సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అ ధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని ఒక ట్రెండు రోజుల్లో శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా? జరిగినట్టు తేలితే బాధ్యులెవరు? అనేది తేలుస్తామని.. వారికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరే ముందు శాసనసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకమని.. కృష్ణాజలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల విలువైన పనులు కూడా జరిగాయి. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టుకు మార్పులు చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. రూ.38,500 కోట్ల వ్యయ అంచనాతో ప్రాణహిత– చేవెళ్లను రూపొందిస్తే.. కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందా? ఇంకెంత అవుతుందోనన్న దానిపై స్పష్టత లేదు.
పిట్టగూడులా కట్టారా? బాంబులతో పేల్చారా?
మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేం ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర్‌రావు (హరీ శ్‌రావును ఉద్దేశించి)తోపాటు కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజీకి ఏం జరిగిందో చూసి, తెలంగాణ ప్రజలకు వివరించాలి.
బస్సులో ప్రయాణించడానికి కష్టమైతే.. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అయితే.. ప్రతిపక్షాలే బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ చూడటానికే ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది’’ అని రేవంత్ చెప్పారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలున్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొనగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇసుకలో పేకమేడలు కట్టారా?
పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అంటున్నారు. వాళ్లు ఇసుకలో పేకమేడలు కట్టారా? సభలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టాక.. కాళేశ్వరంపై, కాళేశ్వర్‌రావుగా పిలుచుకున్న హరీశ్‌రావుపై, ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారిందన్న అంశంపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఏమేం ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారన్న దానిపై ప్రాథమిక నివేదిక అందింది.
Comments
Please login to add a commentAdd a comment