బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు
రుణమాఫీకి రూ.31 వేల కోట్లు.. పంటల బీమాకు రూ.3 వేల కోట్లు
రైతుభరోసా రెండు సీజన్లకు కలిపి రూ.23 వేల కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు
ఇతర అవసరాలకూ భారీగానే నిధుల కోసం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.64 వేల కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలను స్వీకరిస్తోంది.
పథకాల వారీగా అవసరాలతో..: బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలను వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, రైతుభరోసా కోసం రూ.23 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు రూ.3 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. దీంతోపాటు రైతుబీమాకు రూ.1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల కోసం మిగతా నిధులను కోరారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి దాదాపు వెయ్యి కోట్లు కావాలని కోరినట్టు సమాచారం.
వ్యవసాయ యాంత్రీకరణ కీలకం
గత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. బయట మార్కెట్లో కొనాలంటే.. రైతులు ఆ ధరలు భరించడం కష్టం. కొరత కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2018 వరకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చిందని.. ఆ తర్వాత పథకం నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment