elevated corridor
-
రయ్ రయ్‌మనేలా
కంటోన్మెంట్: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది. కారిడార్ నిర్మాణం ఇలా రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్ నుంచి మొదలై కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి. ముఖ్యాంశాలు... ♦ మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ♦ ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ. ♦ అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ. ♦ పియర్స్: 287 ♦ అవసరమైన భూమి: 197.20 ఎకరాలు ♦ రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు ♦ ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు ♦ ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు ఇవీ ప్రయోజనాలు ♦ రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చెల్లు ♦ కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణం ♦ ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం ♦ సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం ♦ మేడ్చల్–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు లబ్ధిపొందనున్నారు. -
ప్రజల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ (TIMS) సమీపంలో సీఎం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. రూ. 2,232 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని రేవంత్ విమర్శించారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. చదవండి: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు భైముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణశాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని దుయ్యబట్టారు. ‘ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే. కేసీఆర్ హయాంలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు. ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.’ అని రేవంత్ పేర్కొన్నారు. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
జూబ్లీ జర్నీ.. ఇక జిగేల్
సాక్షి, సిటీబ్యూరో: కోర్‌సిటీలోని ఖైరతాబాద్, పంజగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల నుంచి మైండ్‌స్పేస్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు.. ఆప్రాంతాల నుంచి కోర్‌సిటీలోకి వచ్చే ప్రయాణికులు ఇక సాఫీగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టిన పనుల్లోని ‘జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్’ పనులు పూర్తయ్యాయి. లాక్డౌన్ సమయాన్ని బాగా వినియోగించుకొని పనుల్ని వడివడిగా చేయడంతో కారిడార్ పనులు పూర్తయ్యాయి. బ్లాక్‌టాప్, లేన్‌మార్కింగ్‌లు కూడా పూర్తయి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అయితే దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జికి సంబంధించిన ప్రత్యేక దీపకాంతుల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాకే దాంతోపాటు దీన్నీ ప్రారంభించాలనేది ప్రభుత్వ యోచన. దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి పనులు కూడా పూర్తయినప్పటికీ విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యేందుకు దాదాపు రెండు వారాలు పట్టవచ్చునని తెలుస్తోంది. జూబ్లీ చెక్‌పోస్ట్ దగ్గరి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వరకు సాఫీగా సాగిపోయేందుకు రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ, భూసేకరణ ఇబ్బందులతో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యాన్ని పూర్తిచేయడంతో పాటు మరింత త్వరితంగా పనులు చేసేందుకు లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నుంచి ఐటీకారిడార్ ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్‌నెంబర్ 36ను ఎక్కువగా వినియోగించుకుంటుండంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఐటీకారిడార్‌లో ఉద్యోగాలు చేసే లక్షల మంది రోడ్‌నెంబర్ 36 మీదుగానే హైటెక్‌సిటీ, మాదాపూర్, ఖాజాగూడ తదితరప్రాంతాలకు వెళ్తున్నారు. రద్దీ సమయాల్లో గంటకు దాదాపు 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కారిడార్ 45 వినియోగంలోకి వస్తే ఈ రద్దీ తగ్గుతుంది. రోడ్‌నెంబర్ 36తోపాటు మాదాపూర్ మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయి. రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ ఇలా.. ♦ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు అనుసంధానంగా దీన్ని నిర్మిస్తున్నారు. ♦ అంచనా వ్యయం: రూ.150 కోట్లు ♦ ఫ్లై ఓవర్ పొడవు: 1.7కి.మీ. ♦ ఫ్లై ఓవర్ వెడల్పు :16.60 మీటర్లు(4 లేన్లు) ♦ పనులు ప్రారంభం : ఏప్రిల్ 2018 ♦ పనులు పూర్తి :ఆగస్ట్ 2020 -
ఉప్పల్‌కు నయాలుక్!
మెట్రో కూతతో ఇప్పటికే హైటెక్ హంగులు సంతరించుకున్న ఉప్పల్ ప్రాంతం.. మరో సరికొత్త నిర్మాణానికి కేంద్రం కానుంది. ఇక్కడి నుంచి నారపల్లి వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌తో నయాలుక్ రానుంది. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నారపల్లి వరకు 6.25 కి.మీ మేర ఆకాశమార్గంలో ఆరు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఏర్పాట్లుచేస్తున్నారు. నిర్మాణ పనులకు ఈ నెల 5న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వరంగల్ ప్రధానరహదారిని నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దితే యాదాద్రి, వరంగల్ ప్రయాణం మరింత సులువు కానుంది. సాక్షి,సిటీబ్యూరో: ఉప్పల్ కేంద్రంగా సుమారు రూ.626.8 కోట్ల అంచనా వ్యయంతో 6.25 కి.మీ. మేర ఉప్పల్–నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ పనులను కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నగరం చుట్టుపక్కల నిర్మించే పలు రహదారుల అభివృద్ధి పనులను సైతం కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ ఏర్పాటు, ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను బల్దియా అధికారులు వేగవంతం చేశారు. ఈ పనులను 14 నెలల్లోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్అండ్బీ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి మెదక్ వరకు 62.9 కి.మీ. మార్గంలో రూ.426.52 కోట్ల అంచనా వ్యయంతో బహుళ వరుసల రహదారిని నిర్మించే పనులకు సైతం కేంద్ర మంత్రి అదేరోజున శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఆరాంఘర్–శంషాబాద్మార్గంలో ఆరు లేన్ల రహదారిని 10.048 కి.మీ మార్గంలో రూ.283.15 కోట్ల అంచనా వ్యయంతో తీర్చిదిద్దనున్నారు. ఇక దశాబ్దాలుగా అంబర్పేట్ వాసులు ఎదురుచూస్తున్న అంబర్పేట్ నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ను 1.415 కి.మీ. మార్గంలో రూ.186.71 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. మొత్తంగా నగరం నలుచెరుగులా 80.613 కి.మీ. మార్గంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్, బహుళ వరుసల రహదారులను తీర్చిదిద్దేందుకు రూ.1523.18 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పనుల పూర్తితో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ అవస్థలు తీరడంతో పాటు.. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే ఐటీ, బీపీఓ, కేపీఓ, పరిశ్రమల రంగాలకు కొంగుబంగారంగా నిలిచిన ఆయా ప్రాంతాలు తీరైన రహదారుల ఏర్పాటుతో అభివృద్ధికి చిరునామాగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!
- ఎలివేటెడ్ కారిడార్లకు 250 ఎకరాలు అవసరం - రక్షణశాఖ పరిధిలో 75 ఎకరాలు - భూసేకరణపై దృష్టి సారించిన సర్కార్ - ఆకాశమార్గాలపై తుది దశకు చేరిన అధ్యయనం - త్వరలో సమగ్ర నివేదిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశ మార్గాలపై అధ్యయనం తుది దశకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా కేంద్రాలకు మధ్య దూరభారాన్ని తగ్గించే లక్ష్యంతో మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వరకు, బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ రింగురోడ్డు వరకు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ రింగురోడ్డు మార్గాల్లో ఆకాశ రహదారులను నిర్మిస్తారు. ప్యారడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాలను ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం చేస్తుండగా, ఉప్పల్- ఘట్కేసర్ మార్గాన్ని తాజాగా వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. ఈ మూడు మార్గాల్లో సదరు కన్సెల్టెన్సీలు సమగ్రమైన నివేదికలు అందజేయవలసి ఉంది. అయితే గత ఏప్రిల్‌లోనే అధ్యయనం ప్రారంభించిన ఆర్వీ అసోసియేట్స్ ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల్లో త్వరలో తుది నివేదికను అందజేసే పనిలో ఉంది. ఆ సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు 250 ఎకరాల భూమి అవసరం. 20 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో 150 ఎకరాలు, 18 కిలోమీటర్ల నర్సాపూర్ ఎలివేటెడ్ మార్గంలో 100 ఎకరాలు సేకరించవలసి ఉంది. శామీర్‌పేట్ మార్గంలో 75 ఎకరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ రక్షణశాఖ పరిధిలో ఉన్న మరో 75 ఎకరాల భూసేకరణ ఇబ్బందిగా మారింది. రక్షణశాఖ నుంచి అనుమతి లభిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు. కేంద్రానికి లేఖ రాసిన సర్కార్ బాలానగర్-నర్సాపూర్ మార్గంలో భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మార్గంలోని వంద ఎకరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెవిన్యూ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు జాతీయ రహదారుల సంస్థ దృష్టి సారించింది. శామీర్‌పేట్ మార్గంలో సేకరించవలసిన 75 ఎకరాల రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు. ‘ప్రభుత్వం మరింత గట్టిగా చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తప్ప ఈ మార్గంలో భూ సేకరణ సాధ్యం కాదు. అదంతా ఒక కొలిక్కి వ స్తే తప్ప పనులు ప్రారంభం కాబోవు.’ అని నేషనల్ హైవేస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఆరు లైన్ల ఫ్లైఓవర్... సుమారు రూ.1600 కోట్లతో నిర్మించతలపెట్టిన శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో రోడ్డు మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తారు. ఆకాశమార్గంలో 6 లైన్ల రహదారులు నిర్మిస్తారు. దీంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సాగిపోతాయి. బాలానగర్-నర్సా పూర్, ఉప్పల్ - ఘట్కేసర్ మార్గాల్లోనూ 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గాలు నిర్మితమవుతాయి. దీనివల్ల వాహనాల ఫ్రీ ఫ్లో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో ప్రతి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్‌హెచ్-202 మార్గంలో ఉన్న ఉప్పల్- ఘట్కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకొంటే అక్కడి నుంచి ఉప్పల్ రింగురోడ్డుకు వచ్చేందుకే మరో గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఉప్పల్-ఘట్‌కేసర్‌పై తాజా అధ్యయనం ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనం ఆర్వీ అసోసియేట్స్ చేపట్టగా ఉప్పల్- ఘట్కేసర్ మార్గం ప్రాజెక్టును వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. 20 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే నిర్మించే అవకాశం ఉంది. -
హైదరాబాద్ లో ఆకాశ మార్గాలు
* రాజధానిలో ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. ట్యాంక్‌బండ్ చుట్టూ నింగినంటే సౌధాలను నిర్మించి హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ర్ట ప్రభుత్వం.. నగరం నలువైపులా రహదారుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రాజధాని నుంచి మూడు ప్రధాన మార్గాల్లోని ఔటర్ రింగురోడ్డు(ఓఆర్ఆర్)లను కలిపేవిధంగా ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేం దుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఉప్పల్ రింగురోడ్డు నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్ వరకు 20 కిలోమీటర్లు, బాలానగర్ చౌరస్తా నుంచి నర్సాపూర్ మార్గంలో ఔటర్ వరకు 20 కిలోమీటర్లు, పరేడ్ గ్రౌండ్స్ నుంచి బొల్లారం మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ హైవేలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికల కోసం అర్హతగల కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ మూడు మార్గాల్లో ఎలివేటెడ్ హైవేల నిర్మాణాల కోసం సర్వే నిర్వహించడంతో పాటు, డిజైన్ల రూపకల్పన, నిర్మాణ అంచనాలు తదితర అంశాలతో కన్సల్టెన్సీల నుంచి నివేదికలు కోరుతారు. ఇందుకోసం ఒక్కో మార్గానికి రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు వెచ్చించనున్నారు. రెండేళ్లలోనే రహదారులు అందుబాటులోకి వచ్చే విధంగాప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. వాహనదారులకు ఊరట.. ఈ మూడు ప్రధాన మార్గాల్లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఉప్పల్-ఘట్కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకొనిపోతున్నాయి. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు గంటన్నర వ్యవధిలో చేరుకుంటే, అక్కడి నుంచి ఉప్పల్‌కు వచ్చేందుకే మరో గంటన్నరకుపైగా పడుతోంది. మరోవైపు ఉప్పల్ నల్లచెరువు నుంచి రింగురోడ్డు వరకు ఉన్న ఇరుకైన రహదారి వల్ల, మెట్రో నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ మార్గంలో ఎలివేటెడ్ హైవే నిర్మాణం వల్ల ఘట్కేసర్ ఔటర్ రింగు రోడ్డు నుంచి నేరుగా ఉప్పల్ రింగ్‌రోడ్డుకు చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా కొద్ది నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. అలాగే ఎలివేటెడ్ హైవే వల్ల మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో సగానికిపైగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న మెట్రో మార్గాన్ని భవిష్యత్తులో ఘట్కేసర్ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ హైవే నిర్మాణం వల్ల మెట్రో నిర్మాణం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది. ఎలివేటెడ్ హైవే ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో మెట్రో నిర్మాణం సాధ్యమవుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. పైగా కోట్లాది రూపాయల అదనపు భారం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారి మార్గంలోనూ, నర్సాపూర్ మార్గంలోనూ ఎలివేటెడ్ రహదారుల నిర్మాణం వల్ల మెదక్, సిద్దిపేట్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. -
ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్‌లో మార్పులు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల స్వల్పమార్పులు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విరార్‌లోనే విరార్ సౌత్, విరార్ నార్త్ రెండు స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విరార్ సౌత్ స్టేషన్‌ను కొత్తగా నిర్మిస్తున్న కార్‌షెడ్ వద్ద నిర్మించాలని భావిస్తుండగా, విరార్ నార్త్ స్టేషన్‌ను ప్రస్తుతమున్న విరార్ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో నిర్మించనున్నారు. అంతేగాకుండా మహాలక్ష్మీ, విలేపార్లేలో కూడా స్టేషన్లను నిర్మించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మహాలక్ష్మీ స్టేషన్ పరిసరాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారసంస్థలు ఉండడంతో వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి తెలిపారు. అయితే విలేపార్లే ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఈ కారిడార్ నిర్మించడాన్ని నిషేధించారని, దీంతో ఇక్కడ భూగర్భ మార్గం నిర్మించి, స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఫలితంగా ఇయిర్ పోర్టు నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ కారిడార్ సౌకర్యవంతంగా ఉంటుందని, దీంతో ఈ ఎలివేటెడ్ రైలును వీరు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కారిడార్ ఏర్పాటుతో విలేపార్టే ప్రాంతం కూడా గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మీరారోడ్‌లో ఈ కారిడార్ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇక్కడ చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారుల పరిశీలనలో తేలింది.. దీంతో రైల్వే బోర్డు ఈ డిపోను నాయ్‌గావ్ స్టేషన్ వద్ద నిర్మించే ఆలోచన చేస్తోంది. ఈ కారిడార్ నిర్మాణం కోసం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో ప్రణాళిక సంఘం రూ.1,240 కోట్లు భరించనుంది. ఈ మోత్తాన్ని కారిడార్ నిర్మాణానికి అడ్డు వచ్చే కట్టడాలు, భూగర్భంలో ఉన్న వివిధ సంస్థల కేబుళ్లు, పైప్లైన్లు తొలగించడానికి ఉపయోగించనున్నారు. ఈ పనులను బీఎంసీ, టాటా పవర్ రిలయన్స్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, మహానగర్ గ్యాస్, తదితర 12 ఏజెన్సీలు చేపట్టనున్నాయి.