సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు?
ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు.
తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి
మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్‌రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment