సాక్షి, అమరావతి : ఈ ఏడాదికాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన మరణం తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ, 104.. 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశాం. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తాం. నవంబర్ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాం. క్యాన్సర్ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. స్పీచ్ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. నెట్‌వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించా’’మని పేర్కొన్నారు.
నెట్‌వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్
నెట్‌వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చాం. బి గ్రేడ్‌లో ఉన్న ఆస్పత్రులు 6 నెలల్లో అన్ని వసతులు సమకూర్చుకోవాలి. 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్ 3వేల నుంచి 10 వేలకు పెంచాం. 1.33 లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. మరో రెండువారాల్లో మిగిలినవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే మందుల సంఖ్యను 230 నుంచి 500లకు పెంచాం. మందులను కూడా డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి ధైర్యంగా వెళ్లేలా ఆధునికీకరిస్తున్నాం. 70 లక్షల మంది విద్యార్థులకు కంటివెలుగు పరీక్షలు నిర్వహించాం. లక్షా 29వేల విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశాం. రాబోయే రోజుల్లో 46వేల మంది విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. రెండో విడతలో అవ్వా, తాతలకు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. దివ్యాంగులు సదర్ సర్టిఫికెట్ కోసం గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం.
ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు"
ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" చేపట్టాం. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులతోపాటు... ఐటీడీఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. 24 గంటలు వైద్యసహాయం అందుబాటులో ఉండేలా విలేజ్ క్లినిక్‌లు. రూ.2,600 కోట్లతో విలేజ్, వార్డు క్లినిక్‌లు. రూ.671 కోట్లతో పీహెచ్‌సీలను కూడా ఆధునీకరిస్తున్నాం. జులై 1 నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తాం. ఆరోగ్య సమస్యలపై 14410పై టెలీమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. వైద్యులు సూచించే మందులను కూడా డోర్‌డెలివరీ చేసేలా చర్యలు. ఇంటివద్దకే వైద్యం అందించేలా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ను అందుబాటులో ఉంచుతాం. 9,712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని కొత్తగా నియమిస్తున్నాం.
కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రస్థానం
కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేశాం. 70 రోజుల్లోనే 13 జిల్లాల్లో ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. రోజుకు 11వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మిలియన్‌కు 6,627 పరీక్షలు చేస్తూ.. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. దేశంలో పాజిటివిటీ రేటు 4.71శాతం కాగా.. ఏపీలో 0.97 మాత్రమే. దేశంలో రికవరి రేటు 42.75 శాతం కాగా.. ఏపీలో 65.49 శాతం. దేశంలో మరణాల రేటు 2.86 శాతం కాగా.. ఏపీలో 1.82శాతం. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నాం. కరోనా రోగులను వివక్షతతో చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రస్థాయిలో 5 కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. 65 జిల్లాస్థాయి ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తెచ్చాం.
Comments
Please login to add a commentAdd a comment