AP Village And Ward Secretariats System Has Created New Record, Details Inside - Sakshi
Sakshi News home page

Grama And Ward Sachivalayam: సేవల్లో రికార్డు

Published Sun, Jan 29 2023 3:45 AM | Last Updated on Sun, Jan 29 2023 12:26 PM

System of village and ward secretariats in AP has created new record - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 25న ఒక్క రోజులో ఏకంగా 2.88 లక్షల మంది విన­తులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు­చేసిన విషయం తెలిసిందే.

నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలెవరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలు లేదంటే దగ్గర్లోని పట్టణాలు లేదా జిల్లా కేంద్రాలకో వెళ్లా­ల్సిన అవ­సరం లేకుండా వారి సొంత ఊర్లోనే ఆయా పను­లయ్యేలా ఓ వినూత్న, విప్లవాత్మక ఆలో­చనను ఆచర­ణలో పెట్టింది. ఈ పనులు దాదాపు పరిష్కా­రమయ్యేలా 2020 జనవరి 26 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసు­కొ­చ్చింది.

మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకు గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలను పొందారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామ వార్డు సచివా­లయాల ద్వారా ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలను మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది.

కానీ, గత బుధవారం ఒక్కరోజే 2.88 లక్షల మంది వివిధ రకాల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌లో అదేరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అది లేకుండా ఉంటే సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు తెలిపారు.

65 శాతానికి పైగా రెవెన్యూ సేవలే..
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లల్లో ప్రజలకు అందించిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా.. ఈ నెల 25న పరిష్కరించిన 2.88 లక్షల వినతులను చూసినా.. అందులో 65–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం ఒక రైతు తన సొంత పొలం వివరాలను పాస్‌ పుస్తకంలోగానీ, రెవెన్యూ శాఖ మీ–భూమి రికార్డులోగానీ నమోదు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవారు.

నెలల తరబడి మండలాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని పరిస్థితి. లంచాల బెడద వీటికి అదనం. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులో భూమి బదిలీకి సంబంధించి జరిగే మ్యూటేషన్‌ ప్రక్రియ వారి సొంత గ్రామాల్లోని గ్రామ సచివాలయాలోనే అత్యంత సులువుగా, ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోనే పూర్తిచేసి ఆ సమాచారాన్ని సంబంధిత యజమానికి మెసేజ్‌ పంపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఈసీ జారీ కూడా సచివాలయాల ద్వారానే లభిస్తోంది.

అలాగే, ఆదాయ, కుల ధృవీకరణ ప్రతాలు వంటి వాటికి గతంలో 30 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సగటున ఐదు రోజుల వ్యవధిలో సంబంధిత తహసీల్దార్‌ ఆమోదం పూర్తయి, సర్టిఫికెట్లను కూడా సచివాలయాల్లోనే జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 25న అందజేసిన సేవలలో కూడా రెవెన్యూ సంబంధిత సేవలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జగనన్న చేదోడు పథకం తుది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ రోజు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు.  

సేవల సంఖ్య, నాణ్యతలో పెరుగుదల
ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కాలేదు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, సేవల నాణ్యత పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టింది. ఉదా..

► ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఆధార్‌ వివరాలతో అనుసంధానం చేసి అమలుచేస్తుండడంతో ప్రభుత్వం కొత్తగా సచివాలయాల్లో ఆధార్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 

► రాష్ట్రంలోని ప్రతి ఐదు గ్రామ సచివాలయాల్లో ఒకచోట చొప్పున 2,377  సచివాలయాల్లో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటిదాకా ఆధార్‌ సేవలు లేని ప్రాంతాలను గుర్తించి ఆయా సచివాలయాల్లోనే ముందుగా వీటిని ఏర్పాటుచేశారు. 

► అలాగే, ఇళ్లు, భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను సైతం ప్రభుత్వం సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది. 1,537 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్థానిక సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేసింది. వీటిల్లో 51చోట్ల ఇప్పటికే ఆ సేవలు ప్రారంభయ్యాయి. 

► గత ఏడాది కాలంలో కొత్తగా మున్సిపల్‌ ప్రాంతాలకు సంబంధించి నీటి, ఆస్తిపన్నులు, ట్రాఫిక్‌ చలానాలు, రైతుల నీటి తీరువా బిల్లుల చెల్లింపులనూ ప్రభుత్వం సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. 

ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు నాంది పలికిన తర్వాత ప్రభుత్వంతో ఏ చిన్న పనిపడినా రోజుల తరబడి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెరిగి లంచాలకు తావులేకుండా పోయింది. రాబోయే రోజుల్లో సచివాలయాల్లో మరిన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
– బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) 

జిల్లాకొక సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు
సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎ­లాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటి­కప్పుడే వాటిని పరిష్కరించడానికి జిల్లాకొక సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిని ఏర్పాటుచేస్తోంది. అలాగే, సేవ­లు అందజేసే సమయంలో తలెత్తే సమ­స్య­లను పరి­ష్కరించేందుకు అవసరమైన శిక్షణ­నూ సి­బ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రా­బో­యే రోజుల్లో ఇంటినుంచే ఆన్‌లైన్‌ ద్వా­రా సచి­వాలయ  సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సం­బంధిత సర్టిఫికెట్ల సాఫ్ట్‌ కాపీలను వా­ట్సాప్‌ లింక్‌ ద్వారా పంపేందుకు యత్నిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement