ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా! | Telangana Assembly Budget Sessions | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా!

Published Wed, Mar 19 2025 8:40 AM | Last Updated on Wed, Mar 19 2025 8:40 AM

Telangana Assembly Budget Sessions

గ్లోబల్‌ సిటీ వైపు అడుగులు వేస్తూ.. ప్రగతి పథాన దూసుకెళుతోంది మన మహా నగరం. ఎలివేటెడ్‌ కారిడార్‌లు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణాలు, మరోవైపు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరం. అలాగే మూసీకి పునరుజ్జీవం కల్పంచాలనే సంకల్పంతో ఉంది. 

నది సుందరీకరణకు నడుం బిగించింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి సైతం ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమరి్పంచింది. ఇలా వివిధ విభాగాలు నిధుల కేటాయింపులపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. బుధవారం శాసన సభలో డిప్యూటీ సీఎం, విత్త మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో భాగ్యనగరానికి ఎంతమేరకు ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి మరి. 

హైదరాబాద్‌ మహా నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు గ్లోబల్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ప్రారంత్సవాలు పూర్తి చేసుకున్న  ప్రాజెక్టులకు నిధుల కొరతే ప్రధాన సమస్యగా మారింది. నగరానికి ఉత్తరం వైపు రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌లతో పాటు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్‌ నోటీసులను వెల్లడించింది. మరోవైపు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు  ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు సావరిన్‌ గ్యారెంటీ లభిస్తే ముందుకు  సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఆయా ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు లభిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. 

ఎలివేటెడ్‌ కారిడార్లు..  
ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌కు బేగంపేట్‌ విమానాశ్రయం వద్ద 600 మీటర్ల  సొరంగ మార్గానికి ఇటీవల ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి అనుమతి లభించడంతో నిర్మాణ సంస్థల నుంచి టెండర్‌లను ఆహ్వానిస్తూ హెచ్‌ఎండీఏ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణకయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట వరకు 18.1 కిలో మీటర్ల రెండో ఎలివేటెడ్‌ కారిడార్‌కు సుమారు 197 ఎకరాల  భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో 113.48 ఎకరాలు రక్షణశాఖ నుంచి సేకరించాల్సి ఉంది. మరో 83.72 ఎకరాల భూమిని  ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించాలి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,232 కోట్లు కానున్నట్లు అంచనా. ఈ మార్గంలో క్షేత్రస్థాయి సర్వేతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. రక్షణశాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నిర్మాణం చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధంగా ఉంది. కానీ.. నిధుల కొరతే ప్రధాన సమస్య. 

రతన్‌టాటా గ్రీర్‌ఫీల్డ్‌ రోడ్డు.. 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు ‘రతన్‌టాటా రోడ్డు’గా నామకరణం చేసింది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని  టాటా ఇంటర్‌చేంజ్‌ (రావిర్యాల) నుంచి ఆమన్‌గల్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు 41.50 కిలోమీటర్ల రేడియల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును రెండు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశలో రావిర్యాల నుంచి (టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వరకు 19.2 కిలో మీటర్లు పూర్తి చేస్తారు. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. రెండోదశలో  మీర్‌ఖాన్‌పేట్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వద్ద అమన్‌గల్‌ వరకు రూ.2,365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్‌ మండలాల్లోని 14 గ్రామాలకు ఈ రోడ్డుతో కనెక్టివిటీ సదుపాయం ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌ఎండీఏ టెండర్‌లను కూడా ఆహ్వానించింది. 

మెట్రో రెండో దశ.. 
మెట్రోరెండో దశలో రెండు  భాగాలుగా  విస్తరణకు  ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టులను రూపొందించింది. మొదటిభాగంగా 5 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి సుమారు రూ.24 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఎల్‌బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు. రాయదుర్గం నుంచి కోకాపేట్, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరించనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణతో పాటు అటు హైకోర్టు వరకు మరో లైన్‌ చేపట్టాల్సి ఉంది. మొత్తం 76.4 కిలోమీటర్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. 

దీంతో పాటు రెండో భాగంగా  జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు  22 కిలోమీటర్లు చేపట్టనున్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్కిల్‌ వర్సిటీ వరకు ఈ కారిడార్‌ నిర్మాణం కోసం సుమారు రూ.6 వేల  కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఫోర్త్‌సిటీతో పాటు నార్త్‌సిటీలో రెండు కారిడార్‌లకు సైతం డీపీఆర్‌లను  రూపొందించేందుకు హెచ్‌ఏఎంఎల్‌ కసరత్తు చేపట్టింది. రెండో దశలో మొదట ప్రతిపాదించిన 5 కారిడార్‌లు కలిపి 76.4 కిలోమీటర్లు కాగా, ఫోర్త్‌సిటీతో రెండో దశ 116.4 కిలోమీటర్లకు పెరగనుంది. అలాగే నార్త్‌సిటీ రెండు కారిడార్‌లతో కలిపి మొత్తం రెండో దశ ప్రాజెక్టు 161.4 కిలోమీటర్లకు చేరనుంది. దీంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును  చేపట్టాలనేది 
ప్రతిపాదన.

మూసీ మెరిసేనా? 
మూసీ నదికి పునరుజ్జీ  కల్పించాలన్న ముఖ్యమంత్రి కల బడ్జెట్‌ కేటాయింపులతో తీరనుంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై మూసీ రిఫర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) కోటి ఆశలు పెట్టకుంది. తొలి దశలో ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు ఉన్న 8.5 కి.మీ. రెండు వైపులా 21 కి.మీ. మేర మూసీ నదీ సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయా అభివృద్ధి పనులకు తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్‌ ప్రణాళిక రూపకల్పనలపై ఎంఆర్‌డీసీఎల్‌ అధికారులు దృష్టి సారించారు. 

2030 డిసెంబర్‌ 30 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి మూసీకి 5 టీఎంసీల నీటిని తరలించి, నదిని శుద్ధి చేయడంతో పాటు మూసీ చుట్టూ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. అలాగే మూసీపై 11 వారసత్వ వంతెనలను నిర్మించనున్నారు. నది బాపూఘాట్‌ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు అమ్యూజ్‌మెంట్‌పార్క్, వాటర్‌ ఫాల్స్, చి్రల్డన్‌ వాటర్‌ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, సైకిల్‌ ట్రాక్‌లు, గ్రీన్‌ స్పేస్‌లు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్‌ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు.

జలమండలికి 
‘నిధుల’ వరద పారేనా! 
ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. గోదావరి రెండు, మూడో దశ పనులు, ఓటర్‌ రింగ్‌ రోడ్‌ తాగునీటి సరఫరా పథకం–3, ఎస్టీపీ, రుణాల చెల్లింపు, ఉచిత నీరు, విద్యుత్‌ రాయితీ కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేసింది.   గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.5,650 కోట్లతో ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం రూ.3,385 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా రూ.4 వేల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు ఉండవచ్చని జలమండలి ఆశలు పెట్టుకుంది. మహా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్‌–2, 3 నిర్మాణ పనుల మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం  భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా కింద అవసరమైన నిధుల కేటాయింపునకు  ప్రతిపాదనలు సమర్పించింది. ఓటర్‌ రింగ్‌రోడ్‌ తాగునీటి సరఫరా పథకం–3, సుంకిశాల పనులు చేపట్టేందుకు నిధులు అవసరమని భావిస్తోంది. వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా కొత్త ఎస్టీపీ ప్రాజెక్టుల మిగిలిన పనుల కోసం, ఉచిత నీటి సరఫరా నిధుపై జల మండలి ఆశలు పెట్టుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement