Government of Andhra
-
AP: పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలిరోజే పది వేల డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ. 4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ. 11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ, యూజర్ ఛార్జిలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన రూ. 11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ. 18,600 స్టాంప్ డ్యూటీ, రూ. 2,325 రిజిస్ట్రేషన్ ఛార్జి, రూ. 500 యూజర్ ఛార్జి కలిపి మొత్తం రూ. 21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది. రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి.. పదిహేనురోజుల్లో 30.61 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లను మరింత వేగంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను (కన్వేయన్స్ డీడ్స్) లబ్ధిదారులకు అందించనున్నారు. రూ. 10 స్టాంప్ పేపర్లపై ఈ డీడ్ల ప్రింటింగ్‌ను రిజిస్ట్రేషన్లు అయినదాన్ని బట్టి జిల్లాల్లోనే చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్స్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లను చెల్లించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అలాగే జీపీఎఫ్‌కు సంబంధించిన కొన్ని బిల్లులను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల 31 నాటికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ బకాయిలు రూ.3వేల కోట్లను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హామీల అమల్లో భాగంగా మొదటగా ఏఈపీజీఎల్ఐ క్లెయిమ్స్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి కూడా కొన్ని బిల్లులు క్లియర్ చేసినట్లు చెప్పారని, మిగతా బిల్లులు కూడా షెడ్యూల్ ప్రకారం మార్చి 31లోపు చెల్లిస్తామని తెలిపినట్లు అరవ పాల్ వివరించారు. -
బస్సు ప్రమాద మృతులకు ఆర్థికసాయం
తిరుపతి తుడా/చంద్రగిరి: బస్సు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పదిమంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బుధవారం రూ.2లక్షల చొప్పున ధర్మవరంలో చెక్కులను అందజేయగా.. తిరుపతిలోని 8 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 42 మంది క్షతగాత్రులకు అక్కడే రూ.50వేల చొప్పున చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.21 లక్షల సాయం ప్రభుత్వం తరఫున అందింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భాకరాపేట లోయలో బస్సు ప్రమాదం చోటు చేసుకుందని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల స్పష్టం చేశారు. బుధవారం ఆయన భాకరాపేట కనుమలోని ప్రమాద స్థలాన్ని అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడుతో కలసి పరిశీలించారు. అతికష్టం మీద రోప్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు బస్సును పరిశీలించి పలు ఫొటోలను తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. కనుమలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
ఏపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ఆన్లైన్ టికెటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆన్లైన్ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే . ఈ బిల్లును మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. -
భారీగా వైద్య ఉపకరణాల కొనుగోలు
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య ఉపకరణాల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రోజుల్లోపు వయసున్న వారిని నియోనేటల్ అంటారు. ఇలాంటి వారికి కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్లలోపు చిన్నారులు కూడా శ్వాసకోశ ఇబ్బందులకు గురైన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తమయ్యారు. దీనికోసమే ఎప్పుడూ లేనంతగా 300 నియోనేటల్ వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. వీటిలో ఇప్పటికే 110 వెంటిలేటర్లు రాష్ట్రానికి చేరుకోగా, ఈనెల 15లోగా మిగతావి రానున్నాయి. 20 వేల ఆక్సిజన్ మాస్కులు వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ పడకల మీద వైద్యం పొందుతున్నప్పుడు ఆక్సిజన్ మాస్కులు అత్యవసరం. అందుకే 20 వేల మాస్కులు కొనుగోలు చేశారు. ఇవి ఇప్పటికే సరఫరా అయ్యాయి. చిన్నారులకు ఇచ్చే ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజెక్షన్లు 10 వేలు ఆర్డరు ఇవ్వగా, 1,750 సరఫరా అయ్యాయి. మిగతావి నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది. ఇబూప్రొఫిన్ సిరప్, అజిత్రోమైసిన్ ఓరల్, పారాసిటమాల్ ఓరల్, ప్రోబయోటిక్ సాచెట్స్ వంటివన్నీ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ ఈనెల 15లోగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లకు చేరుకోనున్నాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా పూర్తవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. -
కొను‘గోలు’ కొట్టాం!
సాక్షి, అమరావతి: కరోనా, లాక్డౌన్లతో దేశ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే.. దాన్ని త్వరితగతిన పెంచుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దీనికి రాష్ట్రంలో వసూలవుతున్న జీఎస్టీ గణాంకాలే నిదర్శనం. లాక్డౌన్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనపర్చడంతో పాటు దక్షిణాదిలో వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం మనదే. 2019–20లో జూన్ నుంచి డిసెంబర్ నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.14,940 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి డిసెంబర్ నాటికి 8.23 శాతం వృద్ధితో రూ.16,169 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. కోవిడ్ వంటి ఊహించని సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారానే ఇది సాధ్యమైందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల రూపంలో రూ.28,562.07 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా కొనుగోలు శక్తి పడిపోకుండా చర్యలు తీసుకుంది. దీనికి తోడు వర్క్ ఫ్రం హోమ్ వల్ల పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది స్వగ్రామాలకు రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమైంది. లాక్డౌన్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన గృహోపకరణాల అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సంక్షోభ సమయంలో సరైన నిర్ణయం కోవిడ్ వంటి ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చురుగ్గా ఉండాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. కానీ కోవిడ్–19 వల్ల చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోవడంతో జీతాలు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పన్ను వసూళ్లు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు బాగుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం అప్పులు పెరుగుతున్నా.. కోవిడ్–19 ప్రభావం తగ్గిన తర్వాత ఆదాయం పెంచుకోగలమన్న ధీమా ముఖ్యమంత్రిలో ఉన్నట్లు కనిపిస్తోంది. – ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు, హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఆంధ్రా విశ్వవిద్యాలయం రీస్టార్ట్‌కు తోడు సంక్షేమం కోవిడ్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగిందనడానికి జీఎస్టీ వసూళ్లలో నమోదవుతున్న వృద్ధే నిదర్శనం. లాక్డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రీస్టార్ట్ చర్యలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. అందుకే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. – పీయూష్ కుమార్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ -
టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం (ఫైలు)ను పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక బదిలీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున ముందుగా అందుకు సంబంధించిన కసరత్తును అధికారులు చేపట్టారు. ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మండలస్థాయి నుంచి వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. ►హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీవిరమణలతో అయ్యే ఖాళీల జాబితాలను పంపించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. ►అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపించాలని పేర్కొంది. సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోరాదని వివరించింది. ►మరోవైపు ఆయా జిల్లాల విద్యాధికారులు ఇందుకు అనుగుణంగా వివరాల సేకరణ చేపట్టారు. యుడైస్ కోడ్ ప్రామాణికంగా పాఠశాలల్లోని ఖాళీలల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా ఖాళీల సమాచారానికి కోడ్ జాగ్రత్తగా నమోదు చేయాలి. హెచ్ఆర్ఏను అనుసరించి నాలుగు కేటగిరీలుగా స్కూళ్లను చూపించాలి. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ స్కూళ్ల వివరాలు మాత్రమే నమోదు చేయాలి. ►సెప్టెంబర్ 1 నాటికి ఉండే ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. ►భాషా పండితుల (లాంగ్వేజ్ పండిట్) పోస్టులు స్కూల్ అసిస్టెంటు (లాంగ్వేజెస్)గా అప్‌గ్రేడ్ అయినందున వాటిని ఎల్పీగా పేర్కొనకూడదు. ►2015 నవంబర్ 18వ తేదీకన్నా ముందు తేదీల నుంచి ప్రస్తుత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, టీచర్ల వివరాలు సమర్పించాలి. ►1970 సెప్టెంబర్ 1 తరువాత పుట్టిన పురుష ఉపాధ్యాయులు బాలికల హైస్కూళ్లలో పనిచేస్తుంటే వారి వివరాలు ఇవ్వాలి. -
వైద్యం–ఆరోగ్యం’ పై మేధోమథనం
-
నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్: సీఎం జగన్
-
ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఈ ఏడాదికాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన మరణం తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ, 104.. 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశాం. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తాం. నవంబర్ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాం. క్యాన్సర్ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. స్పీచ్ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించా’’మని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చాం. బి గ్రేడ్‌లో ఉన్న ఆస్పత్రులు 6 నెలల్లో అన్ని వసతులు సమకూర్చుకోవాలి. 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్ 3వేల నుంచి 10 వేలకు పెంచాం. 1.33 లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. మరో రెండువారాల్లో మిగిలినవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే మందుల సంఖ్యను 230 నుంచి 500లకు పెంచాం. మందులను కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి ధైర్యంగా వెళ్లేలా ఆధునికీకరిస్తున్నాం. 70 లక్షల మంది విద్యార్థులకు కంటివెలుగు పరీక్షలు నిర్వహించాం. లక్షా 29వేల విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశాం. రాబోయే రోజుల్లో 46వేల మంది విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. రెండో విడతలో అవ్వా, తాతలకు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. దివ్యాంగులు సదర్ సర్టిఫికెట్ కోసం గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" చేపట్టాం. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులతోపాటు... ఐటీడీఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. 24 గంటలు వైద్యసహాయం అందుబాటులో ఉండేలా విలేజ్ క్లినిక్‌లు. రూ.2,600 కోట్లతో విలేజ్, వార్డు క్లినిక్‌లు. రూ.671 కోట్లతో పీహెచ్‌సీలను కూడా ఆధునీకరిస్తున్నాం. జులై 1 నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తాం. ఆరోగ్య సమస్యలపై 14410పై టెలీమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. వైద్యులు సూచించే మందులను కూడా డోర్‌డెలివరీ చేసేలా చర్యలు. ఇంటివద్దకే వైద్యం అందించేలా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ను అందుబాటులో ఉంచుతాం. 9,712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని కొత్తగా నియమిస్తున్నాం. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రస్థానం కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేశాం. 70 రోజుల్లోనే 13 జిల్లాల్లో ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. రోజుకు 11వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మిలియన్‌కు 6,627 పరీక్షలు చేస్తూ.. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. దేశంలో పాజిటివిటీ రేటు 4.71శాతం కాగా.. ఏపీలో 0.97 మాత్రమే. దేశంలో రికవరి రేటు 42.75 శాతం కాగా.. ఏపీలో 65.49 శాతం. దేశంలో మరణాల రేటు 2.86 శాతం కాగా.. ఏపీలో 1.82శాతం. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నాం. కరోనా రోగులను వివక్షతతో చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రస్థాయిలో 5 కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. 65 జిల్లాస్థాయి ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తెచ్చాం. -
విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
-
విమాన ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల రాకపోకలకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించింది. డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమాన ప్రయాణికులు స్పందన వెబ్సైట్లో సమాచారం పొందుపరచాలని, స్పందనలో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఎయిర్‌లైన్స్ టికెట్లను అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. లక్షణాలున్న వారిని పరీక్షించి 7 రోజులు క్వారంటైన్లో ఉంచాలని, ఆ తర్వాత నెగిటివ్ వస్తే మరో 7 రోజులు హోంక్వారంటైన్‌కు పంపాలని ఆదేశించింది. హైరిస్క్ ప్రాంతాలైన చెన్నై, ముంబై, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.ఇతర ప్రాంతాల నుంచి వస్తే 14 రోజులు హోం క్వారంటైన్‌కు పంపాలని ప్రభుత్వం పేర్కొంది. -
కోలుకున్న తొలి కరోనా బాధితుడు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నిరంతర వైద్య పర్యవేక్షణతో 65 ఏళ్ల వ్యక్తి వైరస్ బారినుంచి బయటపడ్డాడు. మదీనా వెళ్లొచ్చిన సదరు వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ఈ నెల 17న విశాఖలోని టీబీసీడీ ఆసుపత్రిలో చేరాడు. బీపీ, డయాబెటీస్ ఉన్నప్పటికి చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడింది. నిన్న(ఆదివారం), ఈ రోజు(సోమవారం) నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువకుడికి, రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య ఏపీలో 23కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ రోజు 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు 649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 526 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని, ఇంకా 100 మంది ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మరో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడిందని, చిత్తూరు - 1, తూర్పు గోదావరి - 3, గుంటూరు - 4, కృష్ణా - 4, కర్నూలు - 1, నెల్లూరు - 1, ప్రకాశం - 3, విశాఖ - 6 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గత ప్రభుత్వ హాయాంలో చోటుచేసుకున్న రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ జరుపనుంది. రాజధాని వ్యవహారాల్లో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపైనా సిట్ విచారణ చేయనుంది. విశాఖపట్నం ఎస్పీ బాబుజి, ఇంటెలిజెన్స్ ఎస్పీ అట్టడా అప్పలనాయుడులతో పాటు మరో నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను సిట్ సభ్యులుగా నియమించింది. అమరావతిలో చోటుచేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై కూడా విచారించనుంది. అలాగే టీడీపీ నేతలు అక్రమించిన భూములను రాజధాని పరిధిలోకి తెస్తూ చేసిన అక్రమాలపై కూడా సిట్ విచారించనుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్‌కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా రాజధాని భూముల అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారం ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
కృష్ణపట్నంపై మళ్లీ మొదటికి..
విద్యుత్ ఉత్పత్తిపై మాట మార్చిన ఏపీ ప్రాజెక్టులో విజయవంతమైన వాణిజ్య ఉత్పత్తి బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంట్ షట్‌డౌన్ చేసిన ఏపీ కేంద్రం జోక్యం కోరిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఇంతకాలం ప్రయోగాత్మక ఉత్పత్తి అంటూ ప్రాజెక్టులోని మొత్తం విద్యుత్‌ను వాడుకుంటూ వచ్చిన ఆ రాష్ట్రం. తాజాగా వాణిజ్యోత్పత్తి ప్రారంభమైనా, బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంటును షట్‌డౌన్ చేసిం ది. వాటా ప్రకారం న్యాయంగా రావాల్సి న విద్యుత్‌ను పంపిణీ చేయాలని పట్టుపడుతున్న తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా బుధవారం అధికారికంగా వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం 72 గంటల పాటు నిర్విరామంగా ప్లాంట్‌ను నడిపి... విజయవంతంగా సీవోడీ ప్రక్రియను ఏపీ జెన్కో పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్ నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 53.89 శాతం విద్యుత్ తెలంగాణకు, 46.21 శాతం ఏపీకి పంపిణీ చేయాలి. అధికారిక ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. అందులోంచి తమకు రావాల్సిన వాటా అందుతుందని టీజెన్‌కో, రాష్ట్ర సర్కారు ఎదురుచూశాయి. కానీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన రోజునే.. బొగ్గు కొరత పేరు చెప్తూ కృష్ణపట్నం తొలి యూనిట్‌ను ఏపీ జెన్కో షట్‌డౌన్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ‘సీవోడీ విజయవంతంగా పూర్తయింది. తర్వాత అరగంట సేపు ప్లాంటు నడిచింది. బొగ్గు కొరత కారణంగా యూనిట్‌ను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నెలకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు అందాలి. కానీ రెండు లక్షల టన్నులే అందింది. బొగ్గు లేని కారణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయడం అనివార్యమైంది..’ అని ఏపీ జెన్కో వర్గాలు వెల్లడించాయి. దీంతో కృష్ణపట్నం విద్యుత్ వస్తుందని ఆశపడిన తెలంగాణ సర్కారు మళ్లీ భంగపడింది. కావాలనే..! వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. కానీ ఇంతకాలం ట్రయల్న్,ర ఇన్ఫర్మ్పవర్ పేరుతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు షెడ్యూల్ చేయకుండా ఏపీనే వినియోగించుకుంది. విద్యుత్ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోగాత్మక విద్యుత్ అంటూ పంపిణీకి నిరాకరించింది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఒప్పందాలు అమల్లోకి వస్తాయని గత నెలలో జరిగిన కృష్ణపట్నం పాలకమండలి సమావేశంలో ఏపీ జెన్కో అధికారులు ప్రకటించారు. తీరా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రోజునే షట్‌డౌన్ చేయటం అంటే.. తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడమేనని ఇక్కడి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆ రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది. అందువల్ల కృష్ణపట్నం ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసినా వారికి నష్టమేమీ లేదు. కానీ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణను మరింత చిక్కుల్లోకి నెట్టేయాలనే ఏపీ సర్కారు ఈ కుట్రకు పాల్పడిందని తెలంగాణ జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, సీఎం తన ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముందని వారు తెలిపారు. -
భరోసా ఏదీ?
పేద తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచే ‘బంగారు తల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపమాపేందుకు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘బంగారు తల్లి’ అమలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న వారు 32,008 మొదటి విడ త డబ్బులు అందుకున్న వారు 12,942 అర్హులుగా గుర్తించినా డబ్బులు రానివారు 13,799 ఇంటివద్ద ప్రసవం అయినవారు 3,115 సాక్షి, మహబూబ్‌నగర్: జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో సంబంధం లేకుండా బంగారు తల్లి పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 32,008 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం 12,942 మందికి జనన నమోదు సమయంలో ఇచ్చే రూ.2,500 మాత్రమే అందాయి. మిగతా పద్దుల మాటే మరిచారు. ఈ పథకానికి అర్హత సాధించిన 13,799 మంది లబ్ధిదారుల జాబితాను సెర్ప్‌కు పంపించారు. వీరికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. అలాగే ఇంటి వద్ద డెలివరీ జరిగిన 3,115 మంది కూడా డబ్బులు రాలేదు. పది నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు. స్పందన కరువు బంగారు తల్లికి దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదు. అయితే ఈ పథకాన్ని ప్రాథమికంగా నమోదు చేసుకునే వారు మండల సమాఖ్య కోఆర్డినేషన్(ఏపీఎం), మండల సమాఖ్య ప్రతినిధి, సీడీపీఓ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వారేమీ చేయలేకపోతున్నారు. అయితే మరికొన్ని చోట్ల బ్యాంకులతో సమస్య తలెత్తింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా తల్లి ఖాతాలో జమచేస్తారు. ఈ ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. కొన్నిఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లు అధికారుల రికార్డుల్లో పేర్కొంటున్నా వాస్తవానికి చేరడం లేదు. లబ్ధిపొందే తీరు.. ఆడపిల్ల పుట్టగానే జనన నమోదు సమయంలో నెలరోజుల వ్యవధిలోనే రూ.2,500 బ్యాంకు ఖాతాలో జయచేస్తారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాల వరకు టీకాల నిమిత్తం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అందనున్నాయి. 3- 5 ఏళ్ల మధ్య సంవత్సరానికి రూ.1,500, 6-10 ఏళ్ల వరకు ఏడాదికి రూ.రెండు వేల చొప్పున అందనుంది. 11-13 ఏళ్లవరకు అంటే ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ.2,500 అందుతుంది. 14-15 ఏళ్ల వరకు అంటే తొమ్మది, పదో తరగతి చదివే సమయంలో ఏడాదికి రూ.మూడువేల చొప్పున అందనుంది. 16-17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే వరకు ఏడాదికి రూ.3,500, 18- 21 ఏళ్ల వరకు గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో ఏడాదికి రూ.4వేల చొప్పున అందుతుంది. ఇలా మొత్తం రూ.55,500 బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా రూపొందించారు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పాసైతే రూ.50,000, గ్రాడ్యుయేషన్ పాసైతే రూ.లక్ష ఇలా మొత్తం రూ.1,55,000 అదనంగా అందనుంది. మొత్తం మీద బంగారు తల్లికి రూ.రెండు లక్షల మేర లబ్ధి చేకూరనుంది. డిసెంబర్లో డబ్బులు వచ్చే అవకాశముంది బంగారుతల్లి పథకం సంబంధించి డబ్బులు అందని మాట వాస్తవమే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు డబ్బులు రావడంలేదు. అర్హులైన 13వేల మందికి కూడా మొదటి విడతగా అందజేయాల్సిన డబ్బులు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత విధివిధానాలు ఖరారు కాలేదు. ప్రస్తుతం సభలో బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బంగారుతల్లి అర్హులకు వచ్చే నెలలో డబ్బులు వచ్చే అవకాశముంది. - చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎవర్ని అడిగినా సమాధానం లేదు బంగారు తల్లి పథకం కోసం ధరకాస్తులు చేసుకుని నాలుగు నెలలు అ వుతున్నా ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదు. కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పైసలు వస్తాయో రావో కూడా చెప్పడం లేదు. మా మండలంలో 680 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 120మందికి మాత్రమే రూ.2500 చొప్పున అందించారు. - సుమేరా, మానవపాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు బంగారుతల్లి పథకం కింద గ తేడాది నవంబర్ 9న అధికారులు బాండ్ పేపర్ ఇచ్చారు. ఏడాదిగా ఒక్కరూపాయి కూడా అందలేదు. ఐకేపీ అధికారులు బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెబుతున్నా.. డబ్బులు మాత్రం రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పాలెం యూబీఐ పరిధిలో బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు ఏ ఒక్కరికీ డబ్బులు రాలేదు. - గన్నోజు సుమతి, పాలెం -
‘స్మార్ట్’ బడ్జెట్
నిధుల సేకరణకు అధికారుల వ్యూహం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దులు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి. ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. వేలాది కోట్లు కావాలి.. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రహదారులకు రూ.10 వేల కోట్లు నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబడిపై జీహెచ్ఎంసీ దృష్టి ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి... చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు పార్కింగ్ ప్రదేశాలు వీధి దీపాలు 24 గంటలపాటు నీటి సరఫరా నిరంతరం విద్యుత్ సరఫరా భూగర్భడ్రైనేజీ చెరువుల పరిరక్షణ శుద్ధమైన తాగునీరు మెరుగైన ప్రజారవాణా భూగర్భకేబుళ్లు స్మార్ట్‌సిటీకి... వైఫై సేవలు ఆధునిక సాంకేతిక వనరులు ఇంట్లో కూర్చునే నెట్వర్క్తోవివిధ పనులు చేసుకోగలగడం ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం