
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత ఏపీజీఎల్‌ఐ క్లెయిమ్‌లను చెల్లించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అలాగే జీపీఎఫ్‌కు సంబంధించిన కొన్ని బిల్లులను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది.
హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
ఈ నెల 31 నాటికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ బకాయిలు రూ.3వేల కోట్లను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హామీల అమల్లో భాగంగా మొదటగా ఏఈపీజీఎల్‌ఐ క్లెయిమ్స్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి కూడా కొన్ని బిల్లులు క్లియర్ చేసినట్లు చెప్పారని, మిగతా బిల్లులు కూడా షెడ్యూల్ ప్రకారం మార్చి 31లోపు చెల్లిస్తామని తెలిపినట్లు అరవ పాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment