ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి: సీఎం రేవంత్
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణలోనైనా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి పాడి పంటలతో విలసిల్లేలా మా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఆదివారం ఆయన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు.
చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు
నారాయణపేట– మక్తల్– కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు కృష్ణా జలాలు పారిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆరేడు దశాబ్దాలుగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో వలసలు ఆపాలని తాను చేస్తున్న అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆరోపణలతో, చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించుకోవాలని.. అంతేతప్ప ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. కాళ్లలో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించబోరని హెచ్చరించారు.
అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు..
పాలమూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో రెండు వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచి్చనా ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జీఎమ్మార్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మాకు అవకాశం వచి్చంది.. అభివృద్ధి చేసుకోవద్దా..?
నాడు పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్‌కు పంపినా, రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయినా ఈ జిల్లాను పట్టించుకోలేదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు గుప్పించారు. ‘‘మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్నా మేం ఏనాడూ ఏడవలేదు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లా ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇచ్చారు. సీఎంగా కూడా అవకాశం ఇచ్చారు.. ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మాకు లేదా.. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేస్తున్నా నిరంతరం పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment