సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలిరోజే పది వేల డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్‌ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ. 4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ. 11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ, యూజర్ ఛార్జిలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన రూ. 11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ. 18,600 స్టాంప్ డ్యూటీ, రూ. 2,325 రిజిస్ట్రేషన్ ఛార్జి, రూ. 500 యూజర్ ఛార్జి కలిపి మొత్తం రూ. 21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది.
రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్
15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి..
పదిహేనురోజుల్లో 30.61 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లను మరింత వేగంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను (కన్వేయన్స్ డీడ్స్) లబ్ధిదారులకు అందించనున్నారు. రూ. 10 స్టాంప్ పేపర్లపై ఈ డీడ్ల ప్రింటింగ్‌ను రిజిస్ట్రేషన్లు అయినదాన్ని బట్టి జిల్లాల్లోనే చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్స్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
AP: పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Published Thu, Feb 1 2024 3:42 AM | Last Updated on Thu, Feb 1 2024 6:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment