దేశానికే ఆదర్శం.. మన ‘సచివాలయం’ | Village secretariat system introduced by CM Jagan is now ideal for country | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శం.. మన ‘సచివాలయం’

Published Tue, Jun 8 2021 3:54 AM | Last Updated on Tue, Jun 8 2021 9:53 AM

Village secretariat system introduced by CM Jagan is now ideal for country - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలనాపరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు దేశానికే ఆదర్శమైంది. ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్న మన గ్రామ సచివాలయాల తరహాలోనే అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలోనే వీలైనన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలోనే 59 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశిస్తూ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తాజాగా ఒక మోడల్‌ సిటిజన్‌ చార్టర్‌ను ప్రకటించారు. ప్రతి సేవకు సంబంధించి ప్రజల నుంచి వినతి అందాక.. ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరించాలో నిర్దిష్ట గడువును విధించి, ఆ గడువులోగా వాటిని అందించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. మోడల్‌ సిటిజన్‌ చార్టర్‌ ప్రారంభ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

గ్రామ సచివాలయాల్లో అందుబాటులో 545 సేవలు..
మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో కేవలం 19 రకాల ప్రభుత్వ సేవలు మాత్రమే ఉండేవి. ఇవికాకుండా ఇంకేమైనా అవసరమైతే మండల, జిల్లా కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019, అక్టోబర్‌ 2న రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మారుమూల కుగ్రామంలో ఉండే సచివాలయంలో సైతం 2020 జనవరి 26 నుంచి ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని సేవలను అప్పటికప్పుడు, మరికొన్నింటిని 72 గంటల్లో, ఇంకొన్నింటిని సాధ్యమైన త్వరగా అందించేలా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించారు. అంతేకాకుండా 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రతి అభివృద్ది సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.   

గత 17 నెలల కాలంలో 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలు..
గత 17 నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలను ప్రజలు అందుకోగా.. అందులో 1.89 కోట్లు గ్రామీణ ప్రజలే పొందారు. సచివాలయాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు, మారుమూల కుగ్రామాల్లో ఉండేవారికి సమాన స్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు.. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు పది వేల జనాభా ఉండే గుంటూరు జిల్లా కాజ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య ఏడాదికి రెండు వందల లోపే ఉండేదని అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రమేష్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న రెండు సచివాలయాలకు రోజుకు 70 నుంచి 100 మంది వరకు వివిధ పనుల కోసం వస్తున్నారని చెప్పారు. 

1.34 లక్షల ఉద్యోగాల భర్తీతో సత్వరమే సేవలు
సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. అంతే వేగంగా పారదర్శకంగా వాటిని భర్తీ చేసి.. ప్రతి గ్రామ సచివాలయంలో 10–12 మంది ఉద్యోగులను నియమించింది. దీంతో 545 సేవలు ప్రజలకు సత్వరమే అందుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు మన రాష్ట్రంలో మాదిరిగానే అత్యధిక రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య నామమాత్రంగా ఉందని వివరించాయి.

ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రశంసలు.. 
ఇటీవల కరోనా కట్టడి సమయంలో, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సమీక్షలు నిర్వహించినప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్లు అందజేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మన రాష్ట్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవల పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికార వర్గాలు తెలిపాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement