‘స్మార్ట్’ బడ్జెట్
- నిధుల సేకరణకు అధికారుల వ్యూహం
- రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక పద్దులు
- ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ నివేదిక
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి.
ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు.
ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్‌లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు.
వేలాది కోట్లు కావాలి..
స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్‌లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్‌ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్‌సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రహదారులకు రూ.10 వేల కోట్లు
నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్‌షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా.
కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే
నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు.
రాబడిపై జీహెచ్‌ఎంసీ దృష్టి
ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్‌ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్‌ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు.
వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి...
చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు
పార్కింగ్ ప్రదేశాలు
వీధి దీపాలు
24 గంటలపాటు నీటి సరఫరా
నిరంతరం విద్యుత్ సరఫరా
భూగర్భడ్రైనేజీ
చెరువుల పరిరక్షణ
శుద్ధమైన తాగునీరు
మెరుగైన ప్రజారవాణా
భూగర్భకేబుళ్లు
స్మార్ట్‌సిటీకి...
వైఫై సేవలు
ఆధునిక సాంకేతిక వనరులు
ఇంట్లో కూర్చునే నెట్‌వర్క్‌తోవివిధ పనులు చేసుకోగలగడం
ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం