తీసుకురావడానికి సంబంధిత కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వారు సీఎంకు వివరించారు. ఆర్థిక శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని మాన్యువల్ రూపొందిస్తుందని చెప్పారు. కొత్త పాలసీని జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకు రావాలని, ఆలోగా ప్రస్తుతం ఉన్న ఇ– ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌ను నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో వినియోగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పద్ధతుల్లో బిడ్ దక్కించుకున్న వారికి చెల్లింపులు కూడా వేగంగా జరిగేలా, ఆమేరకు చెల్లింపుల విభాగంతో లింక్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమన్వయం, పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇ–ప్రొక్యూర్మెంట్, జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను పరిశీలిస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదేనని సీఎం స్పష్టం చేశారు. ఈ అధికారి జ్యుడిషియల్ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడంతో పాటు ప్రాధామ్యాలను నిర్దేశిస్తారని చెప్పారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు టెండర్ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి అక్కడ న్యాయమూర్తికి వివరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి సాంకేతిక సహకారం అందించే వ్యక్తులను వెంటనే సూచించాలన్నారు. -
సర్వీస్ నం.112
సాక్షి,సిటీబ్యూరో: ఆపదలో ఉన్నప్పుడు.. అత్యవసర సమయాల్లోను వివిధ ప్రభుత్వ శాఖల సహాయం అవసరమవుతుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ శాఖతోను, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వైద్య శాఖతోను, వరదలు వంటి సమయాల్లో మరోశాఖ సేవలు ప్రజలకు అవసరం. అయితే, అలాంటప్పుడు ఆయా శాఖలకు చెందిన అత్యవసర నంబర్లకు ఫోన్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ పనిచేయక పోయినా.. బిజీగా ఉన్నా మన అత్యవసరం ఏంటో అవతలి వాళ్లకు తెలియదు. ఈ సమస్య లేకుండా వివిధ మార్గాల ద్వారా సాయం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పౌరులకు కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు దేశ వ్యాప్తంగా ‘112’ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తున్నారు. మొన్నటి వరకూ పోలీసు శాఖ సేవల కోసం 100, అగ్నిమాపక శాఖ సేవలకు 101, ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యం కోసం 108, చిన్నారుల రక్షణకు 1090 నంబర్‌కు కాల్ చేయాల్సి వచ్చేది. అవి బిజీగా ఉంటే చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇకపై ఆ సమస్య లేకుండా ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్’(సీడీఏసీ) ద్వారా ‘ఎమర్జింగ్ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం’ (ఈఆర్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు సేవలందిస్తుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా క్షణాల్లో అత్యవసర సేవలను అందిస్తారు. ఈ 112 నంబర్‌పై అవగాహన లేక చాలా మంది ఈ సేవలకు దూరంగా ఉంటున్నారు. సేవలు పొందడం ఇలా.. ♦ ఫోన్ ఏదైనా (స్మార్ట్/ఫీచర్/ల్యాండ్)సరే ‘112’ నంబర్ నుంచి సేవలు పొందవచ్చు. వివిధ మార్గాల ద్వారా అత్యవసర వైద్యం, భద్రతా పరమైన సహాయం కోరవచ్చు. ♦ సంక్లిప్త సందేశం(ఎస్ఎంఎస్), వాయిస్ కాల్, ఈ–మొయిల్, ఈఆర్ఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలందించేందుకు చర్యలు తీసుకుంటారు. ♦ ప్రత్యేక యాప్ రూపంలో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో యాప్‌ను నిక్లిప్తం చేసుకోవచ్చు. ♦ సాధారణ ఫోన్లో 5 లేదా 9 నంబర్లను ఎక్కువసేపు ప్రెస్‌చేసి ఉంచడం ద్వారా కూడా ‘112’ అత్యవసర సేవల విభాగం సిబ్బంది లైన్లోకి వస్తారు. జీపీఎస్ పరిజ్ఞానం ద్వారా సమస్యను గుర్తించి వివిధ ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసి సేవలందిస్తారు. -
నేటి నుంచి ఢిల్లీలో ఇళ్ల వద్దకే 40 సేవలు
ఢిల్లీ: 40 ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్లవద్దకే సిబ్బంది వచ్చి అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్, రేషన్ కార్డు, వాహనాల ఆర్సీల్లో చిరునామా మార్పులు తదితర సేవలను ఇకపై ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే పొందగలుగుతారు. అయితే ఇంటివద్దనే ఈ సేవలను పొందేందుకు ప్రజలు సాధారణ రుసుము కన్నా 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. -
ఒక యాప్.. 150 సేవలు..!
సాక్షి, హైదరాబాద్: ఒక్క యాప్.. 150 ప్రభుత్వ సర్వీసులు.. అరచేతిలోనే మీసేవలన్నింటినీ పొందే వెసులుబాటు.. ఉన్న చోటు నుంచే ప్రభుత్వ సేవలను పొందేందుకు వీలుగా టీయాప్ ఫోలియో అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీసేవా కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే పని లేకుండా.. ఇంట్లో నుంచే ఫోన్ ద్వారా వాటిని పొందే సౌకర్యాన్ని టీయాప్ ఫోలియో కల్పిస్తుంది. ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. ప్రభుత్వ సేవలను సులువుగా పొందడమేకాక మీసేవ కేంద్రాల్లో చెల్లించే నగదు కన్నా తక్కువ ఖర్చు కావడం ఈ యాప్ ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. వాస్తవానికి కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. టీయాప్ ఫోలియోతో మీసేవ సర్వీసులన్నీ ఓపెన్ ఆన్‌లైన్‌లోకి వస్తాయి. అంటే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మీసేవా కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా తొలుత 150 సేవలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ఇందుకోసం మొబైల్, ఆధార్ నంబర్‌తో యాప్‌లో ముందుగా అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం అయిన వారే సంబంధిత ధ్రువీకరణ పత్రాల కోసం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా.. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. కొత్త విధానం వల్ల మీసేవలో చెల్లించే దరఖాస్తు రుసుం తప్పుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీయాప్ ఫోలియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్, పాన్ నంబర్ ద్వారా లాగిన్ కావొచ్చు. అందులో కనిపించే సర్వీసుల్లో మనకు అవసరమైన దానిని ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లింపు ఉంటే పూర్తి చేయాలి. అంతే కోరుకున్న సర్టిఫికెట్ వస్తుంది. యాప్ ప్రత్యేకతలు ఇవీ.. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, ఆర్వోఆర్ పహాణీలు, రిజర్వేషన్ బుకింగ్, ప్రీమియం చెల్లింపులు, దైవదర్శన టికెట్ బుకింగ్‌లు, వ్యవసాయ, రవాణా శాఖ, ఉద్యోగులు, కార్మికుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్ష రుసుములను చెల్లించవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా పరీక్షా ఫలితాలూ తెలుస్తాయి. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జ్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ బిల్లు చెల్లింపు, డీటీహెచ్, డేటా కార్డు రీచార్జ్ చేసుకోవచ్చు. ఏడాదిలో వెయ్యి సేవలు.. మరో ఆరు నెలల్లో 500 సేవలు.. ఏడాదిలో వెయ్యి సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. 600 వరకు ప్రభుత్వ సర్వీసులు కాగా.. 400 వరకూ ఇన్ఫర్మేషన్, రేషన్, హోటల్స్, మెట్రో సర్వీసులు మీరు ఉన్న చోటుకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలుపుతాయి. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు తెలియజేయవచ్చు. – జీటీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిషనర్, మీసేవ -
ఆధార్ లింకేజీ గడువు పెంపునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆధార్‌ను ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలకు అనుసంధానం చేసే గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం చేపట్టిన విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ ఈ విషయం తెలిపారు. ఆధార్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నందున, ఇందుకు వీలుగా ప్రభుత్వం గడువు పెంచాలనుకుంటోందని ఏజీ తెలపగా ధర్మాసనం అంగీకరించింది. ఆధార్ విషయంలో పదేపదే ఒకే రకమైన వాదనలు చేసేందుకు పిటిషనర్లను అంగీకరించబోమని బెంచ్ తెలిపింది. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
వైద్య సేవలందకే 16 మంది మృతి
చాపరాయి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: సకాలంలో ప్రభుత్వ సేవలు అందకపోవడం వల్లే చాపరాయిలో 16 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోని వారి మృతికి ఇదే కారణమవడం బాధాకరమన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాచారలోపం వల్లే చాపరాయి వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఏమూల ఏం జరిగినా సత్వరం సమాచారం అందేలా యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. చాపరాయి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల అమాయకత్వం కూడా ఇలాంటి ఘటనలకు కారణాలవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతినెలా హెల్త్ బులెటిన్లు విడుదల చేయాలని ఆదేశించారు. -
సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సాక్షి, సంగారెడ్డి: సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016 ఆర్థిక సంవత్సరంలో 17.82 శాతం ఆదాయ వృద్ధి రేటుతో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతరం ప్రభుత్వ సేవలు ప్రజల ముగింట్లోకి వచ్చాయని, భవిష్యత్‌లో మరిన్ని ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సీఎస్ వివరించారు. 38 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని, నూతనంగా 510 రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో పాటు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నామని చెప్పారు. వివిధ పథకాలతో పాటు మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, విద్య, వైద్యం, సంక్షేమం, పరిశ్రమలు, మహిళా సంక్షేమం, పోలీస్ తదితర అంశాలపై వివరించారు. -
పోస్టల్ ద్వారా ప్రభుత్వ సర్వీసులు
* ఎకానమీని పరుగెత్తించే సత్తా పోస్టల్ శాఖకు ఉంది... * ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: రైల్వేస్ తరహాలోనే భారీ స్థాయిలో విస్తరించిన పోస్టల్ వ్యవస్థ దేశ ఎకానమీకి చోదక శక్తిగా నిలవగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు, సమాచారం అందేలా చూసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులు ఎంతగానో ఉపయోగపడగలవని ఆయన బుధవారం తెలిపారు. పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న వనరులు, ఆస్తులను ప్రజోపయోగకర పనులకు ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ నెట్‌వర్క్‌ను మరింత సమర్థంగా వినియోగించుకునే అంశంపై టాస్క్‌ఫోర్స్ నివేదిక సమర్పించిన సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను సత్వరం అధ్యయనం చేసి, అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమక్షంలో టాస్క్‌ఫోర్స్ చైర్మన్ టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ నివేదికలో ముఖ్యాంశాల గురించి ప్రధానికి వివరించారు. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, ఇతరత్రా సేవలను అందించేందుకు ఇండియా పోస్ట్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్న అంశంపై మోదీ గతేడాది ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం డిపాజిట్ల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తర్వాత ఏకంగా రూ. 6 లక్షల కోట్లతో ఇండియా పోస్ట్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 1.55 లక్షల సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వనరులను సమర్థంగా ఉపయోగించుకునేందుకు, వివిధ సేవలను అందించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కింద హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. హోల్డింగ్ కంపెనీ స్వరూపం ఇలా.. హోల్డింగ్ కంపెనీలో అయిదు విభాగాలు ఉండొచ్చని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఇందులో బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ విభాగాలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని తెలిపింది. బ్యాంకింగ్ తర్వాత అత్యధికంగా ఈ-కామర్స్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నందున పోస్టల్ విభాగం వీటిని అందిపుచ్చుకోవాలని సూచించింది. ఇక పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ప్రత్యేకంగా మరో సంస్థను నెలకొల్పాలని తెలిపింది. తొలి మూడేళ్లలో జిల్లాకి ఒక శాఖ చొప్పున ఏర్పాటు చేయొచ్చని వివరించింది. దీనికి ప్రభుత్వం ప్రారంభంలో రూ. 500 కోట్లు మూలనిధిని సమకూర్చాలని సూచించింది. తద్వారా అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇటు పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటు జనధన యోజన కీలక పాత్ర పోషించగలవని తెలిపింది. -
ఎంఈఓల బదిలీల్లో జాప్యం!
తేలని నిబంధనలు వేర్వేరుగా జెడ్పీ, ప్రభుత్వ సర్వీసులు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఎంఈఓల బదిలీల్లో జాప్యం జరుగుతోంది. నిబంధనలు, కోర్టు కేసుల కారణంగా అసలు బదిలీలు జరుగుతాయా? లేదా అనే సందేహం కలుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల నిబంధనలు వేర్వేరుగా ఉండటమే బదిలీ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ హెచ్ఎంలు, ఎంఈఓలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించడంతో వివాదం కొనసాగుతోంది. నిబంధనలను ఏకీకృతం చేయాలని సుమారు 15 ఏళ్ల క్రితం ఎంఈఓ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు నడుస్తుడగా అక్టోబర్ 30న గుంటూరులో రెగ్యులర్ ఎంఈఓల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ హడావుడిగా చేపట్టారు. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో హాజరైన ఎంఈఓల నుంచి ఆప్షన్లను మాత్రమే తీసుకున్నారు. బదిలీల ఉత్తర్వులను వారికి ఇవ్వలేదు. పలు న్యాయ, సర్వీసు సంబంధిత అస్పష్టత కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. జిల్లాలో 14 మంది రెగ్యులర్ ఎంఈఓలు పని చేస్తున్నారు. వీరిలో 13 మంది ఆప్షన్ల ప్రక్రియలో తమకు ఇష్టమైన మండలాలను ఎంచుకున్నారు. ఒకరు మాత్రం ఆప్షన్ల ప్రక్రియకు హాజరు కాలేదు. ఎంఈఓల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో జరగాలని కొంత మంది, జిల్లాస్థాయిలో జరగాలని మరికొంత మంది వాదిస్తున్నారు. ఎంఈఓలు, హెచ్ఎంల బదిలీలు గుంటూరు ఆర్జేడీ పరిధిలోకి వస్తాయి. గుంటూరు, ఒంగోలులో హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో పనిచేస్తున్న వారు ఎప్పటికైనా సొంత ప్రాంతాలకు వెళ్తామనే ఆశ ఉండేది. ప్రస్తుతం అస్పష్టమైన విధానంతో వారి ఆశలు అడుగంటాయి. 2005లో జరిగిన బదిలీల్లో గుంటూరుకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు నుంచి కూడా గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన ఎంఈఓలు నెల్లూరులో పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సీనియార్టీ జాబితా, జిల్లా పరిషత్ సీనియార్టీని జాబితాలో ఏర్పడ్డ సందిగ్ధత వల్ల ఏ ప్రాంత ఎంఈఓలు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తోంది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఎంఈఓలకు జోనల్ స్థాయిలో, జెడ్పీ ఎంఈఓలకు జిల్లా స్థాయిలో బదిలీలు నిర్వహించడం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. దీంతో పాఠశాలల పర్యవేక్షణ తీవ్రంగా కుంటుపడుతోంది. జిల్లాలోని 46 మండలాలకు గానను 14 మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. వీరిలో ఒకరు సస్పెండ్ కావడంతో 13 మంది ఎంఈఓలు పని చేస్తున్నారు. మిగిలిన మండలాల్లో సీనియర్ హెచ్ఎంలు ఇన్చార్జ్ ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ, పథకాల అమలు, పాఠశాల నిర్వహణ తదితర పనులు వారికి తలకు మించిన భారంగా మారుతోంది. విద్యాబుద్ధులు చెప్పే శాఖలో నిర్దిష్టమైన నియమ నిబంధనలు లేకపోవడంతో జోనల్ స్థాయి, జిల్లా స్థాయి తేలని పక్షంలో బదిలీలు జరిగే ప్రసక్తే లేదని ఎంఈఓలు గుసగుసలాడుతున్నారు. ఏళ్ల తరబడి పరాయి జిల్లాల్లో పనిచేస్తున్న తమను జిల్లా పరిధిలో బదిలీ చేస్తే ఒప్పుకునేది లేదని కొంత మంది ఎంఈఓలు కోర్టులను ఆశ్రయించారు. మంత్రి మౌఖిక ఆదేశాలతో అర్జెంట్ అర్జెంట్‌గా ఆప్షన్ల ప్రక్రియ జరిపారని, కోర్టులో ఉన్న అంశాన్ని పక్కన బెట్టి బదిలీలు జరగడం ఎంత వరకు సాధ్యమో వేచి చూడాల్సిందే. -
‘మీ-సేవ’ల మంజూరులో గోల్మాల్?
ప్రగతినగర్ : ప్రభుత్వ సేవలు ప్రజలకు సులువుగా, వేగవంతంగా అందించేందుకు గత సర్కారు మీ-సేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవి ప్రజా పనులకు సత్వర పరిష్కారాలను అందిస్తున్నాయి. తహశీల్దార్, రిజిస్ట్రార్, పోలీస్, పోస్టాఫీస్, మున్సిపాలిటీ.. ఇలా పలు శాఖలకు సంబంధించని ఎన్నోరకాల సేవలను ఈ కేంద్రాలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు సైతం ఉపాధి లభించినట్లైంది. ఇలాంటి మీ-సేవ కేంద్రాల మంజూరు విషయంలో ఇటీవల జిల్లాలో ఇష్టానుసారంగా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలె బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాగు తాను బదిలీ అవుతున్నానని ఈఎస్డీ(ఎలక్ట్రానికల్ డెలివరీ సర్వీసెస్) జిల్లా మేనేజర్‌తో కుమ్మకైన సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జిల్లాలో సుమారు 30 మీ-సేవ కేంద్రాలను ఆగమేఘాల మీద మంజూరు చేశారు. నిబంధనలకు విరుద్దంగా మీ-సేవ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్న అనంతరం సెంటర్ మంజూరు కోసం అన్ని నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రూ. 12వేల డిపాజిట్ చెల్లించాలి. అయితే బదిలీ అయిన అధికారి, మీ-సేవ మేనేజర్లు కలిసి ఈఎస్డీ అధికారులను బోల్తా కొట్టించారు. తహశీల్దార్లతో సంబంధం లేకుండా ఈఎస్డీ అధికారులతో ఒప్పందం పెట్టుకొని మీ-సేవలకు సత్వరం మంజూరు చేశారు. ఒక్కో మీ-సేవ సెంటర్ మంజూరుకు రూ. 50వేల వరకు అడ్డగోలుగా వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అధికారులే నిబంధనలకు తుంగలో తొక్కి వసూళ్లకు పాల్పడుతుండటంతో.. ప్రజలకు సేవలందించాల్సిన పలు మీ-సేవ నిర్వాహకులు వారి దగ్గర అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రుసుము పది రూపాయాలే కదా అని అడిగితే.. ప్రభుత్వం రూపొందించిన రుసుము తీసుకుంటే కనీసం సెంటర్ అద్దె కూడా కట్టలేమంటూ.. వినియోగదారులకు తెగేసి చెబుతున్నారు. తహశీల్దార్లకు తెలియకుండానే జిల్లాలో మీ-సేవ కేంద్రాల మంజూరుకు జిల్లా జాయింట్ కలెక్టరే(జేసీ) సర్వాధికారి. అయితే మీ-సేవ సెంటర్ కోసం ముందుగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన అనంతరం తహశీల్దార్ వీఆర్ఓ, ఆర్ఐల ద్వారా ఎంక్వైరీ చేయించి ఆర్డీఓకు నివేదికను పంపుతారు. అనంతరం ఆర్డీఓ, తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓల పరిశీలన తర్వాత దరఖాస్తు ఫైలు కలెక్టరేట్ చేరుతుంది. జేసీ దానికి మంజూరు తెలిపిన అనంత రం తిరిగి ఆర్డీఓ, తహశీల్దార్ ద్వారా మీ-సేవ కేంద్రాల మేనేజర్‌కు అప్పగించాలి. అయితే ప్రస్తుతం బదిలీ అయిన సదరు జిల్లా అధికారి ఈ నిబంధనలన్నింటినీ అటకెక్కించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఒక్కో సెంటర్ నిర్వాహకుని వద్ద నుంచి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తహశీల్దార్ల ప్రమేయం లేకుండానే ఏకంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలో 14, కామారెడ్డి పరిధలో 8, బోధన్‌లో 7, ఆర్మూర్‌లో 2 మీ -సేవ కేంద్రాల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ సెంటర్ల మంజూరులో సదరు అధికారి ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 మొగిపురుగు.. తొలిచేస్తోంది ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు. లక్షణాలు కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది. నివారణ చర్యలు పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. -
చెల్లుచీటీ కాదు.. మందుచీటీ కావాలి
ప్రభుత్వ వేతనం కంటె రెండు మూడు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే వైద్యులు సైతం ప్రభుత్వ సేవలలో అవకాశం వస్తే సంతోషించేవారు. ఇందులో 80 శాతం స్వస్థలాలలో సేవకు మొగ్గు చూపేవారు. నగరాలూ గ్రామాల మధ్య పెరుగుతున్న అగాధం ప్రమాదకర కోణాలను తాకుతోంది. విద్య విషయంలో పెరిగిన అగాధమే వైద్యం లోనూ కనిపిస్తోంది. 2011 గణాంకాల ప్రకా రం దేశ జనాభా 121 కోట్లు. ఇందులో 83.3 కోట్లు (68 శాతం) గ్రామీణులు. శాస్త్ర పరిజ్ఞా నం ఎంతో విస్తరించినా జీవించే హక్కుకు సంబంధించి వీరికి వ్యవస్థ భరోసా ఇవ్వడం లేదు. వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోవడమంటే, జీవించే హక్కుకు వారిని దూరం చేయడమే. ‘సమానత్వం, వ్యాధి నిరోధకత, ఆరోగ్యవంతమైన జీవన విధానం అనే సూత్రాల ఆధారంగా ఆరోగ్య సేవలను వ్యవస్థీకరించుకోండి! డబ్బు చెల్లించినా, చెల్లించలేకపోయి నా అందరికీ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేసే ప్రభుత్వాని ఏర్పాటు చేసుకోండి. గ్రామాలూ, పట్టణాల అవసరాలను బేరీజు వేసుకుని జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కార్యకర్తలను తయారు చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టండి’ - ఇది ‘ఒకతరం అంతరాలు చెరిపివేద్దాం’ అన్న నివేదికలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇచ్చిన పిలుపు. కానీ మన ప్రభుత్వాలు ప్రజావసరాలకు అనుగుణంగా వైద్య విధానాన్ని రూపొం దించడం కంటె, వైద్యం వ్యాపారంగా మారి పోవడానికి వీలైన పరిస్థితులను కల్పిస్తున్నా యి. గ్రామాలకు అత్యద్భుతమైన సేవలు అందించే నమూనా దేశంలో ఉంది. భోర్ (1946), ముదిలియార్ (1962), కర్తార్‌సింగ్(1973), శ్రీవాస్తవ్ (1975) కమిటీలు, జాతీ య ఆరోగ్య ప్రణాళిక (1983), జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (2005)ల సుదీర్ఘ మేధామథనంతో ఆవిర్భవించిన నమూనా అది. దీని ప్రకారం 3 నుంచి 5 వేలు జనాభాకు ఉప కేంద్రం, 20 నుంచి 30 వేల జనా భా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ), 80 వేల నుంచి లక్ష జనాభాకు సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రకారం ప్రతి వేయి మందికి ఒక ఆశా కార్యకర్తను నియమించాలి. ఉప కేంద్రానికి ఇద్దరు మహి ళా ఆరోగ్య కార్యకర్తలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్త ఉంటారు. పీహెచ్‌సీకి ఒకరు లేదా ఇద్దరు వైద్యాధికారులు, 40 మంది వరకు పారా మెడికల్, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. గ్రామీణ వైద్య సేవలకు వైద్యాధికారి నాయకుడు. అది ధ్వంసమైనా, విజయవంతమైనా ఆయనతోనే. ఆశా కార్యకర్త కూడా కీలకమే. ఈ నమూనా శక్తిమంతమైనది. చాలా దేశాలు ఈర్ష్యపడే నమూనా. అయినా కునారిల్లి పోయిందంటే, అది మన లోపమే. 1968 ప్రాంతంలో ప్రతి వైద్య విద్యార్థి ఆలోచన దాదాపు ఒక్కటే. పట్టా తీసుకున్న తరువాత ఎన్నేళ్లకి ప్రభుత్వ డాక్టరుగా ఉద్యో గం వస్తుంది! ప్రభుత్వ వేతనం కంటె రెండు మూడురెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే వైద్యు లు సయితం ప్రభుత్వ సేవలలో అవకాశం వస్తే సంతోషించేవారు. ఇందులో 80 శాతం స్వస్థలాలలో సేవకు మొగ్గు చూపేవారు. పీజీ లో అవకాశం వచ్చిన వారు, బంగారు పతకాలు పొందిన వారు కూడా ఎంబీబీఎస్ పట్టాతోనే సేవలు చేయడానికి ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు సిబ్బంది లేక పీహెచ్‌సీలు కునారిల్లిపోయాయి. 2011 గణాంకాల ప్రకా రం దేశంలో 1,48, 124 ఉపకేంద్రాలు, 23, 887 పీహెచ్‌సీలు, 4,809 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 8 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అయితే 35,762 ఉప కేంద్రాలు, 7,048 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2766 సామాజిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది. ఇంకా 30,051 మంది వైద్యులు కావాలి. ప్రస్తుతం దేశంలో ఏటా 45 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు. ఒక్క ఏడాదిలో బయటకు వచ్చిన వైద్యులలో 70 శాతంతో ఈ అవసరాలు తీరతాయి. మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నవారు 7 లక్షల మంది. అయితే 83.3 కోట్ల గ్రామీణ జనాభాకు కావలసింది 31 వేలు మాత్రమే. ఇది గమనించాలి. వీటిని అధిగమించడం నేటి అవసరం. ప్రభుత్వం ప్రతి వైద్య విద్యార్థి ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాలలో పని చేయాలన్న నిబంధన పెడుతోంది. ఇది సమ స్యకు పరిష్కారం కాబోదు. ఏటా ఒక కొత్త డాక్టరును గ్రామీణులు చూడాలా? ఇది ఇద్దరికీ ఇష్టం కాని విషయమే. 1980 తరువాత ఏ వైద్య విద్యార్థి ఇక్కడ సేవ చేయడానికి ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల కొరత తీర్చడానికి బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) గురించి ఆలోచిస్తున్నారు. పార్లమెంటరీ సలహా సంఘం సిఫారసుకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమిది. వైద్యరంగ సమస్యలు డాక్టర్లూ, పాలకులూ ఆదర్శం పునాదిగా ఆలోచిస్తేనే పరిష్కారమవుతాయి. డాక్టర్ ఆరవీటి రామయోగయ్య -
సమ్మె సక్సెస్
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. గత 13 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం నుంచి ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సమ్మెతో సకలం బంద్ అయ్యింది. బస్సూ లేదు.. స్కూలూ లేదు.. ప్రభుత్వాఫీసూ లేదు.. పెట్రోల్ బంకూ లేదు.. అన్నీ పూర్తిగా మూతపడ్డాయి. జనజీవితం పూర్తిగా స్తంభించింది. అయినా జనం ఎవరూ ఇళ్లకు పరిమితం కాలేదు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వాకర్లు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారూ వయస్సుతో సంబంధం లేకుండా రోడ్డెక్కారు. సమైక్య నినాదంతో గర్జించారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి సమైక్యాంధ్రను కొనసాగించాలని నినాదాలు చేశారు. జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 55 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర సేవలు అందించే మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, గ్రామీణ నీటిసరఫరా, ఇరిగేషన్ సిబ్బందిని సమ్మె నుంచి మినహాయించారు. ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని మొత్తం 1,200 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ శుభకార్యాలకు వెళ్లేవారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. బంద్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో రైళ్లలో ప్రయాణానికి కూడా ప్రజలు ఆసక్తి చూపలేదు. స్వచ్ఛందంగా ఆందోళన.. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మచిలీపట్నం కోనేరుసెంటరులో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధ్వర్యంలో వేలాదిమందితో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. చారిత్రక కోనేరుసెంటరుకు చేరుకున్న సమైక్యవాదులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బెల్ కంపెనీ, పోస్టాఫీసులకు మంగళవారం సెలవు ప్రకటించారు. గుడివాడ పట్టణంతో పాటు గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో కూడా బంద్ విజయవంతంగా నిర్వహించారు. జేఏసీ నాయకులు గుడివాడలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ట్యాక్సీ వర్కర్స్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గుడివాడ పాత బైపాస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నేత మండలి హనుమంతరావు సమక్షంలో పాములపాడు కాలనీ ప్రజలు వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. 48 గంటల బంద్‌ను పురస్కరించుకుని సినిమా హాళ్లకు తాళాలు వేసి ఉద్యమంలో పాల్గొన్నారు. వత్సవాయి మండలంలోని కన్నెవీడు గ్రామంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు కలిసి సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. మండవల్లి మండలం పెరికేగూడెం వద్ద ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రోడ్డుపై సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కలిదిండి మండలం గుర్వాయిపాలెం వద్ద గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేశారు. మద్వానిగూడెం వద్ద కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మైలవరం నుంచి 15 మంది సమైక్యవాదులు పాదయాత్రతో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం జాతీయ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గ్రామంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. షేర్‌మహ్మద్‌పేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయవాడ రూరల్ మండల కార్యాలయాల కాంప్లెక్స్ వద్ద ఉద్యోగులు ‘జై సమైక్యాంధ్ర’, ‘తెలంగాణా వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎనికేపాడులో తీయరహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. చల్లపల్లి, అవనిగడ్డలో పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చల్లపల్లి ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై పలువురికి గడ్డాలు, క్రాఫ్ చేసి వినూత్న నిరసన చేపట్టారు. చల్లపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ , దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలకు నాయకులు పెళ్లి చేశారు. అవనిగడ్డలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు పాల్గొన్నారు. అవనిగడ్డలో రెండోరోజు దీక్షను వైఎస్సార్సీపీ నాయకులు గుడివాడ శివరావ్, యాసం చిట్టిబాబు ప్రారంభించారు. పామర్రులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్ సీపీ పాలక మండలి సభ్యులు కె.నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన ప్రారంభించగా, సాయంత్రం పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. పోరంకి గ్రామంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో తూముల సెంటర్లో యువత రిలేదీక్షలు జరిపారు. పెడన ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మద్దతు ప్రకటించారు. పలు పాఠశాలలకు చెందిన ఐదువేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు బంటుమిల్లి మెయిన్ రోడ్డు నుంచి పెడన బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో రాజకీయేతర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఐదు రోజుల బంద్‌లో భాగంగా తొలిరోజు నిరవధిక బంద్ విజయవంతమైంది. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడులో అంతర్గత రహదారిపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు