
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు.
రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.