Employees Federation
-
ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లను చెల్లించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అలాగే జీపీఎఫ్‌కు సంబంధించిన కొన్ని బిల్లులను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల 31 నాటికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ బకాయిలు రూ.3వేల కోట్లను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హామీల అమల్లో భాగంగా మొదటగా ఏఈపీజీఎల్ఐ క్లెయిమ్స్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి కూడా కొన్ని బిల్లులు క్లియర్ చేసినట్లు చెప్పారని, మిగతా బిల్లులు కూడా షెడ్యూల్ ప్రకారం మార్చి 31లోపు చెల్లిస్తామని తెలిపినట్లు అరవ పాల్ వివరించారు. -
ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమిది.. సీఎం జగన్ చేసిన మేలును మరువం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
‘వీఆర్ఓల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ కృషి’
సాక్షి, తాడేపల్లి: వీఆర్ఓల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, ఫైనాన్స్ శాఖలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ఉన్న సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
మాట తప్పని సీఎం జగన్
కడప కోటిరెడ్డిసర్కిల్: నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీవో నంబరు 154 జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నూర్జహాన్ కల్యాణ మండపంలో వీఆర్వోలకు పదోన్నతుల కల్పనపై ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆగిపోయిన వీఆర్వోల పదోన్నతి.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అభిమానంతో అధికారం చేపట్టిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు. -
'పంచాయతీ' పెట్టిన చిచ్చు..
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా మెలిగే రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతల మధ్య పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సమయంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తగదని ఏకతాటిపై నిలిచిన అన్ని ఉద్యోగ సంఘాలు, కోర్టు తీర్పు నేపథ్యంలో వేరు పడ్డాయి. కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా రావడంతో తాము కమీషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని ఓ వర్గం మాట మార్చి, ఇతర సంఘాలపై నిందలు మోపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సచివాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘం నాయకుడితో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి ఆమర్యాదపూర్వకంగా వ్యవహరించారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అయితే దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి వివరణ ఇస్తూ.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు నా మీద చేసిన ఆరోపణలు బాధ కలిగించాయి, నేను ఏ రోజు కూడా సచివాలయానికి వచ్చిన ఏ ఉద్యోగ సంఘ నాయకుడితో కూడా ఆమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు, సచివాలయ గోడలపై క్యాలెండర్లు అంటించవద్దు అని చెబితే దానిని అపార్థం చేసుకొని బొప్పరాజు తనను బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తనను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల సంఘాలు బలపడటమో, బలహీనపడటమో జరగదు కానీ ఉద్యోగుల పరువు పోతుందని వెంకట రామిరెడ్డి వ్యాఖ్యానించారు. పోరాడి ఫలితం సాధించలేక పోయామని ఉద్యోగులు నిరాశలో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటే తమ పరువే పోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరం సంయమనంతో వ్యాహరిస్ధామని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వివాదానికి కారణం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ వర్గం మాట మార్చడమేనని సచివాలయ వర్గాల సమాచారం. -
‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరపవద్దని తాము ఎప్పుడూ అనలేదని.. కరోనా వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయనే చెబుతున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామన్నారు. సీఎస్‌ను కలిసి తమ సమస్యలను చెప్తామని. మహిళా ఉద్యోగులను ఎన్నికల నుంచి మినహాయించాలని ఆయన కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చదవండి: ‘దేశంలో కోరుకుంటున్న మార్పును ప్రభుత్వం చేసింది’ గతంలో ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?. పోలవరం, నవనిర్మాణ దీక్షలకు బస్సులు పెట్టి ఉద్యోగులను తరలించలేదా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్షం తమ గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమపై రాజకీయాలు చేయొద్ధని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై తాము ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ -
టీడీపీ నేతలు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మధ్య రగడ మొదలైంది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలు పణంగా పెట్టి తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు కల్పించిందని, మా ప్రాణాలకు రాజ్యాంగం ఏం విలువ ఇచ్చిందని మాత్రమే తాను ప్రశ్నించానని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు తనను వాడూ వీడూ అని సంబోధిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శించే నేతలను తాను కూడా అరేయ్ ఒరేయ్ అనగలనని, అలా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోలేనని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతవరణమే లేదని, ఈ విషయం నిమ్మగడ్డకు కూడా తెలుసునని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా, నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితే కూడా లేదని వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను రాజకీయ అనసరాల కోసం వాడుకుంది టీడీపీనేనని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నం అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓ మాజీ ఉద్యోగ సంఘ నేత వల్లే ఉద్యోగులకు రాజకీయాలతో ముడి పెట్టడం మొదలైందని అన్నారు. అతనితోనే ఆ రాజకీయం ఆగిపోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే ఆయన ఉద్యోగులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారన్నారు. తనపై దాడికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంపై రేపు డీజీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఎఫ్ జనరల్ సెక్రటరీ అరవపాల్ పాల్గొన్నారు. -
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
సర్వం సిద్ధం
రేపటి నుంచి మహిళా ఉద్యోగుల సదస్సు రెండు రోజుల పాటు నిర్వహణ {పారంభించనున్న సీఎం కేసీఆర్ నిట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి వెల్లడి హన్మకొండ చౌరస్తా : వరంగల్ నిట్ వేదికగా ఈ నెల 23, 24 తేదీల్లో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబిస్తారని చెప్పారు. హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న మహిళా ఉద్యోగులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సద స్సు కొనసాగుతుందన్నారు. మహిళా చట్టాల అమలు, సమస్యల పరిష్కారంపై సదస్సులో చర్చించి, డిక్లరేషన్ ఇవ్వనున్న ట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ విదానంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, పాత విధానాన్నే అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మహిళల సంక్షేమమే ద్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేలా సదస్సులో తీర్మానం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్, జాతీయ సదస్సు ఆహ్వాన కమిటీ చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు స్ఫూర్తి గా నిలిచిందని, ఇక్కడ మహిళా ఉద్యోగుల జాతీయ సదస్సు నిర్వహించడంతో జిల్లా ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు. మహిళలపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రజియాసుల్తానా, రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మహిళా భద్రత, సంక్షేమం కోసం షీ టీమ్స్, షీ షటిల్స్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. జాతీయ సదస్సుకు హాజరయ్యే ఉద్యోగిణులకు ప్రభుత్వం సెలవుగా ప్రకటిం చడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేశ్‌గౌడ్, టీజీఓ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రావు, టీఎన్జీఓ మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, రత్నవీరాచారి, రాంకిషన్, సోమయ్య, పుల్లూరి వేణుగోపాల్, పిన్నా మహేందర్, రాజ్యలక్ష్మి, వనజ, ఉపేందర్‌రెడ్డి, హసదుద్దీన్, రామునాయక్, ఆనంద్, అలివేలు, మంగతాయి, సదానందం పాల్గొన్నారు. -
1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?
-
1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?
‘విభజన’తో వీధిపాలు... మే నెలాఖరుకల్లా ఊస్టింగ్ వీరి ఉద్యోగాలు పోయినట్టే?! కాంట్రాక్టు ఉద్యోగులు 54,598 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 36,952 ఎన్ఎంఆర్, ఇతరులు 21,050 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో లక్ష మందికి పైగా చిరుద్యోగుల కుటుంబాల జీవనోపాధి మీద దెబ్బపడుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఏ ఉద్యోగినీ తీసేయాలని చెప్పకపోయినా.. ఆ ముసుగులో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, సూపర్-న్యూమరరీ, అడ్హాక్ పోస్టుల్లోని ఉద్యోగులను వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగుల లెక్కల ప్రకారం ఆయా పోస్టులను తొలగించారు. విభజన లెక్కల్లో ఈ పోస్టులను పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టంచేశారు. తొలి నుంచి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఏదోవిధంగా ఇంటికి పంపించాలని చూస్తున్న ఆర్థికశాఖకు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సాకుగా దొరికింది. దీంతో ఒక్క కలం పోటుతో లక్షకు పైగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువులను రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే తేదీకి రెండు రోజుల ముందుగానే అంటే మే నెలాఖరుకల్లా ఊడబీకాలని ఆర్థికశాఖ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. దీంతో లక్ష మందికి పైగా చిరుద్యోగులు వీధినపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? సాధారణంగా అయితే మరో మూడు నెలలు ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించారు. మూడు నెలలు పొడిగిస్తే జూన్ నెలాఖరు వరకు కొనసాగుతారని.. ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా.. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల పొడిగింపు మే నెలాఖరు వరకే ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాలకు సవాలక్ష సమస్యలు ఎదురుకానున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై దృష్టి సారించగలవా అనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడే నడుస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో 4వ తరగతి ఉద్యోగుల భర్తీని నిలుపుదల చేయడంతో అవసరమైన చోటల్లా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నారు. నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే వారు సరిగా పనిచేయరని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకుంటే ఉద్యోగ అభద్రతాభావంతో పనిచేస్తారనే సిద్ధాంతాన్ని బాబు ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే కిందిస్థాయి, మధ్యస్థాయిలో లక్షకుపైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఓ పేపర్ టైప్ చేయాలన్నా, ఫైలు ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా, కారులో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వేతనాల్లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. రెగ్యులరైజ్ చేయాలి: ఉద్యోగుల సమాఖ్య లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం మూడేసి నెలలు చొప్పున మాత్రమే పదవీ కాలాన్ని పెంచుతూ వారి జీవితాల్లో అభద్రతను నింపుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, సొసైటీల్లో కలిపి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 5,47 లక్షల మంది ఉన్నారని ఆయన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. -
నం.1గా వెలుగొందాలి - దాసరి
‘‘మన ఫిలిం ఫెడరేషన్‌కి సొంత భవనం ఏర్పాటు అనేది కొన్నేళ్ల కల. అది ఇప్పటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ కలిగిన మన ఫెడరేషన్ ఇకపై కూడా నంబర్‌వన్ ఫెడరేషన్‌గా వెలుగొందాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ‘ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం’ పేరుతో ఏ.పి.ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన భవన ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో దాసరి, బాలకృష్ణ చేతులమీదుగా జరిగింది. నాన్నగారి పేరు పెట్టినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. భవన అవసరాల నిమిత్తం నటి జమున 50 వేల రూపాయల చెక్ అందజేశారు. నిర్మాతలు డి.రామానాయుడు, శ్యాంప్రసాద్‌రెడ్డి కూడా చెరొక లక్ష రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఇంకా ఫెడరేషన్ అధ్యక్షులు కొమర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.